ఆ ఇంట్లో చదివితే ప్రభుత్వ ఉద్యోగం గ్యారంటీ..

తెలంగాణ రాష్ట్రంలో బోయపల్లి అనే చిన్న గ్రామం గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. కానీ బోయపల్లి గ్రామానికి రాష్ట్రంలో ఇతర గ్రామాలతో పోలిస్తే మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. బోయపల్లి.. కనీస సౌకర్యాలూ లేని చిన్న ఊరు… అయితే ఏంటి? ఇది ప్రభుత్వ ఉద్యోగాల గ్యారేజీ… ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఇక్కడ ఏకంగా 48 మంది సర్కారీ కొలువులు సాధించారు… అదీకూడా నగరాల్లోని కోచింగ్‌ సెంటర్లకు వెళ్లకుండానే.. వేలకు వేలు ఖర్చు చేయకుండానే సాధించారు. నలుగురు యువకుల ఆలోచన, కృషికి ప్రతిఫలంగా ఆ ఊరు కొలువుల ఖిల్లాగా మారింది.

మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని బోయపల్లి ఈ అరుదైన ఘనతను సాధించింది. ఈ గ్రామంలో నిరుద్యోగుల సంఖ్య పది మందికి అటూ ఇటుగా ఉందంటే బోయపల్లి గ్రామం గొప్పతనం సులభంగా అర్థమవుతుంది. బోయపల్లి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలను కూడా ఈ గ్రామంలో యువత కష్టపడి ఉద్యోగాలను సాధిస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తూ ఆలోచింపజేస్తోంది. బోయపల్లి గ్రామంలోని యువత ఒక పాత ఇంట్లో ఉద్యోగ సాధన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఏవైనా పోటీ పరీక్షలు జరిగి ఫలితాలు విడుదలయితే బోయపల్లి గ్రామం నుండి కొందరైనా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ఉంటారు. గ్రామంలోని నిరుద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంలో నలుగురు యువకుల కృషి ఉంది. రాజేశం, భాస్కర్, మల్లేష్, సిరికొండ సంతోష్ కొన్ని నెలల క్రితం అటవీ శాఖ ఉద్యోగాల కొరకు గ్రామంలోని ఒక ఖాళీ ఇంటిని అద్దెకు తీసుకొని సాధన మొదలుపెట్టారు. పరీక్షలలో విజయం సాధించడానికి అవసరమైన మెటీరియల్ ను సొంతంగా సిద్ధం చేసుకున్నారు. నలుగురు యువకులకు ఉద్యోగాలు రావడంతో ఆ తరువాత ఆ ఇంట్లో చదివి ఇప్పటివరకు 48 మంది ఉద్యోగాలను సాధించారు.

అయితే ఈ విజయంలో చాలామంది పాత్ర ఉంది. సీనియర్లు, గత విజేతలే పోటీ పరీక్షార్థులకు శిక్షకులు, మార్గదర్శకులు. సలహాలు, సూచనలు, పాఠాలు, నమూనా పరీక్షలు అన్నీ వారే. తొలి విడత విజేతల నుంచి ఇప్పటి వరకూ ఉద్యోగాలు సాధించిన ప్రతి ఒక్కరూ తమ సాధన కేంద్రానికి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుంటారు. వారికి కనిపించిన పోటీ పరీక్షల పుస్తకాలను కొని కేంద్రంలో ఉంచుతారు. అన్ని పరీక్షలకు సంబంధించిన పెద్దపెద్ద కోచింగ్‌ సెంటర్ల మెటీరియల్‌ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మరోవైపు ఎవరికి వీలైన సమయంలో వారు వచ్చి బోధన చేస్తుంటారు. ప్రతి ఆదివారం ఇక్కడ చదువుకునే వారికి పరీక్షలు నిర్వహిస్తారు. బృందచర్చలపై శిక్షణనిస్తారు. అన్నింటి కంటే ముఖ్యంగా వారి గెలుపు పాఠాలను ఔత్సాహికులకు చెబుతూనే ఉంటారు. ప్రతి సంవత్సరం బోయపల్లి గ్రామంలోని ఆ ఇంట్లో చదివి ఉద్యోగాలు సాధించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏ ప్రభుత్వ పరీక్ష ఫలితాలు విడుదలయినా బోయపల్లి నుండి ఎంతమంది ఎంపికయ్యారు…? అనేంత ప్రత్యేకతను ఈ గ్రామానికి ఇక్కడి యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తీసుకొనిరావడం గమనార్హం.

Content above bottom navigation