YS షర్మిల రియల్ స్టోరీ

96

YS షర్మిల.. నిన్న మొన్నటివరకు అన్న వదిలిన బాణం. కానీ ఇప్పుడు చాలామంది నేతల్లో గునపం దింపడానికి సిద్దమైన కొత్త రాజకీయ నాయకురాలు. క్రిస్టల్ క్లియర్ ‌గా తెలిపోయింది. తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు తేల్చేశారు. వైఎస్సార్‌‌టీపీ పేరుతో పార్టీ పెట్టనున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు. కొత్త పార్టీతో ఎందుకు రాకూడదు… ఇది షర్మిల ఫస్ట్ రియాక్షన్. దాంతో షర్మిల పేరు రెండు తెలుగు రాష్టాల్లో మారుమోగిపోతుంది. ఈ సందర్భముగా ఆమె ప్రస్థానం మీద ఒక చిన్న స్టోరీ మీకోసం..

షర్మిల వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే..
షర్మిలా 17 డిసెంబర్ 1973 న కడప జిల్లా పులివెందులలో జన్మించారు. షర్మిల పూర్తీ పేరు యెడుగూరి సందింటి షర్మిలా రెడ్డి. ఈమె తల్లిదండ్రులు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి, తల్లి వై.ఎస్. విజయమ్మ. ఆమె అన్నయ్య ఆంధ్రప్రదేశ్ 17 వ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. షర్మిల యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె తల్లి వైఎస్ విజయమ్మ వైకాపా పార్టీ గౌరవ అధ్యక్షురాలు.

YS Sharmila Real Life Story

షర్మిల భర్త పేరు అనిల్ కుమార్, ఇతనిని బ్రదర్ అనిల్ అని. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి రాజా, అమ్మాయి అంజలి. షర్మిలకు అనిల్ తో రెండవ వివాహం జరిగింది. మొదటి వివాహం మేనమామ ప్రతాపురెడ్డితో జరిగింది. కానీ అతను చనిపోవడంతో అనిల్ ను రెండవ వివాహం చేసుకుంది. ఇక షర్మిల రాజకీయ జీవితం విషయానికి వస్తే… వైఎస్ షర్మిల అన్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున తల్లి విజయమ్మతో పాటు జూన్12, 2012 లో జరిగిన ఉపఎన్నికలలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తూ తొలిసారిగా ప్రజాజీవితంలోకి అధికారికంగా వచ్చింది.

జూన్ నెలలో జగన్ ను అరెస్టు చెయ్యగా, ఉప ఎన్నిక ప్రచారానికై జగన్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ తరుపున ఆమె ప్రచారములో పాల్గొనటం వల్ల ఆమె ప్రత్యక్షరాజకీయ జీవితం మొదలైనది. అంతకుముందు ఆమె, అనేక క్రిస్టియన్ మత ప్రచార సభలలో పాల్గొని ప్రసంగించిన అనుభవం ఉంది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసింది.

వైసీపీ పార్టీ అధ్యక్షుడు అయిన జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమ ఆస్తులను కలిగి వున్నాడనే ఆరోపణ మేరకు సి.బి.ఐ.వాళ్లు అయనను ఉపఎన్నికల ముందే అరెస్టు చేసారు. ఈ నేపథ్యంలో పార్టిని మరింత ప్రజలకు చేరువగా తీసుకెళ్లే ప్రయత్నంగా, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి బలోపేతం చేయు దిశగా మరో ప్రజా ప్రస్థాపన పేరుతో పాదయాత్రను 18 అక్టొబరు 2012న ప్రారంభించారు. ఈపాదయాత్ర 16 జిల్లాల మీదుగా సాగింది, దాదాపు 3000 కి.మీ పాదయాత్ర చేసింది. తన పాదయాత్రను, తన తండ్రి దివంగత రాజశేఖరురెడ్డి సమాధి ఇడుపుల పాయ నుండి ప్రారంభించింది.

పాదయాత్రలో షర్మిలకు డిసెంబరు17 న గాయం అవ్వడం వలన తాత్కాలికంగా పాదయాత్రను నిలిపివేసింది. ఆమె కాలికి అపోలో డాక్టర్స్ ఆపరేషన్ చేసి, ఆరువారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరి 6,2013 నుండి మళ్ళి పాదయాత్ర ప్రారంభించింది. ఈ పాదయాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగి ఆగస్టు 4 న ముగిసింది. 9 నెలలకు పైగా కొనసాగిన ఈ పాదయాత్ర 14 జిల్లాల గుండా, 116 నియాజకవర్గాల మీదుగా జరిగింది. ఇందులో 9 కార్ఫోరేషన్లు, 45 మున్సిపాలిటిలు, 195 మండలాలు, 2250 గ్రామాలను తాకుతూ సాగింది.

