ఇప్పటి మినిస్టర్..అప్పుడు ‘ప్రేమదేశం’ హీరోలా ఉన్నారు కదా..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుల్లో తెలంగాణ మంత్రి కల్వకుంట్ల రామారావు పేరు కచ్చితంగా ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఆయన.. రాజకీయాలతో పాటు అన్ని రకాల విషయాల మీదా స్పందిస్తుంటారు. ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా మామూలు వ్యక్తిలాగే కొన్ని పోస్టులు పెడుతుంటారు. వ్యక్తిగత విశేషాల్ని పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన తన ఫాలోవర్లందరిలోనూ ఆసక్తి రేకెత్తించే ఫొటో ఒకటి షేర్ చేశారు తాజాగా. ప్రస్తుతం కేటీఆర్ కు 44 ఏళ్లు కాగా.. తనకు 22 ఏళ్ల వయసు ఉన్నప్పటి ఫొటోను కేటీఆర్ షేర్ చేశారు.

గడిచిపోయిన కాలంలో కొన్ని మధుర స్మృతులు అందరికీ ప్రత్యేకమైన అనుభూతినిస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇవి తప్పకుండా ఉంటాయి. ఇప్పటికి ఓ పది లేదా ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లి ఆ స్మృతులను ఏదో ఓ సందర్భంలో ప్రతి ఒక్కరూ నెమరు వేసుకుంటుంటారు. ఇలాగే కేటీఆర్‌ కూడా తాను యువకుడిగా ఉన్నప్పటి ఓ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటికే కేటీఆర్‌కు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ లైసెన్స్ ఉండడం విశేషం. దాని తాలూకు ఫోటోలను కేటీఆర్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌లో ఉన్న ఫోటోలో కేటీఆర్ నూనూగు మీసాలతో అమాయకంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని రవాణా విభాగం జారీ చేసిన ఈ లైసెన్స్‌లో కేటీఆర్‌ వ్యక్తిగత వివరాలు ఉన్నాయి. పేరు.. కల్వకుంట్ల తారకరామారావు.. సన్నాఫ్ కే.చంద్రశేఖర్ రావు, జన్మస్థలం సిద్దిపేట్, డేట్ ఆఫ్ బర్త్ 24.07.1976గా ఉంది. ఇంటి అడ్రస్ ఖైరతాబాద్ అని పేర్కొన్నారు. దీనిపై రవాణాశాఖ ముద్ర కూడా ఉంది.

ఈ క్రింద వీడియో చూడండి:

దీనికి సంబంధించిన ఫోటోలను కేటీఆర్ ట్విటర్‌లో వివరిస్తూ ఈ డ్రైవింగ్ లైసెన్స్ 1998 నాటిదని అంటే గత శతాబ్దిలోనిది అని పేర్కొన్నారు. ఈ లైసెన్స్ తన ఇంట్లో చాలా కాలం తర్వాత గుర్తించినట్లు వివరించారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌తో నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘ప్రేమదేశం’ సినిమాలో హీరో వినీత్ మాదిరి కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరొకరు ‘పెళ్లిపందిరి’ చిత్రంలో జగపతిబాబులా ఉన్నారని అంటున్నారు. మరికొందరు పవన్ కల్యాణ్‌తో పోల్చుతున్నారు. ‘సినిమాల్లో ప్రయత్నించి ఉంటే ఖచ్చితంగా హీరో అయ్యేవారు. మిస్ చేసుకున్నట్టున్నారు’, ‘మీరు మళ్లీ మీసాలు పెంచవచ్చు కదా’,’, ‘ఈ సమయంలో మీ నాన్నగారే కదా ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్?’, ‘ఈ 22 ఏళ్ల యువకుణ్ని అస్సలు గుర్తు పట్టలేకున్నాం’ అని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Content above bottom navigation