చూసీ చూడంగానే’ మూవీ రివ్యూ

108

మంచి సినిమాకి కావాల్సింది ఎప్పుడూ విక్టరీ ఒక్కటే కాదు.. ప్రేక్షకుల్లో క్రెడిబిలిటీ ఉండాలి. ‘పెళ్లి చూపులు’, ‘మెంటల్ మదిలో’ చిత్రాల ద్వారా మంచి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్న రాజ్ కందుకూరి తన తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన ‘చూసీ చూడంగానే’ చిత్రం నేడు థియేటర్స్‌లో విడుదలైంది.

కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో ముందు ఉండే రాజ్ కందుకూరి తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ సినిమా రూపొందిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తినెలకొంది. తొలి నుండి స్టార్ క్యాస్టింగ్ జోలికి పోకుండా కథను నమ్ముకుని సినిమాలు చేస్తారనే పేరు నిర్మాత రాజ్ కందుకూరికి ఉంది. ఈ సినిమా విషయంలోనూ అదే రిపీట్ చేశారు. తన కొడుకు క్యారెక్టర్ చుట్టూ అల్లిక కథను కాకుండా కథతో పాటు జర్నీ చేసే పాత్రను తన కొడుక్కి ఇచ్చి ఆయన మార్క్ నిలబెట్టుకున్నారు.

శేష సింధు రావ్ అనే మహిళా దర్శకురాలిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ మరో యూత్ ఫుల్ లవ్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు అందించారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? కొత్త హీరోతో.. కొత్త హీరోయిన్‌తో.. కొత్త దర్శకులు, టెక్నికల్ టీంతో వచ్చి ఈ కొత్త చిత్రం ‘చూసీ చూడంగానే’ ప్రేక్షకులు చూసేట్టుగా ఉందో లేదో సమీక్షలో తెలుసుకుందాం.

Image result for చూసీ చూడంగానే

యూత్ ఫుల్ లవ్ స్టోరీ అంటే అన్ని కథల మాదిరిగానే ఈ కథ కూడా కాలేజ్‌లో మొదలౌతోంది. సిద్ధూ (శివ) ఇష్టం లేకపోయినా బీటెక్‌లో జాయిన్ అవుతాడు. అలా తన పేరెంట్స్ (పవిత్రలోకేష్, అనీష్ కురువిల్ల) కొనిచ్చిన కొత్త బైక్‌తో కాలేజ్‌కి వెళ్తూ.. ‘చూసీ చూడంగానే’ ఐశ్వర్య (మాళవికా సతీశన్) ప్రేమలో పడతాడు. ఆమె కూడా అస్సలు లేటు చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతారు. మెల్ల మెల్లగా ఇద్దరి మధ్య గొడవలు మొదలౌతాయి. అయితే ఫైనల్ ఇయర్‌లోకి వచ్చేసరికి ఐశ్వర్య కావాలనే సిద్దుకి బ్రేకప్ చెప్పి వెళిపోతుంది.

ఒకవైపు తనకు ఇష్టం లేని చదువు చదవలేక.. కెరియర్‌పై క్లారిటీ లేని సిద్ధూ బీటెక్ ఆపేసి తనకు ఇష్టమైన ఫొటోగ్రఫీ చేస్తుంటాడు. అయితే ఫ్యాషన్ ఫొటోగ్రఫీ చేయాలనే తన కల తీరకపోగా.. పెళ్లి ఫొటోగ్రాఫర్‌గా లైఫ్ బండిని లాగించేస్తుంటాడు. అయితే మూడేళ్లు తరువాత ఒక పెళ్లిలో శృతి (వర్ష బొల్లమ్మ)ను ‘చూసీ చూడంగానే’ ఇష్టపడతాడు. తన ఫ్రెండ్ ద్వారా శృతితో స్నేహం చేసి ఆమెకు దగ్గరౌతాడు. ఆమెపై ఇష్టం పెంచుకుని తన ప్రేమను వ్యక్తపరచాలనుకుంటున్న సందర్భంలో పాత లవర్ ఐశ్వర్య సీన్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. శృతి స్నేహితురాలే ఈ ఐశ్వర్య అని తెలుసుకుంటాడు. అదే సందర్భంలో శృతికి లవర్ ఉన్నాడని తెలుసుకుంటాడు సిద్ధు. ఈ ట్రై యాంగిల్ లవ్ స్టోరీలో ఐశ్వర్య మళ్లీ ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? అసలు శృతి ఎవరు? తెరవెనుక జరిగిన కథ ఏంటి? అన్నదే మిగతా సినిమా.

