మురారి సినిమా ఎలా మొదలైంది?.. మహేష్ బాబు, కృష్ణవంశీకి మధ్య జరిగిన గొడవేంటి?

68

క్రియేటివ్ డైరక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే ఒకప్పుడు అందరూ కృష్ణవంశీ గారి పేరే చెప్పేవారు. ఆయన తీసిన సినిమాల పవర్ అలాంటిది మరి. అప్పటి వరకు మిగితా సినిమాలలో ఒకరకంగా కనిపించిన హీరో కాస్త కృష్ణవంశీ సినిమాలో మరోరకంగా కనిపిస్తాడు. ఆర్టిస్టు నుండి ఎంత కావాలో అంతే నటనను రాబట్టగల సమర్ధుడు కృష్ణవంశీ. అలాంటి కృష్ణవంశీ డైరెక్షన్ లో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘మురారి’. సోనాలి బింద్రే కథానాయిక. 2001 ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మహేష్ బాబుకు ఫామిలీ ఆడియన్స్ ను దగ్గర చేసింది కూడా ఈ సినిమానే. అయితే ఈ రిలీజ్ అయ్యి నేటికి 19 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా అసలు ఈ సినిమా కథ ఎలా సిద్ధం అయ్యింది? అసలు ‘మురారి’ అని పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? లాంటి విషయాలను కృష్ణవంశీ పంచుకున్నారు. ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం.

ప్రతి సినిమాలో విలన్‌ ను హీరో చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే, ఈసారి విలన్ మనిషై ఉండకూడదనుకున్నాం. ఒక ఫోర్స్‌ అవ్వాలి. కానీ విలన్ అయినా ఆ ఫోర్స్ ను ఎలా జయించాలో ఎవరికీ తెలియకూడదు. లాస్ట్ మినిట్ వరకు ఆ పాయింట్‌ థ్రిల్ గా ఉండాలి. హీరో ఆ గండం నుంచి ఎలా బయటపడతాడా? అని ప్రేక్షకుడు చివరి వరకూ ఉత్కంఠతో చూస్తూ ఉండాలి. ప్రపంచానికి మంచి చేసే ఒక దేవత కోపానికి గురైన ఓ వ్యక్తి ఆ శాపం నుంచి ఎలా బయటపడ్డాడన్న దాని మీద లైన్ రాసుకుని ‘మురారి’ కథను డెవలప్‌ చేశాం. సినిమాలో మహేశ్‌బాబు రూపం ముగ్ధ మనోహరంగా ఉంటుంది. ఆయన్ను చూడగానే బృందావనం గుర్తొచ్చింది. అందుకే ‘మురారి’ అని పెట్టాం’’ అని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.

Image result for murari movie

‘మురారి’ సినిమా పరంగానే కాదు, మ్యూజికల్‌గానూ మంచి హిట్‌ అందుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన పాటలు ఎవర్‌గ్రీన్‌. ముఖ్యంగా ‘అలనాటి రామచంద్రుడి..’ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్. పెళ్లి వేడుకల్లో ఇప్పటికి మార్మోగుతూనే ఉంటుంది. అయితే, ఈ పాట వెనుక ఒక కథే ఉంది. సినిమాలో ఈ పాటను క్లైమాక్స్‌ ముందు వద్దని అందరూ అన్నారు. అయితే కృష్ణవంశీ పట్టుబట్టి ఈ పాటను క్లైమాక్స్ పెట్టించారు. మన తెలుగు కమర్షియల్‌ సినిమా ప్రకారం.. క్లైమాక్స్‌ ముందు మాస్‌ సాంగ్‌ ఉండాలి. కానీ, నేను ‘అలనాటి రామచంద్రుడి..’ పాట చివర్లో పెట్టాను. అందరూ వద్దని చెప్పారు. మొహమాటంతో మహేశ్‌బాబు కూడా నాకు చెప్పలేని పరిస్థితి. ఒకసారి ఆ విషయాన్ని ప్రస్తావిస్తే, ఆయన్ను ఒప్పించాను. అయితే చివరకు కృష్ణగారి వరకూ పంచాయితీ వెళ్లింది. ‘అబ్బాయ్‌.. చివర్లో మాస్‌ సాంగ్‌ లేకపోవడం కరెక్ట్‌ కాదు కదా. అనవసరంగా ప్రయోగం చేస్తున్నావు అన్నారు. సర్‌ ఇప్పుడు మన ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఈ సినిమా, ఈ పాటను నన్ను చెయ్యనీయడం. రెండోది ‘ఈ సినిమాను ఇక్కడే వదిలేసి వెళ్లిపోతా. మీరు కమర్షియల్‌ సాంగ్‌ చేసి విడుదల చేసుకోండి. నా పేరు కూడా వేయొద్దు. ఎందుకంటే నేను చేసే ఈ పాట దశాబ్దాల పాటు ఉండిపోతుంది. మీ అబ్బాయి కెరీర్‌ కు కావాలంటే ఆ చండాలాన్ని పెట్టుకోండి. నేను వెళ్లిపోతా అని అన్నాను. చివరకు కృష్ణగారు ఒప్పుకొన్నారు. సినిమా విడుదలైన తర్వాత అందరూ మెచ్చుకున్నారు అని ఆ పాట చివర్లో పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని చెప్పుకొచ్చారు కృష్ణవంశీ.

Content above bottom navigation