కోడి రామకృష్ణ రియ‌ల్ స్టోరీ …జీవితంలో న‌మ్మ‌లేని వాస్త‌వాలు

ఆయ‌న సినిమాలు స‌రికొత్త నాంధికి మార్గ‌ద‌ర్శ‌కాలు
ఆయ‌న సినిమాలు నేటి ద‌ర్శ‌కుల‌కి ఓ గొప్ప మార్గాలు
కధ క‌థ‌నం కొత్త‌గా ఉంటే అది ఆయ‌న చిత్రంగా, విజ‌యానికి కేరాఫ్ అడ్ర‌స్ గా మార్చుకున్న మ‌హ‌నీయ ద‌ర్శ‌కుడు
క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చి.. సాధార‌ణ చ‌ల‌న చిత్ర డైరెక్ట‌ర్ నుంచి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించారు
టాలీవుడ్ లో ఆయన హిట్టుకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.
పాల‌కొల్లు నుంచి వ‌చ్చిన సినిమా ముద్దుబిడ్డ‌ల్లో అత‌ను ఓ ముద్దు బిడ్డగా మారాడు
అత‌నే ద‌ర్శ‌కుడు కోడిరామ‌కృష్ణ‌

చిరంజీవితో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి అనేక హిట్ సినిమాలతో గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నారు. కోడి రామకృష్ణ పాలకొల్లులో జన్మించారు. పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేశారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథా నాయకులందరితో ఆయన సినిమాలు చేశారు. తెలుగులోనే కాక తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకూ దర్శకత్వం వహించారు. ఆయన కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే చిత్రలేఖనం వృత్తినీ చేపట్టారు. పగలు చదువుకోవడంతోపాటు అజంతా పెయింటింగ్స్ అనే కమర్షియల్ పెయింటింగ్స్ షాపును రాత్రిళ్ళు నిర్వహించేవారు. ఆయన చిత్రాల గురువు నాగేశ్వరరావుతో ఫొటోలు తీయించుకుని నటునిగా అవకాశం కోసం పలువురు దర్శకులకు పంపేవారు.

అయితే ఆ విషయం తెలిసిన ఆయన తండ్రి నరసింహమూర్తి – మన వంశంలో డిగ్రీ వరకూ చదువుకున్న వారే లేరు. నువ్వు డిగ్రీ పూర్తి చేస్తే చూడాలనివుంది. డిగ్రీ చదివాక నీకేది చేయాలని తోస్తే ఆ పనే చేసుకో అని కోరడంతో.. అప్పటి నుంచీ సినిమా ప్రయత్నాలు మానుకుని డిగ్రీ పూర్తిచేశారు.

పాలకొల్లు పట్టణం పలువురు నాటక కళాకారులు, సినీ కళాకారులను అందించడంతో పాటు లలితకళలకు ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంది. దాంతో చిన్నతనం నుంచీ రామకృష్ణకు కూడా నాటకాల పట్ల చాలా ఆసక్తివుండేది. చిన్నవయసు నుంచి నాటక ప్రదర్శనల పట్ల ఆసక్తితో నాటకాల్లో ప్రయత్నించేవారు. ఉన్నత పాఠశాల రోజుల నుంచి చదువుతో పాటు నాటకాలు ఆడేవారు. ఆయన కాలేజీ రోజుల్లో సాధారణ నాటక ప్రదర్శనలతో పాటుగా టిక్కెట్టు నాటకాలు కూడా ఆడేవారు. అందుకోసం మద్రాసు నుంచి కాకరాల వంటి నాటకరంగ ప్రముఖుల్ని కూడా నటించేందుకు రప్పించేవారు.

రామకృష్ణ తన స్నేహితుల్లోనూ రకరకాల ఊతపదాలు, మ్యానరిజాలు ఉన్నవారిని ఎన్నుకుని అందుకుతగ్గ పాత్రలు సృష్టించి వారితో నటింపజేసేవారు.

