Friday, July 30, 2021

చైనా కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవం – చారిత్రక ప్రభావం

Must Read

ఆసియాలో అత్యంత ప్రాచీన చరిత్ర, నాగరికతగల దేశం చైనా. చైనా కమ్యూనిస్టుపార్టీ శతవార్షికోత్సవ వేడుకలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ఈనాటి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాన్ని ఒక పార్టీ వందేళ్లపాటు నడిపించడం, సోవియట్‌ యూనియన్‌ విచ్చిన్నమైన తర్వాత కూడా సోషలిస్టు విధానం తమదంటూ కమ్యూనిస్టుల నాయకత్వంలో అమెరికాకు దీటుగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థితిలో వుండటం చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రత్యేకత. గతంలో అసమర్ధ చక్రవర్తుల పాలనలో విదేశీ శక్తులు తిష్టవేశాయి. అది స్థానిక యుద్ధ ప్రభావాల ఘర్షణలకు రంగస్థలమైంది. ప్రజల స్థితి దిగజారింది. మన గాంధీ గారిలా సన్‌యెట్‌సేన్‌ వారి జాతీయ నేత. ఆయన కొమింగ్‌టాంగ్‌ పార్టీని స్థాపించారు. బయిటి దేశాల పెత్తనానికి, పీడనకు వ్యతిరేకంగా చైనా కార్మికులు సమ్మెలు, పోరాటాలు, రాజకీయ కార్యాచరణలు ప్రారంభించింది. సోషలిజం భావాలు విస్తృతంగా వ్యాపించాయి.

చైనా చరిత్రలో 1919 మే 4 ఉద్యమం ఒక మలుపు. 1921లో చైనా కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడిరది. షాంఘైలో తొలి మహాసభ జరిగింది. ఆ సభకు హాజరైన 13 మంది ప్రతినిధులలో మావో సేటుంగ్‌ ఒకరు. పార్టీ స్థాపన తర్వాత ప్రజా పోరాటాలు, కార్మిక పోరాటాలు ఊపందుకున్నాయి. ఏడాదిన్నర కాలంలో దేశంలో మూడు లక్షల మంది కార్మికులతో 100 సమ్మె పోరాటాలు జరిగాయి. బ్రిటన్‌, అమెరికా, జపాన్‌లు రకరకాల ఎత్తుగడలు, ఒప్పందాలతో చైనాలోని వేర్వేరు భాగాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ స్థితిలోనే చైనా కమ్యూనిస్టు పార్టీ కొమింగ్‌ టాంగ్‌తో జాతీయ ప్రజాతంత్ర విప్లవ ఐక్య సంఘటనకై పిలుపునిచ్చింది.

ఐక్య సంఘటన ఎత్తుగడలపై కమ్యూనిస్టు పార్టీలో రెండురకాల అభిప్రాయాల మధ్య ఘర్షణ జరిగింది. బూర్జువా వర్గ నాయకత్వమే ఉండాలని ఒక వర్గం, అసలు దాంతో ఐక్యతే పనికిరాదని మరోవర్గం వాదించాయి. మావో, మరికొందరు ప్రతినిధులు ఈ రెండు వాదనలనూ వ్యతిరేకించారు. కమ్యూనిస్టులు, బూర్జువావర్గ ఐక్య సంఘటనతో కొమింటాంగ్‌ మహాసభ 1924 జనవరిలో జరిగింది. మావోతో సహా నలుగురు కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. దాంతో కొమింటాంగ్‌ రాడికల్‌ మార్గం పట్టింది. సోవియట్‌తో మైత్రి, కమ్యూనిస్టులతో మైత్రి, కార్మిక కర్షకులతో సహకారం అనే మూడు సూత్రాల పంథా సన్‌యెట్‌సేన్‌ ప్రకటించారు. 1925లో సన్‌యెట్‌సేన్‌ మృతిచెందారు. చాంగ్‌కైషేక్‌ కొమింగ్‌టాంగ్‌ నాయకుడయ్యాక కమ్యూనిస్టులపై కత్తి కట్టాడు.

