తిరుమలకు మళ్ళి వచ్చిన పృథ్వీ .. జగన్ పై సంచలన వ్యాఖ్యలు

79

ప్రముఖ సినీ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ ఆదివారం తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పృథ్వీరాజ్‌‌ను ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమించారు. అయితే ఛానల్ ఉద్యోగినితో అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆరోపణలు రావడం.. ఓ ఆడియో క్లిప్ వైరల్ కావడంతో వివాదం రేగింది. ఆయన్ను ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ వినిపించింది. ప్రజా, మహిళా సంఘాలు ధర్నాలు చేశాయి. ఆడియోటేపు వ్యవహారం.. తనపై ఆరోపణలు రావడంతో.. పృథ్వీరాజ్‌‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు టీటీడీ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక నెల రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేసిన పృథ్వీరాజ్ చాలా రోజుల తర్వాత మీడియాకు కనిపించారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఎంతో హుషారుగా ఉండే పృథ్వీరాజ్ ఈసారి బాగా ముభావంగా కనిపించారు. అలాగే చేతికి కట్టు కట్టుకుని తీరుమల వచ్చారు.

ఈ సందర్భంగా మీడియా పలకరించగా మాట్లాడకుండా వెళ్లిపోయారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో జరిగిన పరిణామాలపై మాట్లాడారు. గతంలో తనపై వచ్చిన ఆరోపణలు, ఫోన్ సంభాషణ వివాదంపై పృథ్వీ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలతో మానసికంగా ఇబ్బందిపడ్డానని.. ఎస్వీబీసీ ప్రక్షాళనకు ప్రయత్నించనందుకు తనకు ఈ గిఫ్ట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చినందుకే తనపై కుట్ర పన్నారన్నారు. తన చుట్టూ ఉండే వారే వెన్నుపోటు పొడిచారని పృథ్వీ తెలిపారు. సజ్జల, వైవీ, విజయసాయిరెడ్డిలకు మాత్రమే తాను జవాబుదారిగా ఉంటానన్నారు. రాజధాని రైతులను కించపరిచేలా తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదన్నారు. తాను ఏ సామాజిక వర్గాన్నీ టార్గెట్ చేయలేదని, అది దుష్ప్రచారం మాత్రమేనని పేర్కొన్నారు. జీవితాంతం తాను వైఎస్సార్‌సీపీలోనే ఉంటానని, శ్రీవారి ఆశీస్సులు ఉంటే మళ్లీ ఎస్వీబీసీ ఛైర్మన్‌ను అవుతాను అంటూ ధీమా వ్యక్తం చేశారు పృథ్వీరాజ్. తనపై వచ్చిన ఆరోపణలపై పృథ్వీ వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. ఆడియోను మార్చేసి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని.. నిజం త్వరలోనే బయటపడుతుంది అన్నారు.

Image result for actor pruthvi in thirumala

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన జగన్‌కు తాను చెడ్డ పేరు తీసుకు రావడం ఇష్టం లేదు అన్నారు. అందుకే తానే స్వచ్ఛందంగా ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ పదవి నుంచి తప్పుకున్న ఆయన, త్వరలోనే తన నిజాయితీని నిరూపించుకుంటానని చెప్పారు. ఇక పృథ్వీ రాజీనామా చేసిన తర్వాత ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిపై తర్వాత ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. కొత్తవారిని ఆ పదవిలో నియమిస్తారని ప్రచారం జరిగింది కానీ అనూహ్యంగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఛైర్మన్ పదవిని పక్కన పెట్టి.. ఎండీ పదవిని తెరపైకి తీసుకొచ్చింది. ఛానల్‌ ఎండీగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని నియమించారు. ధర్మారెడ్డి ప్రస్తుతం టీటీడీ అడిషనల్ ఈవోగా ఉన్నారు.. దీనితో పాటూ ఎస్వీబీసీ ఛానల్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వాస్తవానికి గతంలో ఎస్వీబీసీ బోర్డు ఏర్పాటైన తర్వాత ఎండీ పోస్టులో టీటీడీ ఈవోనే ఉండేవారు. ప్రభుత్వం నియమించిన చైర్మన్‌ కే ఎండీ బాధ్యతలనూ అప్పగిస్తూ వస్తున్నారు.

Content above bottom navigation