మూడోసారి ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణం.. విశిష్ట అతిథిగా ఏడాది బాలుడు

117

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాలకు గానూ 62 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురేయగా, బీజేపీ 8 సీట్లతోనే సరిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ఖాతాతెరవలేకపోయింది. ఇక అత్యధిక సీట్లు రావడంతో కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. కాగా ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆప్ కార్యకర్తలు, కేజ్రీవాల్ అభిమానులు, మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. అందుకే పోలీసులు భారీ భద్రతను ఏర్పాటుచేశారు. దాదాపు 5,000 మంది పోలీసులు, 125 సీసీటీవీ కెమెరాలు, 12 ఎల్‌ఇడి స్క్రీన్లు, 45,000 మంది కూర్చోడానికి కుర్చీలు వేశారు. వీరితో పాటు వేలాది మంది కూడా నిల్చొని ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఇక భారీగా వచ్చిన జన సందోహం మధ్య కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కేజ్రీవాల్‌తో సహా ఆరుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా, పాత క్యాబినెట్‌నే కొనసాగించనున్నారు. ‘ధన్యవాద్ ఢిల్లీ’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేజ్రీవాల్‌ తో లెఫ్టినెంట్ గవర్నర్ అజిల్ బైజాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్రపాల్ గౌతమ్‌ లు ప్రమాణం చేశారు.

ఈ క్రింది వీడియోని చూడండి

కేజ్రీవాల్ తన ప్రమాణస్వీకారానికి రాజకీయ నేతలనూ ఎవరినీ ప్రత్యేకంగా ఆహ్వానించలేదు. సీఎం ప్రమాణస్వీకారం అంటే రాజకీయ ప్రముఖులు, వారి బంధువులే వీఐపీలుగా ఉంటారు. కానీ, దీనికి భిన్నంగా ఆమ్‌ఆద్మీ పార్టీ సాదాసీదా వ్యక్తులను వీఐపీలుగా ఆహ్వానించింది. కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి దాదాపు యాభైమంది సామాన్యులు వేదిక పంచుకున్నారు. ఆటో, అంబులెన్స్‌, బస్సు డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పాఠశాల ప్యూన్లు, మొహల్లా క్లినిక్‌ డాక్టర్లు, ఇలా వివిధ వర్గాలకు చెందిన యాభై మందిని ఆహ్వానించగా వారంతా హాజరయ్యారు. ఈ మధ్యే మాస్కో ఒలింపియాడ్‌లో పథకాలు సాధించిన విద్యార్థులు, ఉద్యోగ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలు సైతం ఈ వేడుకు అతిథులుగా విచ్చేశారు. అలాగే ఆప్ ఎంపీ భగవత్ మాన్, బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా తదితరులు హాజరయ్యారు.

ఇక, అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ‘లిటిల్ కేజ్రీవాల్’‌ గా గుర్తింపు పొందిన ఏడాది బాలుడు అవియన్ తోమర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ కార్యక్రమానికి తోమర్ విశిష్ట అతిథిగా హాజరై ముందు వరుసలో కూర్చున్నాడు. ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అయితే, ఈ విజయోత్సవ వేడుకలో ఆప్ కార్యకర్త రాహుల్ తోమర్ కుమారుడు అవ్వాన్.. కేజ్రీవాల్ లాగా మఫ్లర్, టోపీ, మీసాలతో దర్శనమిచ్చాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అవ్వాన్ పేరు ఢిల్లీ వ్యాప్తంగా మార్మోగిపోయింది.

సోషల్ మీడియాలో సంచలనంగా మారిన అవ్యాన్.. ఆప్ అగ్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించాడు. దీంతో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అవ్యాన్ కుటుంబాన్ని ఆప్ నేతలు ఆహ్వానించారు. అవ్యాన్ వయసు కేవలం ఏడాది అయినా ‘లాగే రహో కేజ్రీవాల్ పాట’ వింటే చాలు హుషారుతో ఊగిపోయి చిందులేస్తాడు. అంతేకాదు, నీది ఏ పార్టీ అంటే ‘ఆప్’ అని టక్కున చెప్పేస్తాడు. ఇక ప్రమాణస్వీకారం అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా మీ బిడ్డ ప్రమాణం చేశారని, ఇది నా గెలుపుకాదని, ఢిల్లీ ప్రజల విజయమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం దీని వెనుక ఉందన్నారు. ఈ క్షణం నుంచి రాజకీయాలను పక్కనబెట్టి ఢిల్లీ అభివృద్ధికి కలిసి పనిచేద్దామని కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ కోరారు. అంతేకాదు, ఢిల్లీలో పాలన సాఫీగా సాగడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు కోరుకుంటున్నానని అన్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation