Tuesday, July 27, 2021

ఏలియన్స్‌ గురించి ఆశక్తికరమైన వార్త… డైరెక్టర్ లీసా కాల్టేనెగర్‌ వివరణ

Must Read

భూమి మీద ఉన్నట్టుగానే కోట్లాది నక్షత్ర మండలాలలోని గ్రహాలలో జీవం ఉండవచ్చని అమెరికాలోని కార్నెల్‌ కార్ల్ సగన్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ లీసా కాల్టేనెగర్‌ భావన! ఆమెదే కాదు చాలా మంది అభిప్రాయం కూడా ఇదే!

మనలాంటి జీవులు ఇంకెక్కడైనా వున్నారా? అంటే మాత్రం కచ్చితంగా వుండే వుంటారన్న సమాధానం వస్తుంది. జీవానికి అనువైన గ్రహాలు బోలెడన్నీ వుండి వుంటాయి…వాటిల్లో మనలాంటి జీవులు వుండే వుంటారు. కొందరు మనకంటే తెలివిమీరి మనకంటే వేలకొద్ది సంవత్సరాల ముందుండి ఉంటారు. కొందరు ఇంకా ఆది మానవుల దశలోనే ఉండి ఉంటారు. మానవులు అనే ప్రయోగం తప్పు కావచ్చు.. ఎందుకంటే వేరే గ్రహాలలో ఉండేవారు మనలా , మనుషుల్లా ఉండరేమో!

గ్రహాంతర జీవులంటూ వుంటే వాళ్ల శరీరాలు మన శరీరాల్లా మాత్రం వుండవు. మనకు వాళ్లకు చాలా తేడా వుంటుంది. ఆ తేడా మనిషి మెదడుకు అందని స్థాయిలో వుండవచ్చు. మనకుండే అవయవాలు ఇంద్రియాలే అక్కడి జీవాలకు ఉండాలని రూలు కూడా లేదు. మనకు ఒకే ఒక్క మెదడుంటే వాళ్లకి రెండు మెదళ్లు వుండవచ్చు. మనకు తెలియని అవయవాలుండవచ్చు. మనం ఊహించని అవయవాలుండవచ్చు. మనం ఊహించలేని విధంగా వాళ్లు తమ అవయవాల్ని ఉపయోగిస్తూ వుండవచ్చు. మనిషి వినగలడు. చూడగలడు. వాసనను పసికట్టగలడు. స్పర్శను అనుభవించగలడు. రుచిని పట్టేయగలడు.. అంటే మనిషికి అయిదు ఇంద్రియాలే తెలుసు. ఏలియన్స్‌కి ఇవి కాకుండా ఇంకొన్ని గుణాలు. శక్తులు తెలిసివుండవచ్చు.. అవి ఏమిటో ఎలాంటివో మనం గుర్తించకపోవచ్చు. ఈ లెక్కన ఒకవేళ గ్రహాంతర జీవులు మన దగ్గరికి వచ్చినా మనం వాళ్లని గుర్తుపట్టలేమేమో! మన దగ్గరే మెసలుతున్నా పట్టుకోలేమేమో! అసలు ఇంతకాలం ఎలియన్స్‌ ఆచూకిని తెలివిమీరిన మనిషి కనిపెట్టకపోవడానికి ఇదే కారణం కావచ్చు.

గ్రహాంతరజీవులు ఉన్నారని మనం గట్టిగా నమ్ముతున్నాం. గ్రహరాశులనధిగమించి ఘనతారల పథము నుంచి గగనాంతర రోదసిలో తిరుగాడుతున్న మనకు ఏలియన్స్‌ ఇప్పటికీ ఇది అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది. మన పిచ్చి కాకపోతే మనం ఏలియన్స్‌ కోసం ఎలా వెదుకుతున్నామో ..కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కొందరు మనం కోసం అలాగే వెతుకుతుంటారు కదా! మనల్ని , మన చర్యలను పరిశీలిస్తూ ఉండారు కదా! అమెరికా పరిశోధనలో ఇప్పుడు తేలింది ఇదే!