1925 మే 30న బ్రిటిష్‌ అంతర్జాతీయ పోలీసులు షాంఘైలో దేశభక్తుల ప్రదర్శనపై కాల్పులు జరిపారు. ‘‘మే 30 ఉద్యమం’’ అన్న పేరిట ఈ ఘటన తర్వాత మరోసారి ప్రజా ఉద్యమం ప్రజ్వరిల్లింది. లక్షలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గన్నారు. వీటిలో కొన్ని దీర్ఘకాలంపాటు కొనసాగాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ చాంగ్‌కైషేక్‌ దురాగతాలను ఎదుర్కొని పోరాటం కొనసాగించాలని, ఫ్యూడల్‌ శక్తులను ప్రతిఘటించాలని నిర్ణయించింది. అందుకోసం మావోను హునాన్‌ రాష్ట్రం పంపించింది. ఆయన అనేక రైతాంగ పోరాటాలు నిర్వహించి, చాలా ప్రాంతాలు విముక్తి చేసుకుంటూ జంగాంగ్‌ పర్వతాలకు చేరుకున్నాడు. చౌఎన్‌లై, చూటేలు కూడా ఇతర ప్రాంతాలలో విముక్తి పోరాటాలు విజయవంతం చేసుకుని, అక్కడకు చేరుకున్నారు. మావో కమాండర్‌గా విప్లవ ఎర్ర సైన్యం ఏర్పడిరది.

విప్లవ శక్తులు 1927 మార్చి నాటికి చైనా పారిశ్రామిక కేంద్రమైన షాంఘై చేరుకున్నాయి. నగరంలోని కార్మికులు సమ్మె చేసి, తిరుగుబాటు జరిపారు. ఆ తర్వాత విప్లవ సైన్యం నగరంలోకి ప్రవేశించి, దాన్ని స్వాధీనపరచుకుంది. మరో రెండు రోజులకు చైనా మధ్య భాగంలోని నాన్‌కింగ్‌ నగరాన్ని కూడా హస్తగతం చేసుకున్నాయి. అమెరికా, బ్రిటన్‌ యుద్ధ నౌకలు నాన్‌కింగ్‌ పక్కనే గల యాంగ్సీ నదిలో నుండి విచక్షణారహితంగా మందుగుండు కురిపించాయి. చాంగ్‌ చేతులు కలిపాడు. కొమింగ్‌టాంగ్‌లో కమ్యూనిస్టులను ఏరివేశాడు. ఈ శక్తులు నాన్‌కింగ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చాంగ్‌కైషేక్‌ అమానుషకుట్రలో మొత్తం 10 లక్షల మంది కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారు. పట్టణాలలో కమ్యూనిస్టులపై నిర్బంధకాండ తీవ్రమవడంతో ఎర్రసైన్యం వ్యూహాత్మకంగా పట్టణాల నుండి వెనక్కు తగ్గి, గ్రామాలకు చేరుకుంది. అక్కడే గెరిల్లా యుద్ధం ప్రారంభించింది.

ఎర్రసేన పోరాటాలు, వ్యవసాయక విప్లవంతో ముడిపెట్టి, గ్రామాలను విముక్తి చేసుకుంటూ క్రమంగా నగరాలను చుట్టుముట్టి చివరకు దేశవ్యాప్త విజయం సాధించాలని మావో సిద్ధాంతీకరించాడు.ే వ్యవసాయ కార్మికులు, పేదరైతులపై ప్రధానంగా ఆధారపడటం, ధనిక రైతులను నిరోధించడం, మధ్య తరగతి రైతులను ఐక్యం చేయడం, భూస్వాముల భూములను పరిహారం లేకుండా స్వాధీనపరచుకుని, దున్నే వారికివ్వడం. ఇవి వ్యవసాయ విప్లవ మూలసూత్రాలు. దీనివల్ల రైతాంగ విముక్తితో పాటు 1930 నాటికి 60 వేల మందితో ఎర్రసైన్యం విస్తరించింది. 1931లో మావోచైóై ర్మన్‌గా విముక్తి ప్రాంతాలలో కార్మిక కర్షక ప్రభుత్వం ఏర్పడిరది. చూటే ఎర్రసేన అధిపతి అయ్యాడు. ఈలోగా 1931లో జపాన్‌ చైనాపై దాడికి పాల్పడిరది. అటు జపాన్‌ దాడి, ఇటు చాంగ్‌ దాడి కమ్యూనిస్టులను క్లిష్ట పరిస్థితిలోకి నెట్టాయి.అలాంటి పరీక్షా సమయంలో ఎర్రసేన చరిత్రాత్మకమైన లాంగ్‌ మార్చ్‌ ప్రారంభించింది.