Image result for chusi chudangane movie posters

పై కథ చూస్తే.. రొటీన్‌గా అన్ని యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ మాదిరే అనిపిస్తుంది. ఫస్టాఫ్ ట్విస్ట్ వచ్చే వరకూ థియేటర్స్‌లో ఉన్న ప్రేక్షకులకు అదే అనుభూతి కలుగుతుంది. అయితే ఇంటర్వెల్ తరువాత నుండి అప్పటి వరకూ నడిచిన కథతో పాటు బిహైండ్ ది స్క్రీన్‌లో మరో స్టోరీ జర్నీ చేస్తుంది. ఆ కథను ఆసక్తికరంగా రివీల్ చేయడంతో దర్శకురాలు రొటీన్ లవ్ స్టోరీకి డిఫరెంట్ ట్రీట్ మెంట్ ఇచ్చేరనే అనూభూతి కలుగుతుంది.

ఇక ఈ చిత్రంలో నటించిన హీరో హీరోయిన్లు ఆయా పాత్రల్లో అద్భుతంగా నటించారు. హీరో శివ అనుభవం ఉన్న నటుడిలా నటించారు. లవ్ అండ్ ఎమోషన్స్ సీన్లలో మంచి హావభావాలు పలికించారు. ఫస్టాఫ్‌లో శివ-మాళవికల మధ్య లవ్ సీన్లు పండాయి. ఇక సెకండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చిన మరో హీరోయిన్ వర్ష బొల్లమ్మ తన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేసింది. ఆమె పాత్ర సినిమాలో హైలైట్ అయ్యింది. ఎమోషన్స్ సీన్లలో హావభావాలు అద్భుతంగా పలికించింది. బాత్ రూంకి వెళ్లి అద్దంలో చూసి ఏడ్చే సన్నివేశం ఆమె నటనా ప్రతిభకు అద్దంపట్టింది. బబ్లీ యాక్టింగ్‌తో ఆకట్టుకుంటూనే భావోద్వేగ సన్నివేశాల్లో మైమరపించింది. లుక్స్ పరంగా గ్లామర్‌తో ఆకట్టుకున్న వర్ష ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలనని ఈ పాత్ర ద్వారా నిరూపించారు.

Image result for chusi chudangane movie posters

హీరోకి పేరెంట్స్‌గా నటించిన అనీష్, పవిత్రా లోకేష్ పాత్రలకు న్యాయం చేశారు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ యోగి పాత్రలో వెంకటేష్ కాకమాను పంచ్‌లు అక్కడక్కడా పేలాయి. ప్రీ క్లైమాక్స్‌లో తల్లీకొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ పండింది. దర్శకురాలు తాను రాసుకున్న కథకు మంచి పాత్రలను ఎన్నుకున్నారు.

అయితే ఫస్టాఫ్ మొత్తం రొటీన్‌గా సాగడం.. హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ సీన్లలో కాన్ ఫ్లిక్ట్ మిస్ ఫైర్ అయ్యిందనే ఫీల్ కలుగుతోంది. పైగా ఈ కథకు మెయిన్ ప్లాట్ అనేది లేకపోవడం మరో బలహీనత. ప్రేమించడం, విడిపోవడం.. మళ్లీ ఇంకో అమ్మాయి ప్రేమలో పడటం.. ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ కావడం.. ఇదంతా సినిమాటిక్‌గా అనిపిస్తాయి. దర్శకురాలి కథలో ఇంట్రస్టింగ్ పాయింట్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టు స్క్రీన్‌ ప్లే మాయ చూపించలేకపోయారు.

ఇక టెక్నికల్ పరంగా గోపీ సుందర్ ఇచ్చిన మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. వేదరమణ్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది. ఈ సినిమా నిడివి రెండుగంటలు లోపే అయినప్పటికీ ఎడిటర్ కత్తెర వేయాల్సిన సీన్లు ఇంకా ఉన్నాయనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.

ఓవరాల్‌గా.. ‘చూసీ చూడంగానే’ చిత్రాన్ని చూడంగానే నచ్చేశావే అనలేం కాని.. సాఫీగా ఒకసారైతే చూడొచ్చు.

నటీనట వర్గంశివ కందుకూరి,వర్ష బొల్లమ్మ,మాళవికా సతీశన్

దర్శకత్వంశేష్ సింధూ రావ్శైలి

Romantic Comedyవ్యవధి113

Content above bottom navigation