దాసరి నారాయణరావు తొలిచిత్రం తాత మనవడు చూశాకా రామకృష్ణ మనస్సులో దర్శకత్వ శాఖలో పనిచేస్తే ఆయన ద‌గ్గ‌ర పనిచేయాలన్న దృఢసంకల్పం ఏర్పడింది. ఆ సినిమా అర్థశతదినోత్సవం పాలకొల్లులోని మారుతీ టాకీస్‌లో జరిగే సందర్భాన్ని పురస్కరించుకుని దాసరితో మాట్లాడి తనకు దర్శకత్వ శాఖలో అవకాశం ఇమ్మని అడిగేందుకు కోడి రామకృష్ణ ప్రణాళిక వేసుకున్నారు.

ఆయన డిగ్రీ పూర్తిచేసుకుని వస్తే సినిమాల్లో చూద్దామనడంతో రామకృష్ణ డిగ్రీ పూర్తిచేసుకుని ఆ విషయాన్ని దాసరికి ఉత్తరం రాశారు. వెంటనే బయలుదేరమంటూ దాసరి నుంచి టెలిగ్రాం రావడంతో, ఛార్జీల కోసం పల్లెపడుచు నాటకాన్ని మిత్రులంతా ప్రదర్శించి ఆ డబ్బుతో మద్రాసు బయలుదేరారు.

దాసరి నారాయణరావు ఒకేసారి రెండు, మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తూండేవారు. ఆ క్రమంలో ఎవరికి వారే యమునా తీరే, స్వర్గం నరకం, మనుషుల్లో దేవుడు అన్న మూడు సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్‌గా తీసుకున్నారు. అలా దాసరి వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న కోడి రామకృష్ణ, ఎలాగైనా దాసరిని దర్శకుడిని చేసిన రాఘవ బ్యానర్లోనే తొలిగా దర్శకుడు కావాలని ఆశించారు. అందుకు అనుగుణంగా దాసరి-రాఘవ కాంబినేషన్‌లో నిర్మించిన తూర్పు పడమర సినిమాలో పట్టుబట్టి దర్శకత్వ శాఖలో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత కోడి రామకృష్ణకు దర్శకునిగా అవకాశం వచ్చింది.

కోడి రామకృష్ణకు దర్శకుడిగా తొలిచిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’(1981లో వచ్చింది). దర్శకుడిగా దాసరి నారాయణరావుని పరిచయంచేసిన నిర్మాత కె.రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణకు కూడా అవకాశం ఇచ్చారు. మొదట ఆయన తరంగిణి సినిమానే తొలిచిత్రంగా తీద్దామనుకున్నా అది వీలుపడక ఇంట్లో రామయ్యతో దర్శకుడయ్యారు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకునిగా ఆయన అరుదైన రికార్డు సాధించారు. తెలుగు సినిమా చరిత్రలో అలా వంద సినిమాలు తీసిన దర్శకులు కోడి రామకృష్ణ కాక దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్ మాత్రమే.

ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య తర్వాత ఆలయశిఖరం, సింహపురిసింహం, గూఢచారి నెం.1, రిక్షావోడు, అంజి చిత్రాలు నిర్మించారు. బాలకృష్ణకు సోలో హీరోగా తొలి విజయవంతమైన చిత్రం ‘మంగమ్మగారి మనవడు ఈయన చిత్రమే. తర్వాత బాలకృష్ణతో ముద్దుల కృష్ణయ్య, ముద్దులమావయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మేనల్లుడు, బాలగోపాలుడు వంటి చిత్రాలు తీసారు.

తర్వాత అమ్మోరు సినిమా సినిమా నుండి గ్రాఫిక్స్ వినియోగిస్తూ కొన్ని చిత్రాలు తీశారు దేవి, దేవీపుత్రుడు, దేవుళ్ళు, అంజి రాజకీయనేపథ్యంతో కొన్ని చిత్రాలు తీసారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన అరుంధతి చిత్రం పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే.

పది నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు ఆయ‌న‌ని వరించాయి. ఆయన 2012లో రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారాన్ని అందుకున్నారు. ఇక ఆయ‌న చ‌నిపోయి నేటికి ఏడాది అయింది, అయినా ఆయ‌న సినిమాలు మాత్రం నేటికి తెలుగువారిని ప‌ల‌క‌రిస్తూనే ఉంటాయి ,జ‌నం మ‌దిలో ఆయ‌న చిర‌స్మ‌ర‌నీయుడిగా నిలిచారు.

Content above bottom navigation