సైన్యంలోని ప్రధాన భాగం 1934 అక్టోబర్‌ 16న యాంగ్సీ విప్లవ స్థావరాన్ని విడిచి శత్రు దిగ్బంధనాన్ని ఛేదించుకుంటూ 12000 కిలోమీటర్లు నడిచి ఉత్తరానగల షాంగ్జీ విప్లవ కేంద్రాన్ని చేరాల్సివచ్చింది. నదులు, పర్వతాలు, ఎడారులు, బురద నేలలు దాటుకుంటూ జైత్రయాత్ర సాగించింది. మానవ చరిత్రలోనే ఆశ్చర్యకరమైన ఒక ప్రస్థానమది. ఊహించశక్యంగాని దుర్భర పరిస్థితులను, దాడులను, వాతావరణ సమస్యలను, ఆకలి బాధలు, అనారోగ్యాలు వగైరాలను ఎదుర్కొంటూ ఎర్ర సైన్యం ముందుకు సాగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ లొంగుబాటు తర్వాత చైనాలో దాని ఆధీన ప్రాంతాలు త్వరితంగా విముక్తయ్యాయి. జపాన్‌ వ్యతిరేక యుద్ధం ముగిసిన వెంటనే అమెరికా రంగప్రవేశం చేసింది.చాంగ్‌కు ఆయుధ సహకారం, యుద్ధ సలహాలు అందజేసింది. మొత్తం 43 లక్షల మందిగల చాంగ్‌ సైన్యాన్ని 12 లక్షల ఎర్రసైన్యం వీరోచితంగా ఎదుర్కొంది.

యుద్ధ తంత్రాలతో 11 లక్షల 20 వేల మందిని తుడిచిపెట్టింది. 1947 జులైలో ఎర్రసేన ఎదురుదాడి ప్రారంభించి, 1949 ఏప్రిల్‌ నాటికి కొమింగ్‌టాంగ్‌ అధికార పీఠమైన నాన్‌కింగ్‌ను స్వాధీనపరుచుకుంది. చాంగ్‌, అతని అనుయాయులు, దళాలు తైవాన్‌ పారిపోయారు. అంతిమంగా 1949 అక్టోబర్‌ 1న చైనా ప్రజా రిపబ్లిక్‌ అవతరించింది. మానవ చరిత్రలోని మహోజ్వల ఘట్టాలలో చైనా విప్లవం ఒకటి. ఎందరో సామ్రాజ్యవాదుల జోక్యానికి బలైన చైనా ప్రజలు భయానక దారిద్య్రాన్ని, బానిసత్వాన్ని, కడగండ్లను అనుభవించారు. నల్లమందుభాయిలుగా పేరు పొందారు. అలాంటి జాతిని మేల్కల్పి, మహత్తర పోరాటంలోకి నడిపిన ఖ్యాతి కమ్యూనిస్టులదైతే అందుకు నాయకత్వం వహించిన మహానేత మావోజెడుంగ్‌. సుదీర్ఘ చైనా విప్లవ పోరాటంలో అయిదు కోట్ల మంది ప్రాణాలర్పించారు. విముక్తి తర్వాత కూడా చైనా అనేక సవాళ్లను ఎదుర్కొంది.