మన బుద్ధి వికసించినప్పటి నుంచే ఏలియన్స్‌ ఉనికి కోసం అన్వేషణ మొదలుపెట్టాం.. దాదాపుగా ఎనిమిది దశాబ్దాల నుంచి ఇదే పనిలో ఉన్నాం.. 1940 నుంచి అంతరిక్షంలోకి శక్తివంతమైన రేడియో, విద్యుదయస్కాంత తరంగాలను పంపిస్తున్నాం.. ఇప్పటికిప్పుడు మన సిగ్నళ్లకు ఏలియన్స్‌ స్పందించినా , వారిచ్చే జవాబు మనకు అందడానికి 80 ఏళ్లు పడుతుంది.. అలాగని మనం పంపించిన రేడియో సిగ్నల్స్‌ వాళ్లకు కచ్చితంగా అందుతాయన్న గ్యారంటీ కూడా లేదు.. కాకపోతే అంతరిక్షం నుంచి చాలా సార్లు గుర్తు తెలియని సిగ్నల్స్‌ వచ్చాయి.. శాస్త్రవేత్తలు వాటిని గుర్తించారు. వాటిని ఏలియన్సే పంపి ఉంటారని అనుకుంటున్నారు. సెర్చ్‌ ఫర్‌ ఎక్స్‌ట్రా టెరిస్ర్టియల్‌ ఇంటెలిజెన్స్‌…క్లుప్తంగా సెటి…ఇతర గ్రహాల్లో మనలాంటి బుద్ధి జీవుల కోసం అలుపెరుగని అన్వేషణ.. బుద్ధి పెరిగినప్పట్నుంచి మనిషి వెతుకులాట. ఎలియన్స్‌ అదే గ్రహాంతర వాసుల జాడను కనిపెట్టాలనే తపన. ఇప్పటి వరకు అలాంటి జీవుల జాడ గురించి స్పష్టంగా తెలియకపోయినా తప్పకుండా వుంటారనేది సైంటిస్టుల భావన.

సూర్య కుటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీకి 326 కాంతి సంవత్సరాల దూరం పరిధిలో రెండు వేలకుపైగా నక్షత్ర మండలాలు ఉన్నట్టు ఆమె అంటున్నారు. అయిదు వేల సంవత్సరాల కిందటి నుంచే మనిషి ఖగోళంపై ఆసక్తి పెంచుకున్నాడు. గ్రహాలను లెక్కించాడు. సూర్యుడు కేంద్రంగా గ్రహాలన్నీ తిరుగుతున్నాయని తెలుసుకున్నాడు. ఆ నాటి నుంచే సుమారు 1,715 నక్షత్ర మండలాలు ఎర్త్‌ ట్రాన్సిట్‌ జోన్‌ పరిధిలోకి వచ్చాయని లీసా కాల్టేనెగర్‌ అంటున్నారు. ఎర్త్‌ ట్రాన్సిట్‌ జోన్‌ అంటే గ్రహాన్ని గుర్తించేందుకు అవసరమైన దూరమన్నమాట! ఈ నక్షత్ర మండలాల్లో వేలాది గ్రహాలు ఉన్నాయనీ, అందులో అందులోని 29 గ్రహాలు నీరు, రాళ్లతో నిండి ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. నీరు గాలి ఉంటే జీవం ఉండే ఉంటుంది.. ఆ జీవులు మనకంటే మహా మేథస్సు కలవారు అయి ఉంటే మాత్రం భూమి మీద ఉన్న మనల్ని గమనిస్తూనే ఉంటారు. మనం వారిని ఏలియన్స్‌ అని ఎలా అంటున్నామో.. వారు మనల్ని అలాగే పిలుస్తారు. ట్రాన్సిట్‌ పద్దతి ద్వారా ఈ అంచనాకు వచ్చామని లీసా అంటున్నారు. ట్రాన్సిట్‌ పద్దతి అంటే నక్షత్రం చుట్టూ గ్రహ భ్రమణం, గ్రహ వ్యాసం, ఆ గ్రహ వాతావరణం, ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఉపయోగించే సాంకేతికత. గ్రహాంతర జీవులు మనకంటే సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిన వారైతే తప్ప మనల్ని గమనించే వీలు లేదని అమెరికన్‌ మ్యూజియమ్‌ ఆఫ్‌ నేచర్‌ హిస్టరీ డైరెక్టర్‌ జాకీ ఫహెర్టీ అంటున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This