ఈ అమ్మాయికి లైసెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం వణికిపోయింది..

పోయినచోటే వెతుక్కోవాలి అంటారు… అదే సూత్రం పాటించింది జిలుమోల్‌ మారియెట్‌ థామస్‌. చేతుల్లేకపోయినా కారు నడపడం నేర్చుకుంది. పట్టుదలతో డ్రైవింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసి.. నిరాదరణకు గురైంది. అయితేనేం హైకోర్టును ఆశ్రయించి లైసెన్స్‌ పొందేందుకు అనుమతి సాధించింది. చేతుల్లేకపోయినా డ్రైవింగ్‌ లైసెన్సు పొందిన తొలి భారతీయ మహిళగా చరిత్రలో నిలిచింది ఇరవై ఆరేళ్ల జిల్‌మోల్‌. అది సాధించడం కోసం తాను పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఆమె గురించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

కేరళలో తొడప్పుళాలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది జిల్ మోల్. నాన్న నెల్లిక్కట్టు థామస్‌. అమ్మ అన్నకుట్టి. వీళ్లకు జిల్ మోల్ ఒక్కతే కూతురు. ఆమెకు పుట్టుకతోనే రెండు చేతుల్లేవు. జన్యుపరమైన సమస్యలే అందుకు కారణం. కృత్రిమ చేతులు పెట్టలేని పరిస్థితి.. అయితే అమ్మానాన్నలు ‘ నీకు సమస్య వల్ల ఇలా పుట్టావు. ఇక ఎప్పటికీ నీ కాళ్లే చేతులు కావాలి’ అని చెప్పేవారు. దాంతో బళ్లో చేరకుండానే కాళ్లతో రాయడం నేర్చుకుంది.

చిత్రలేఖనం, రకరకాల వస్తువులు పట్టుకోవడం అలవాటు చేసుకుంది. అన్నీ నేర్చుకున్నాకే ఆలస్యంగా స్కూల్ లో చేరింది. రెండుమూడేళ్లు గడిచాక కాళ్లతో రాస్తూ… మిగతా విద్యార్థులతో పోటీ పడి చదవడం, మంచి మార్కులు తెచ్చుకోవడం చూసిన స్కూల్ యాజమాన్యం ఆమెకు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించింది. చదువుకుంటూనే చిత్రలేఖనం, ఫొటోలు తీయడం, కంప్యూటర్‌ వంటివి కాళ్లతోనే నేర్చుకుంది. ఈ క్రమంలోనే కారు నడపాలనే కోరిక జిల్ మోల్ కు కలిగింది. కారు డ్రైవింగ్‌ నేర్చుకోవాలనే కోరికని వాళ్ళ నాన్నకు చెప్పింది. ఆయనే దగ్గరుండి ఓ కారుని అద్దెకి తీసుకుని నేర్పించారు. దాదాపు ఆరు నెలలపాటు కష్టపడి కాళ్లతో నడపడం నేర్చుకుంది. కాళ్లనే చేతులుగా మార్చుకుని, డ్రైవింగ్‌లో పట్టు తెచ్చుకుంది. బిజీ బిజీగా ఉండే రోడ్ల మీద దూసుకుపోయే సత్తా వచ్చింది. తన అమ్మానాన్నల్ని తన కారులో ఎక్కించుకుని సరదాగా దేశమంతా తిప్పాలనిపించింది. అందుకే లోను పెట్టి కారు కొనుక్కుంది. కానీ డ్రైవింగ్‌ లైసెన్సూ కావాలిగా… అందుకోసమని స్థానికంగా ఉన్నగా ఆర్టీవో కార్యాలయంలో దరఖాస్తు చేస్తే అక్కడి అధికారి ‘నీకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఎందుకు. చేతుల్లేనప్పుడు లైసెన్సు ఇవ్వడం కుదరదు. ఒకవేళ ఈ దేశంలో మరేదైనా రవాణా కార్యాలయంలో డ్రైవింగ్‌ లైెసెన్స్‌ సాధించి చూపించు. అప్పుడు నేను కూడా నీకు లైసెన్స్‌ ఇస్తా’ అని చాలా నిర్లక్ష్యంగా చెప్పాడు. ఎంత బతిమాలినా వినలేదు. న్యాయవాది సాయంతో…

Image result for జిల్మోల్

ఒకసారి కేరళలోని కుమ్లీ అనే ప్రాంతంలో ఓ పాఠశాల వారు ఆమెను మోటివేషనల్‌ స్పీకర్‌ గా ఆహ్వానించారు. అప్పుడే ఆమె లైసెన్స్‌ విషయంలో ఇబ్బంది పడిన సంఘటనలూ చెప్పింది. ఆ పాఠశాల ప్రిన్సిపల్‌ లయన్స్‌ క్లబ్ మెంబర్‌ అయిన షైన్‌ వర్ఘీస్‌ అనే న్యాయవాదిని పరిచయం చేశారు. ఆయనకి సమస్యనంతా వివరించింది. ఆ తర్వాత స్థానిక కోర్టులో కేసు వేశారు. అది ఖర్చుతో కూడుకున్నది అయినా జిల్ మోల్ వెనకాడలేదు. కోర్టు ఖర్చులకోసం అప్పు చేయడానికి సిద్ధమయ్యింది. నాలుగేళ్ల పోరాటం.. 2014లో స్థానిక కోర్టుకు వెళ్లిన తరువాత రెండేళ్లు తీర్పు కోసం ఎదురు చూసింది. ఆ తరువాత హైకోర్టు వరకూ తన సమస్యను తీసుకెళ్ళింది. ఎన్నో విచారణలు, పలు సార్లు కారు నడుపుతున్నట్టు వీడియోలు… ఇలా పక్కాగా ఎన్నో సాక్ష్యాలు చూపించడంతో పాటు ఆమెకు లైసెన్స్ ఇవ్వడానికి కోర్ట్ ఒప్పుకుంది. కోర్ట్ తీర్పు ఇచ్చిన తర్వాత ఆమెకు లైసెన్స్ ఇవ్వడానికి అధికారులు భయపడ్డారు. కానీ చేసేదేమి లేక చివరికి లైసెన్స్ ఇచ్చారు. ముందుగా లెర్నింగ్‌ లైసెన్స్‌ ను అనుమతించమని… కొన్నాళ్లు తానూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కారు నడుపుతున్నానని రుజువు అయితే శాశ్వత లైసెన్సు మంజూరు చేయమని కోర్ట్ చెప్పింది. ఏ అధికారి అయితే అవమానించాడో అతని చేతులమీదే డ్రైవింగ్‌ లైసెన్సు అందుకుంది. ఆమె పోరాటం గురించి తెలిసిన స్థానిక లయన్స్‌క్లబ్‌ సభ్యులు ఆమెకు కారును బహుమతిగా ఇచ్చారు.

Content above bottom navigation