YSR సొంత ఇల్లు పథకానికి కొత్త నిబంధన

80

సంక్షేమ పథకాల అమలుతో పాలనలో దూకుడు పెంచుతున్నారు ఏపీ సీఎం జగన్. పేదోడి సొంతింటి కలను నెరవేర్చుతానని పాదయాత్ర చేసిన సమయంలో జగన్‌ మాటిచ్చారు. ఇప్పుడా మాటను నిజం చేయబోతున్నారు. ఈ పథకంలో భాగంగా ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన విధివిధానాలపై అధికారులతో సమీక్షించారు జగన్‌. ప్రతిపేదవాడికి ఇళ్ల పట్టాలు అందాలని.. అక్రమాలు జరిగితే అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, అధికారులు హాజరయ్యారు. ప్రజాసాధికార సర్వే అన్నది ప్రమాణం కాకూడదని.. వాలంటీర్లు క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలు ప్రామాణికం కావాలన్నారు. ఇళ్ల పట్టాల కోసం గుర్తిస్తున్న స్థలాలు ఆవాస యోగ్యంగా ఉండాలన్న ప్రాథమిక విషయాన్ని మరిచిపోకూడదని అధికారులకు సీఎం సూచించారు.

ఇక లబ్ధిదారులకు ఉపయోగం లేని చోట స్థలాలు ఇవ్వడంలో అర్ధం లేదని. వారికి ఆవాసయోగ్యంగా ఉండాలన్నారు. ఈ అంశాలను అధికారులు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. వీలైనంత వరకు ఇళ్ల పట్టాల కోసం అసైన్డ్‌ భూములను తీసుకోవద్దని సీఎం సూచించారు. ఇళ్ల పట్టాల కోసం సడలించిన అర్హతల వివరాలను గ్రామ సచివాలయాల్లో డిస్‌ ప్లే చేయాలని చెప్పారు. ఇక ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసిన స్థలాలపై లబ్ధిదారులు ఆమోదం తెలిపిన తర్వాతే ప్లాటింగ్‌ చెయ్యాలన్నారు. లేకపోతే డబ్బు వృథా అవుతుందని సీఎం స్పష్టం చేశారు. అయితే ఇళ్ల్ల విషయాల్లో కొన్ని నిబంధనలు కూడా విధించాడు. ఇల్లు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆ ఇంటికి ఐదేళ్ల వరకు అమ్మడానికి వీలులేదు. 5 ఏళ్ల తర్వాత కావాలంటే అమ్ముకోవచ్చని జగన్ ప్రజలకు తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా అమ్మినట్టు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని జగన్ తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ, నదీ చట్టాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు వీటి కారణంగా పేదలు, సామాన్యులు ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జగన్‌. ఉగాది నాటికి పట్టాలు ఇవ్వడమే కాకుండా మంచి డిజైన్లలో వారికి ఉచితంగా ఇళ్లు కట్టి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భూములలో సుదీర్ఘ కాలంగా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరద నీరు ప్రవహించే మార్గాలలో నిర్మాణాలు చేపడితే.. పరిస్థితులు దుర్భరంగా తయారవుతాయన్నారు జగన్‌. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాల్ని ప్రభుత్వం తీసుకుంది.

Content above bottom navigation