మొత్తం యాత్రలో 190 గ్రామ ప్రాంతాలలో రచ్చబండను నిర్వహించడం జరిగింది.152 ప్రదేశాలలలో భారీ స్థాయిగా జరిగిన జనసభలలో ప్రసంగించడం జరిగింది. ఈ పాదయాత్రలో దాదాపు కోటిమందికి పైగా జనాలను షర్మిలా ప్రత్యక్ష్యంగా కలిసినట్లు అంచనా వేసారు. షర్మిలా పాదయాత్ర జరిపిన జిల్లాల విషయానికి వస్తే.. వైస్సార్ కడప, అనంతపురం,కర్నూలు, మహబూబ్ నగర్,రంగారెడ్డి, నల్లగొండ, గుంటూరు, కృష్ణా,ఖమ్మం, పశ్చిమ గోడావరి,తూర్పు గోదావరి,విశాఖపట్నం,విజయనగరం, శ్రీకాళం జిల్లాకు ఉన్నాయి.

మొత్తం పాదయాత్ర జరిపిన దూరం 3,112 కి.మీ. ప్రపంచంలో ఇంత దూరం పాదయాత్ర జరిపిన మొట్టమొదటి మహిళ షర్మిల కావడం విశేషం. వై ఎస్ రాజశేఖరుగారు గతంలో తను ప్రతిపక్ష సభ్యుడుగా వున్నప్పుడు చేవెళ్ల నుండి పాదయాత్ర చేపట్టి 68 రోజుల పాదయాత్ర చేసి,1,473 కి.మీ ఇచ్ఛాపురం వరకు నడచి, పాదయాత్ర ముగించిన సందర్భంగా అక్కడ నిర్మించిన విజయవాటిక స్మారక స్తూపానికి ఎదురుగానే షర్మిలా, మరో ప్రజాప్రస్థానం ముగింపు చిహ్నం నిర్మించి, ఆవిష్కారం చేసారు. ఇక 2014 ఎన్నికలలో వైసిపి పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ తరుపున ఎన్నికలలో ప్రచారం చేశారు. అయినా కూడా ఆ పార్టీ ఎన్నికలలో గెలవలేదు. ఇక 2019 ఎన్నికలలో మళ్ళి వైసిపి పార్టీ తరుపున ప్రచారం చేశారు.

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు, వై.ఎస్.శర్మిల ఆంధ్రప్రదేశ్ మీదుగా “బై బై బాబు” అనే నినాదంతో 11 రోజుల బస్సు యాత్రను చేపట్టారు. ప్రజా తీర్పు – బై బై బాబు పేరుతో ఈ ప్రచారం 1553 కిమీ సాగింది. జగన్ వదిలిన బాణం షర్మిల అని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం జరిగింది. 2019 ఎన్నికలలో ఈమె అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇతను ముఖ్యమంత్రి అవ్వడం వెనుక షర్మిల కష్టం కూడా చాలా వరకు ఉంది. ఇక ఆ ఎన్నికల తర్వాత వైఎస్ షర్మిల ఎక్కడ కనిపించలేదు. దాదాపు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ తెరమీదకు వచ్చారు.

ఈసారి తెలంగాణాలో పెద్ద బాంబ్ పేల్చారు. తానూ తెలంగాణాలో కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. పార్టీ పేరు వైఎస్సార్ టీపీ అని ప్రచారం కూడా సాగుతుంది. తొందర్లోనే అన్ని విషయాలు తెలియజేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో అందరు జగన్ కి, షర్మిలాకు భేదాభిప్రాయాలు వచ్చాయనే వార్తలు క్రియేట్ చేశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని, రాజన్న రాజ్యం తెలంగాణాలో లేదని, అందుకే తెలంగాణాలో పార్టీ పెడుతున్నట్టు వైఎస్ షర్మిల ప్రకటించారు.

ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి, పోటీ చేసి, గెలిచి తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించాలని ఆమె భావిస్తున్నారు. ఈ సమయంలో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. షర్మిల పార్టీని సమర్థవంతంగా నడపగలదా.. జగన్ లో ఉన్నంత ఓపిక ఆమెలో ఉందా.. పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుందా అనే సందేహాలు ఎన్నో ఉన్నాయి. అన్నిటికి కాలమే సమాధానం చెప్తుంది. ఆమె ఆశ, కల నెరవేరాలని కోరుకుందాం.

Content above bottom navigation