ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్ బస… ఒక్క రాత్రికి ఈ గది ధర ఎంతో తెలుసా..?

90

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయన రావడమే ఆలస్యం. అహ్మదాబాద్ నుంచి ఆగ్రా ఆ తర్వాత ఢిల్లీకి చేరుకోనున్న ట్రంప్ కు ఘనంగా ఏర్పాట్లు చేసింది భారత ప్రభుత్వం. మధ్యాహ్నం 11:30 నుంచి 12 గంటల ప్రాంతంలో ట్రంప్ విమానం ఎయిర్‌ ఫోర్స్ వన్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది. అక్కడ సబర్మతీ ఆశ్రమంను సందర్శించి నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్రంప్ దంపతులు బయలుదేరి వెళతారు. ఆ కార్యక్రమం ముగిశాక నేరుగా ఆగ్రాకు వెళ్లి తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచి ట్రంప్ దంపతులు ఢిల్లీకి వెళతారు. రాత్రి ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేస్తారు. ట్రంప్ బస చేసే ఈ హోటల్ ఆషామాషీ హోటల్ కాదు.

ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌ లో పలువురు ప్రపంచ దేశాధినేతలు బసచేశారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌ లో ఈ హోటల్ ఉంది. ఇక ట్రంప్ దంపతులు ఇక్కడ బసచేస్తుండటంతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గత కొద్ది రోజులుగా ఐటీసీ మౌర్య హోటల్ భద్రతా బలగాల చేతిలోకి వెళ్లిపోయింది. హోటల్ అనువనువునా చెక్ చేస్తున్నాయి భద్రతా బలగాలు. ఇక ట్రంప్ బస చేయనున్న గది, హోటల్‌ లోని 14వ అంతస్తులో ఉంది. ఈ గది అత్యంత విలాసవంతంగా ఉంటుంది. అన్ని సదుపాయాలు ఈ గదిలో ఉన్నాయి. ఇదొక అపార్ట్‌మెంట్‌ ను తలపిస్తుంది. మొత్తానికి ఒక్క రాత్రికి ఈ హోటల్ ఖర్చు రూ.8 లక్షల అవుతుందని సమాచారం. ఈ ప్రెసిడెన్షియల్ సూట్‌ ను అత్యంత సుందరంగా తీర్చి దిద్దారు. వుడెన్ ఫ్లోరింగ్, గోడలపై అందమైన పెయింటింగ్స్, ఒక పెద్ద లివింగ్ రూమ్, నెమలి ఆకారంలో ఉండే ప్రైవేట్ డైనింగ్ రూమ్, విలాసవంతమైన రెస్ట్ రూమ్‌ లతో పాటు రిసెప్షన్ ఏరియా, మిని స్పా, జిమ్‌లు ఉంటాయి.

Image result for ఢిల్లీలోని ఐటీసీ మౌర్య

ఇక ట్రంప్ ఫుడ్ మెనూ చూస్తే ఆయనకు ఇష్టమైన ఆహారంను వడ్డించనున్నారు. ఇందులో డైట్ కోక్, చెర్రీ వెనీలా ఐస్‌క్రీమ్‌ లు ఉన్నాయి. ఇక ట్రంప్ దంపతుల కోసం ప్రత్యేకంగా ఓ చెఫ్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఇష్టమైన వంటకాలు ఏమిటో తెలుసుకుని అప్పటికప్పుడు సిద్ధం చేస్తారు. హోటల్ ఐటీసీ మౌర్యలో బస చేయనున్న నాల్గవ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గుర్తింపు పొందారు. అంతకుముందు బిల్‌ క్లింటన్, జార్జ్ బుష్, ఒబామాలు అధ్యక్ష హోదాలో ఈ హోటల్‌లో బస చేశారు. ఇక ట్రంప్‌ దంపతులతో పాటు మెలానియా ట్రంప్, కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జేర్డ్ కుషర్‌ లు కూడా రానున్నారు. వీరు కూడా ఐటీసీ మౌర్యలోనే బసచేయనున్నారు. భారత్‌ లో ట్రంప్ దంపతులు రెండు రోజుల పాటు ఉండనున్నారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని మంగళవారం రాత్రి 10 గంటలకు తిరిగి అమెరికాకు ప్రయాణమవుతారు. అప్పటివరకు ఇండియాకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Content above bottom navigation