ఏపీలో జనతా కర్ఫ్యూ.. గవర్నర్ కీలక సూచనలు

148

ప్రధాని మోదీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూకు అనూహ్య స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం పాజిటివ్ గా స్పందిస్తున్నారు. జనతా కర్ఫ్యూకు ఇప్పటికే 7కోట్ల మంది వ్యాపారస్తులు తమ దుకాణాల షట్టర్లను 22వ తేదీ మూసివేస్తామ‌న్నారు , ప్రస్తుతం నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో జనతా కర్ఫ్యూకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.. అలాగే అవగాహన కల్పిస్తున్నారు.

అలాగే జనతా కర్ఫ్యూకు మద్దతుగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థలను కూడా దిగ్బంధం చేయనున్నారు. ఇప్పటికే దేశంలోనూ కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒక్క రోజులోనే అత్యధికంగా 50 కొత్త కేసులు నమోదు కావడంతో శ‌నివారం నాటికి దేశం మొత్తమ్మీద కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 250 కు చేరుకుంది. వైరస్‌ కట్టడికి రాష్ట్రాలు పలు చర్యలు చేపట్టాయి. ముంబై, పుణే, నాగపూర్‌లలో కార్యాలయాలన్నింటినీ మార్చి 31వ తేదీ వరకూ మూసివేస్తున్నట్లు ముఖ్యమంతి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించగా, కిరాణా, మందుల దుకాణాలను మినహాయించి అన్ని మాల్స్‌ను మూసివేస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు.

Image result for modi

ప్రధాని మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు స్పందనగా రైల్వే శాఖ శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకూ రైళ్లన్నింటినీ నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ ప్రభావం సాధారణ స్థితికి చేరే వరకు రాష్ట్ర ప్రజలు ఎప్పటికప్పుడు అధికారుల సూచనలను పాటించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, మత పరమైన ప్రదేశాలను సందర్శించకుండా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గవర్నర్ హరిచందన్ రాజ్‌భవన్‌లో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో మన కుటుంబాలను, సమాజాన్ని, దేశాన్ని రక్షించుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ కదలి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉండాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

Image result for biswabhusan harichandan ap governor

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో వైద్య నిపుణులు సూచించిన అన్ని ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు తమ నివాసాల్లోనే ఉండాలని.. అనవసరమైన ప్రయాణాలను విరమించుకోవాలన్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు ఎవరైనా తమ చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని, అలాగే మాస్క్‌లు ధరించాలని చెప్పారు. తమ నివాసాల్లోని వృద్ధుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే భయపడకుండా కాల్ సెంటర్‌ను సంప్రదించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో వైద్యుల సలహాలు తీసుకోవాలన్నారు.

Image result for biswabhusan harichandan ap governor

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాజ్‌భవన్ ప్రవేశంపై ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఉద్యోగులు సహా రాజ్‌భవన్‌లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ భద్రతా సిబ్బంది థర్మల్, నాన్-టచ్ ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ల ద్వారా స్కానింగ్ చేస్తున్నట్లు చెప్పారు. రాజ్‌భవన్ అధికారులు, సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్‌లు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. మరోవైపు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను వాయిదా వేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గవర్నర్ హరిచందన్ సైతం ఈ నెలాఖరు వరకు తన పర్యటనలను రద్దు చేసుకున్నారని వివరించారు.

Content above bottom navigation