మావో హయాంలో గొప్ప ముందంజ పేరిట ఉత్పత్తిని పెంచుకోవడంపై కేంద్రీకరించింది. 1960లలో సాంసృతిక విప్లవం అనేదిచైనాను అనేక సమస్యల్లోకి నెట్టింది.మావో,ఎన్‌లైల మరణానంతరం నాయకత్వం చేపట్టిన డెంగ్‌సియావో పింగ్‌ నాలుగు ఆధునీకరణల పేరిట చైనాను వేగంగా అభివృద్దిచేసేందుకు మార్గం వేశారు.తలుపులు తెరవాలన్నాడు. గాలితోపాటు దోమలు వస్తే తోలాలన్నాడు. 1989లో తూర్పు యూరప్‌లో సోవియట్‌లో సోషలిజం దెబ్బ తింటున్నప్పుడే చైనాలోనూ తినాన్‌ మేన్‌ స్కేర్‌ ఘటనలు జరిగాయి.వాటిపై వ్యతిరేకులు ఎంత గగ్గోలు పెట్టినా ఖాతరు చేయకుండా చైనా తన విధానాలను సవరించుకుంటూ ముందుకు నడచింది. జియాంగ్‌ జెమిన్‌,హూజింటావోల తర్వాతి ప్రస్తుతం జీసింగ్‌పింగ్‌ మరోసారి మావో, డెంగ్‌ల తరహా నాయకుడుగా ముందుకొచ్చారు. ఈయనను జీవిత కాలం నాయకుడంటున్నారు.

1980లో డెంగ్‌ ఆధునీకరణకు పిలుపునిచ్చిన తర్వాత ఇప్పటికి చైనా జిడిపి80 రెట్లు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ జిడిపిలోచైనా వాటా 18.34శాతం వుంది. అమెరికా తర్వాత బలమైన ఆర్థిక వ్యవస్థగా వుంటూ 2049నాటికి మరిన్ని రెట్లు అభివృద్ధి చెందుతుందనే అంచనాలున్నాయి. వాణిజ్యంలో అమెరికానే చైనాకన్నా 34 వేల డాలర్లు లోటులో వుంది. ఇటీవల కరోనా వైరస్‌కు సంబంధించి చాలా వ్యతిరేక ప్రచారం సాగినా చైనా వాక్సిన్‌ను కనుగొని ప్రపంచంలోనే అత్యధికంగా వందకోట్లమందికి పైగా దాన్ని అందించింది.చైనా సరుకులను అడ్డుకోవడంఅన్నది ప్రపంచంలో చాలా దేశాలకు సవాలుగా వుంది.చైనా సరుకులను బహిష్కరించాలని చాలామంది ప్రచారం చేసిన మన దేశం కూడా ఆక్సీజన్‌ సిలిండర్లు టీకాల ముడి పదార్థాలు చైనా నుంచి తెచ్చుకుంది.

ప్రపంచంలో కమ్యూనిస్టు ఉద్యమం దారుణంగా దెబ్బతినిపోయిందనే వాతావరణంలో అత్యధిక జనాభాతో సోషలిస్టు చైనా ప్రముఖ పాత్ర వహించడం ఒక ప్రత్యేకత. అక్కడ మానవ హక్కులు లేవని ఒకే పార్టీ వుందని విమర్శలు చేసినా ఈ కాలంలో77 కోట్లమంది ప్రజలను దారిద్య్రం నుంచి బయిట వేసినట్టు ప్రపంచబ్యాంకు లెక్కలుచెబుతున్నాయి. సాంకేతికసైనిక రంగాలలో కూడా చైనా శక్తి అపారంగా పెరిగింది. చైనా లక్షణాలతో కూడిన సోషలిజం అంటూ ప్రజానుకూల మార్కెట్‌ విధానం అనుసరించడం ఇందుకు కారణమని కమ్యూనిస్టుపార్టీ అంటుంది. ఈ వందేళ్లలో చైనా కమ్యూనిస్టు పార్టీ తప్పొప్పులు వున్నా అమెరికా వంటి ఆధిపత్య దేశాలను కొంతైనా అదుపు చేయడానికి చైనా శక్తి ఎంతగానో దోహదం చేస్తున్నది. భారత చైనాల మధ్య సరిహద్దు ఘర్షణలు సాగినా మొదటి నుంచి వీటిమద్య సంబంధాలు కూడా వుంటూనే వున్నాయి.చైనాను ముందుగా గుర్తించిన కమ్యూనిస్టేతర దేశంఇండియానే. డా, కోట్నిస్‌ వంటివారు చైనా విముక్తి పోరాటంలో పాలుపంచుకున్నారు. ఇప్పుడు కూడా వివాదాలు పరిష్కరించుకుని ఈ రెండు దేశాలు కటసి నడవడం ఈ రెండుదేశాలకే గాక ప్రపంచశాంతికి ప్రయోజనకరం.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This