జక్కన్న చెక్కిన విలన్లు.. ఒక్కొక్కడు ఎంత పవర్ ఫుల్ అంటే?

107

ప్రతి ప్రేక్షకుడూ హీరోను, హీరోయిన్ ను చూడటానికే సినిమాకు వస్తాడు. ప్రేక్షకుడు కూడా హీరో గెలిస్తేనే చప్పట్లు కొడతారు, ఈలలు వేస్తారు. అలా కాకుండా.. హీరోపై విలన్‌ పైచేయి సాధిస్తే..? హీరోకంటే ఎక్కువ బలవంతుడిగా విలన్ ను చూపిస్తే ప్రేక్షకుడిలో అసహనం మొదలవుతుంది. హీరో విలన్ సమానంగా ఉండి, చివరికి అతని మీద హీరో పైచేయి సాధిస్తే ప్రేక్షకుడు పడే ఆనందం అంతాఇంతా కాదు. ఇలా హీరో, విలన్ల మధ్య పోరును రక్తికట్టించడంలో దర్శకధీరుడు రాజమౌళి దిట్ట. అందుకే రాజమౌళి సినిమాల్లో హీరోలతో పాటు విలన్లూ సినిమాపై చెరగని ముద్రవేస్తారు. అలా రాజమౌళి సినిమాల్లో తమ స్టామినా చూపించిన విలన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 • బాహుబలి భళ్లాలదేవ
  బాహుబలి సినిమా ప్రభాస్‌కు ఎంత పేరు తెచ్చిందో నటన పరంగా రానాకు అంతే పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు రానా నటించే ప్రతి సినిమాపై అంచనాలు భారీగానే ఉంటున్నాయి. ప్రభాస్‌ కు ధీటైన ప్రతినాయకుడు చూపించాలన్న ఉద్దేశంతో రానాను ఎంచుకున్నారు రాజమౌళి. జక్కన్న అంచనాలకు మించి రానా పాత్ర పండింది.
Image result for bhalladeva
 • సై భిక్షుయాదవ్‌
  విలన్‌ అంటే ఇలా ఉండాలి అని చూపించిన పాత్ర ‘భిక్షుయాదవ్‌’. ఆ పాత్రలో ప్రదీప్‌ రావత్‌ తనదైన నటనతో మెప్పించాడు. పొడవాటి మీసాలు, ముక్కుకు రింగు, మెడలో కంటె, వేసుకొని క్రూరంగా, చూడగానే భయం పుట్టేలా ఆయన ఆహార్యం ఉంటుంది. బలవంతుడైన భిక్షుయాదవ్‌ ను బలహీనులు, ఆవేశపరులైన విద్యార్థులు తమ తెలివి తేటలతో ముప్పుతిప్పలు పెట్టి తమ కాలేజ్‌ను దక్కించుకున్న విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సినిమా తర్వాత ప్రదీప్‌ రావత్‌కు అవకాశాలు బాగా పెరిగిపోయాయి. ఆ తర్వాత ఏ సినిమాలో చూసినా దాదాపు ఆయనే విలన్‌గా కనిపించేవారు.
 • మర్యాదగా కనిపించే విలన్‌ రామినీడు
  ‘మర్యాదరామన్న’ అనగానే మనకు ‘మర్యాద.. మర్యాద..’ అనే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌.. పదునైన కత్తుల మధ్య విలన్ల నుంచి తప్పించుకుంటున్న హీరో సునీల్‌ కళ్లముందుకు వస్తాడు. ఆ సినిమాలో రాయలసీమ యాసలో మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూనే.. గడప లోపల ఉన్న హీరో గడప దాటి బయటికి రాగానే నరికేయాలని చూస్తుంటాడు విలన్‌ రామినీడు. ఆ పాత్రలో నాగినీడు కనిపించి అభిమానులను మెప్పించారు. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నాగినీడు తెలుగులో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు.
 • క్యారక్టర్‌ ఆర్టిస్టు నుంచి కాట్‌ రాజుగా..
