ఏపీలో ఉగాదికి పేదలకు అందరికి ఉచిత ఇళ్లపట్టాలు అందించనుంది జగన్ సర్కారు..
ఏపీ గృహ నిర్మాణ శాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్ ఇటీవల భేటీఅయ్యారు. తాడేపల్లిలో నిర్వహించిన ఈ రివ్యూ మీటింగ్లో మంత్రి శ్రీరంగనాథరాజుతో పాటు.. ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతిపేదవాడికి సొంతింటికలను నిజం చేసే దిశగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.
పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..
ఉగాదిరోజున 26.6 లక్షల ఇళ్లపట్టాల పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం.. వచ్చే నాలుగేళ్లలో 30లక్షలకుపైగా ఇళ్లను నిర్మించడానికి ప్రణాళికను సిద్ధంచేసింది. రాష్ట్ర ప్రభుత్వ గృహనిర్మాణ రంగంలో కొత్త చరిత్రను సృష్టించడానికి వైయస్ జగన్ సర్కార్ రెడీ అయింది. 2024 నాటికి ఈ కలను సాకారం చేసేదిశగా అడుగులేస్తోంది.
సమావేశంలో ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రతిఏటా నిర్మించాల్సిన లక్ష్యాలపైనా చర్చించారు. పట్టణ, నగరాభివృద్ధి సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లనిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, వాటినుంచి ఇప్పటివరకూ మంజూరైన ఇళ్ల వివరాలను సీఎం అడిగితెలుసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో భాగంగా ఇంకా ఎన్ని ఇళ్లు రాష్ట్రానికి మంజూరు అవడానికి ఆస్కారం ఉందన్న అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఉగాది నాటికి 26.6 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వనున్నామని, వచ్చే నాలుగేళ్లలో 30 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఇప్పుడు పట్టాలు పొందుతున్న పేదలతోపాటు, సొంతంగా ఇళ్లస్థలాలు ఉన్న పేదలకూ ఇళ్లు నిర్మిస్తామని, మున్సిపాల్టీలు, నగరాభివృద్ది సంస్థల పరిధిలోనే దాదాపు 19.3 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించడానికి ప్రణాళికలు వేసినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. గృహనిర్మాణ శాఖలో ఉన్న 4,500 మంది ఇంజినీర్లతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా నియామకం అయిన సిబ్బందిలో 45వేలమంది కూడా 30 లక్షల ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని అధికారులు వెల్లడించారు. . వీరందరికీ కూడా ఇళ్ల నిర్మాణంపై శిక్షణ ఇచ్చారు.
ఇళ్లన్నీ ఒకే నమూనాలో ఉండేలా చూడాలని జగన్ అధికారులను ఆదేశించారు. డిజైన్లో కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. నిర్మాణం అత్యంత నాణ్యంగా, అందంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఒక బెడ్రూం, కిచెన్, వరండా, టాయిలెట్ ఉండేలా డిజైన్ రూపొందించారు. పేదలకు కడుతున్న కాలనీల్లో చెట్లు నాటాలని, డ్రైనేజీ ఏర్పాటుపైనా సరైన ప్రణాళిక అమలు చేయాలని సీఎం ఆదేశించారు. కరెంటు, తాగునీటి వసతికూడా కల్పించాలన్నారు.