ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 జూన్ 2 నుంచి నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణకు వైసీపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ జీవో జారీ చేశారు. 10 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికలోని అవినీతి అంశాలపై సిట్ విచారణ చేపట్టనుంది. సీఆర్డీఏ పరిధిలోని సరిహద్దుల మార్పు, అవకతవకలు, ఇన్ సైడర్ ట్రేడింగ్, బినామీ లావాదేవీలపై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేపట్టనుంది. సీఆర్డీఏతో పాటు ఇతర ప్రాజెక్టులోని అక్రమాలపైనా సిట్ విచారణ చేపట్టనుంది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై గత అసెంబ్లీ సమావేశాల్లో చర్చ చేపట్టిన సమయంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో లోతుగా పరీక్షించిన అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు జీవోలో పేర్కొన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులుగా ఐపీఎస్ అధికారులు అట్టాడ బాబూజీ, వెంకట అప్పలనాయుడు, శ్రీనివాస్ రెడ్డి, జయరామ్ రాజు, విజయ్ భాస్కర్, గిరిధర్, కెనడీ, శ్రీనివాసన్, ఎస్వీ రాజశేఖర్ రెడ్డిలను నియమించింది. ఈ సిట్‌లో ఐపీఎస్‌ల నుంచి ఎస్ఐలకు వరకు ఉండటం గమనార్హం.

సిట్‌కు ప్రభుత్వం విస్తృత అధికారాలు కట్టబెట్టింది. ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం సిట్ కు ఉందంటూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విచారణ, దర్యాప్తు కోసం వేర్వేరుగా సిట్స్ ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా ఎవరినైనా పిలిచే, ప్రశ్నించే అధికారం సిట్‌కు ఉందని జీవోలో స్పష్టం చేశారు. అవినీతికి ఆధారాలు ఉంటే కేసులు నమోదు చేసి, చార్జ్ షీట్లు ఫైల్ చేసే అధికారం కూడా సిట్‌కు ఉంది. అవన్నీ నమోదు చేయడానికి, దాన్ని ఓ పోలీస్ స్టేషన్లో నోటిఫై చేస్తారు. ఇలా సిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత అధికారాలు కట్టబెట్టింది. ఇటీవల ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును నిలువరించేందుకు వైసీపీ ప్రభుత్వం సిట్ అస్త్రం ప్రయోగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.