  కొన్ని పాత్రలు నటులకు ఎంతలా గుర్తింపు తెస్తాయంటే.. రీల్ పేరే రియల్‌ పేరుగా మారతాయి. అలాంటి గుర్తింపు వచ్చిన వారిలో సుప్రీత్ ఒకరు. ఈ పేరు చెబితే ఎవరు గుర్తుపట్టరు కానీ ‘ఛత్రపతి’లో ‘కాట్‌రాజ్‌’ గా అంటే వెంటనే గుర్తొస్తాడు. అప్పటి వరకూ చిన్నాచితకా పాత్రలు చేసుకునే సుప్రీత్‌ ఈ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి విలన్‌ దొరికాడు అనేంతలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించాడు.
 • రక్తం తాగే టిట్లా..
  జక్కన్న దెబ్బతో అప్పటి వరకూ సహాయ నటుడిగా పలు సినిమాల్లో కనిపించిన నటుడు అజయ్‌ ఒక్కసారిగా విలన్‌ గా మారిపోయాడు. ‘విక్రమార్కుడు’లో ఆరడుగుల ఎత్తు, అతిభయంకరమైన రూపంతో ఎవరూ గుర్తుపట్టలేనంతగా కనిపించాడు అజయ్‌. ‘టిట్లా’ పాత్రలో అజయ్‌ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా అజయ్‌ సినిమా కెరీర్‌లో ఓ మైలు రాయిగా నిలిచింది.
 • రణదేవ్‌ బిల్లా
  దేవ్‌ గిల్‌ అంటే ఎవరికీ తెలీదు కానీ రణదేవ్‌ బిల్లా అంటే తెలియని వారెవరు ఉండరు. ‘మగధీర’లో మిత్రవింద కోసం కాలభైరవుడుతో రణదేవ్‌బిల్లాగా పోరాడాడు. దేవ్‌గిల్‌ అప్పటి వరకూ తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో కనిపించినా రాని పేరు ‘మగధీర’తో వచ్చింది. ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా స్టార్‌ అయిపోయాడు.
Image result for sudeep eega
 • ఈగతో ఇబ్బంది పడ్డ సుదీప్‌.
  కిచ్చా సుదీప్‌.. కన్నడలో పెద్ద నటుడు. కానీ, తెలుగు ప్రేక్షకులకు తన నట విశ్వరూపం అంతగా తెలియదు. రాజమౌళి ‘ఈగ’ లో విలన్‌ గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో హీరో పాత్ర కంటే విలన్‌ ఎక్కువ సమయం తెరపై కనిపిస్తాడు. ఈ సినిమాతో సుదీప్‌ దక్షిణాదిన మోస్ట్‌వాంటెడ్‌ నటుడిగా మారాడు.
 • కాలకేయ..
  విలన్‌ గుంపులో ఎక్కడో ఓ మూలన ఉండే ప్రభాకర్‌ ‘బాహుబలి’లో కాలకేయుడిగా ఒక్కసారిగా తెలుగుతెరపైకి దూసుకొచ్చాడు. వింత భాషతో, భయంకర రూపంతో ‘బాహుబలి-1’ క్లైమాక్స్‌ కు మరింత బలాన్ని తెచ్చాడు. ఆ సినిమాలో కాలకేయ మాట్లాడిన భాష ఎప్పటికీ మర్చిపోలేం. ఆ భాషతోనే ప్రభాకర్‌ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత ప్రభాకర్‌ కు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు బాగానే పెరిగాయి.

ఇలా రాజమౌళి తన ప్రతి సినిమాలో కూడా హీరో రేంజ్ లో విలన్ లను పెట్టాడు. రాజమౌళి సినిమా అంటే హీరోకు ఎంత పేరు వస్తుందో విలన్ కు అంతే పేరు వస్తుంది. ప్రస్తుతం జక్కన్న RRR సినిమా తీస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఒక హీరో ఉంటేనే భయంకరమైన విలన్ ను పెట్టె జక్కన ఇప్పుడు స్టార్ హీరోలు ఉండడంతో ఇంకా పెద్ద విలన్ నే పెట్టాడు. ఇందులో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో అజయ్ దేవగన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు మరొక స్ట్రాంగ్ విలన్ దొరికినట్టే. చూడాలి మరి RRR విలన్ ను జక్కన్న ఎలా మలిచాడో.

Content above bottom navigation