Tuesday, July 27, 2021

చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా…? అవును అంటున్న కాంగ్రెస్

Must Read

చిరంజీవి పేరు మళ్లీ రాజకీయ తెరపైకి ఎందుకు వచ్చింది? AICC ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్‌ ఉమెన్ చాందీ ఏం చెప్పాలనుకున్నారు? చిరంజీవి కాంగ్రెస్ వాదే అన్న AICC ప్రకటనలో అంతరార్థం ఏంటి? సీఎం జగన్‌ను ప్రశంసిస్తూ చిరు ట్వీట్స్‌ పెడుతున్న సమయంలో.. అన్నయ్య వస్తాడు అంటూ జనసైనికులు కలల కంటున్న తరుణంలో ఈ కొత్త అంచానాలను ఎలా చూడాలి?

కాంగ్రెస్‌ నేతల ప్రకటనతో చర్చల్లోకి చిరంజీవి పేరు

ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారా లేరా అనే దానిపై కొద్దికాలం చర్చ జరిగినా.. సినిమాల జోరులో అదంతా పక్కకు పోయింది. సినిమాల తప్ప వేరే ప్రపంచంతో సంబంధం లేదన్నట్టుగా ఆయన ఉంటున్నారు. తాజాగా కాంగ్రెస్‌ నేతలు రెండు రోజుల్లో చేసిన రెండు ప్రకటనలతో మళ్లీ చిరు పేరు రాజకీయ తెరపైన చర్చకు వచ్చింది. ప్రజారాజ్యంను కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత కొద్దికాలం కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి ఆపై రాజకీయాల్లో సైలెంట్‌ అయ్యారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లిపోయారు.

చిరంజీవి కాంగ్రెస్‌ వాదేనని ఏఐసీసీ, ఏపీసీసీ ప్రకటన

విజయవాడలో రెండురోజుల క్రితం కాంగ్రెస్ ముఖ్య నేతల బేటీ జరిగింది. చాలారోజుల తర్వాత AICC ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్‌ విజయవాడ వచ్చారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు వంటి వారు మినహా ముఖ్యనేతలు ఆ సమావేశానికి హాజరయ్యారు. సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు ఎందుకు రావడం లేదని ఆ భేటీలో చర్చకు వచ్చింది. చిరంజీవి పేరు ప్రస్తావనకు రావడంతో.. ఆయన కాంగ్రెస్‌లో కొనసాగడం లేదు కదా అని కామెంట్‌ చేశారు ఉమెన్‌ చాందీ. అది కాస్తా చర్చకు దారితీసింది. ఉమెన్‌చాందీ వ్యాఖ్యలతో కలవరపడ్డారో.. చిరంజీవిని దూరం చేసుకుంటే ఇబ్బంది అనుకున్నారో.. మరుసటి రోజు AICC, APCC పేరుతో ప్రకటన జారీ అయ్యింది. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారని నేరుగా చెప్పకుండా.. చిరంజీవి కాంగ్రెస్‌ వాది అని ఆ ప్రకటనలో ప్రస్తావించారు. చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రఘువీరారెడ్డి APCC చీఫ్‌గా ఉన్న సమయంలో చిరంజీవితో సంప్రదింపులు జరిపేవారు. తర్వాత ఆయన ఊసే లేదు.

చిరంజీవి వస్తారని అప్పట్లో మాజీ స్పీకర్ ప్రకటన

చిరంజీవి. వివిధ సందర్భాలలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసిస్తూ ట్వీట్లు.. వీడియోలు రిలీజ్‌ చేశారు. ఆ ప్రశంసలపై అనేకరకాల విశ్లేషణలు వచ్చినా.. మెగాస్టార్‌ వాటికి స్పందించలేదు. ఆ మధ్య జనసేన సమావేశంలో చిరంజీవి వస్తారని నాదెండ్ల మనోహర్‌ చెప్పడంతో పెద్ద చర్చే జరిగింది. ఆ మధ్య సినిమా పరిశ్రమకు సంబంధించి అగ్రహీరోలు.. సినీ ప్రముఖలతో కలిసి తాడేపల్లి వచ్చి సీఎం జగన్‌ను కలిశారు

ఏపీలో కాంగ్రెస్‌కు చిరంజీవి పెద్ద దిక్కు అంటున్న నేతలు

ఏపీలో ఉనికి కోల్పోయిన పార్టీకి మళ్లీ జీవం పోయాలంటే మెగాస్టార్‌ అవసరం ఉందని నాయకులు భావిస్తున్నట్టున్నారు. ఆ కారణంగానే చిరంజీవి తమతోనే అని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. చిరంజీవి వస్తారని ఇప్పటికీ కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. జనసేన కూడా వచ్చే ఎన్నికల నాటికి చిరు తమతో కలిసి అడుగులు వేస్తారని గట్టిగా నమ్ముతోంది. అన్నదమ్ముళ్లు కలిసి ప్రయాణం చెయ్యాలని జనసైనికులు కోరుకుంటున్నారు.

సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంలతో చిరంజీవి భేటీ

సినీ కార్మికుల సమస్యలు.. ఇండస్ట్రీ ఇష్యూలపై నేరుగా ముఖ్యమంత్రులను కలసి చర్చిస్తున్నారు చిరంజీవి. హీరోగా ఉన్న క్రేజ్‌ కారణంగా మెగాస్టార్‌ చేసే ప్రతి ట్వీట్…ఆయనను ప్రస్తావిస్తూ నేతలు చేసే కామెంట్స్‌ చర్చకు దారితీస్తున్నాయి. అవన్నీ పరిశీలించిన మీదటే కాంగ్రెస్‌లో చిరంజీవి లేరు అని వ్యాఖ్యానించిన మరుసటి రోజే సవరణ విడుదల చేశారు నాయకులు. అయితే చిరంజీవి మళ్లీ రాజకీయాలవైపు చూస్తారో లేదో కానీ.. ఒక్కోపార్టీ ఒక్కోరకంగా ఆయన పేరు వాడేస్తోంది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This