Friday, July 30, 2021

నటుడిగా అనేక పాత్రలకే కళ్యాణ్ రామ్ ప్రాధాన్యం

Must Read

యుక్తవయసులో అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండే ఆ కుర్రాడు… వెండితెరపై ఇంతలా రొమాన్స్ పండిస్తున్నాడేమిటా అని ఎవరైనా అనుకుంటారు. తాతగారు, మహానటుడు ఎన్టీఆర్ పేరును తన సొంత బ్యానర్ కు పెట్టుకున్నందుకు సంతోషపడతారు. అతనే నందమూరి కళ్యాణ్ రామ్..ఇవాళ కళ్యాణ్‌ రామ్ 43వ పుట్టిన రోజు.

హైస్కూల్ చదువుకు ముందు కళ్యాణ్ రామ్ ను చూసిన వాళ్ళు ఈ పిల్లాడికి ముకుతాడు ఎవరు వేయగలరు? అని అనుకునేవారట. ఒక్కో సమయంలో తండ్రికే కాదు తాతగారికి సైతం కళ్యాణ్ రామ్ అర్థమయ్యే వాడు కాదట. కానీ విజయవాడలో టెన్త్ చదివిన సమయంలో తన ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చిందంటారు కళ్యాణ్ రామ్. కన్నతల్లి లక్ష్మితో పాటు, చదువు చెప్పిన గురువు చంద్రశేఖర్ గారి కారణంగానే తన కెరీర్ గాడిలో పడిందని చెబుతారు నందమూరి కళ్యాణ్ రామ్. గుంటూరులో ఇంటర్, కోయంబత్తూరులో ఇంజనీరింగ్, ఆ పైన యు.ఎస్.లో ఎమ్మెస్ చేసేశారు. ఉన్నత విద్యను అభ్యసించి కూడా మనసు చిత్రసీమ వైపు లాగడంతో అమెరికాలో ఉద్యోగానికి రాజీరామా చేసి హైదరాబాద్ వచ్చేశారు.

బాల నటుడిగా బాబాయి బాలకృష్ణ సినిమా ‘బాలగోపాలుడు’లో నటించినా, హీరోగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం ‘తొలి చూపులోనే’ సినిమాతోనే. అయితే ఆ తొలి చిత్రంతో పాటు, మలి చిత్రం ‘అభిమాన్యు’ కూడా కళ్యాణ్ రామ్ ను నిరాశకు గురిచేసింది. ఇక లాభం లేదని 2005లో తన తాతగారు ఎన్టీయార్ పేరుతో సొంత బ్యానర్ పెట్టి ‘అతనొక్కడే’ సినిమాను తీశారు కళ్యాణ్ రామ్. బహుశా అప్పటి నుండే పెద్దాయన ఆశీస్సులు మెండుగా కళ్యాణ్ కు లభించినట్టున్నాయి. అక్కడ నుండి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ముందుకే సాగుతున్నారు.

నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రను పోషిస్తూ ‘ఎన్టీయార్ కథానాయకుడు, ఎన్టీయార్ మహానాయకుడు’ చిత్రాలు నిర్మిస్తే… అదే సినిమాలో కళ్యాణ్ రామ్ సైతం తన తండ్రి హరికృష్ణ పాత్రను పోషించారు. ఇది కళ్యాణ్ రామ్ నట జీవితంలో ఓ మర్చిపోలేని ఘటన.

ఏదేమైనా… ఉన్నత చదువులు చదివి చిత్రసీమలోకి హీరోలుగా వచ్చి నిలదొక్కుకున్న వాళ్ళను మనం వేళ్ళ మీదే లెక్కించొచ్చు. అలాంటి వారిలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. తన తమ్ముడు ఎన్టీయార్ తో పాటు, బావమరిది హరికృష్ణ కూడా ఎప్పుడు సహాయంగా ఉంటారు అంటారు కళ్యాణ్‌ రామ్. వాళ్ళిద్దరి సహకారంతో కళ్యాణ్‌ రామ్ హీరోగా, ప్రొడ్యూసర్ గా జైత్రయాత్ర సాగించాలని కోరుకుందాం.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This