ఏపీలో ఏకధాటిగా పెరుగుతున్న కరోనా .. 58కి చేరిన పాజిటివ్ కేసులు.

128

రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా విజృంభించింది. కొత్తగా మరో 14 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. అవన్నీ పశ్చిమ గోదావరి జిల్లాలోనివే. ఇప్పటిదాకా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అలాంటిది- ఒక్కసారిగా 14 కేసులు నమోదు కావడం కలకలాన్ని రేపింది. అవన్నీ ఢిల్లీ మత ప్రార్థనలతో ముడిపడి ఉన్నవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఢిల్లీ మత ప్రార్థనలపై సంచలన వీడియో: మర్కజ్‌ మసీదు ఖాళీకి ఆదేశించినా..మత పెద్దల నిర్లక్ష్యం..!

1

దెబ్బకొట్టిన మత ప్రార్థనలు..
ఇన్ని రోజులు అతి తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతూ వచ్చాయి. ఢిల్లీ మత ప్రార్థనలు దెబ్బ కొట్టాయి. ఈ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారు స్వస్థలానికి చేరుకోవడం, ఆ వెంటనే కరోనా వైరస్ బారిన పడుతున్నారు. దీనితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 58కి చేరుకుంది. రెండు రోజుల వ్యవధిలోనే 32 కేసులు నమోదు అయ్యాయంటే.. దాని తీవ్రత రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

పశ్చిమ గోదావరిలో తొలిసారిగా..

ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకేరోజు 14 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. జిల్లా కేంద్రం ఏలూరు ఆరు కేసులు నమోదు అయ్యాయి. భీమవరం,, నారాయణపురంలల్లో రెండు చొప్పున కేసులు, ఆకివీడు, గుండుగొలను, ఉండిలలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు వెల్లడించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు భవన సముదాయంలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనల్లో పాల్గొని స్వస్థలానికి తిరిగి వచ్చిన వారేనని తెలిపారు.

30 మందికి పరీక్షలు..

మర్కజ్ భవన సముదాయంలో మత ప్రార్థనల్లో పాల్గొని స్వస్థలానికి చేరుకున్న 30 మందికి వైద్య పరీక్షలను నిర్వహించారు. వారిలో 14 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. దీన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇంకా ధృవీకరించాల్సి ఉంది. మరో ఆరు కేసులకు సంబంధించిన నివేదికలు అందాల్సి ఉంది. మిగిలిన వారు నెగెటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. ఈ ఆరుమంది నివేదికలు అందిన తరువాత వాటి వివరాలను వెల్లడిస్తామని కలెక్టర్ చెప్పారు.

ఎక్కడెక్కడ తిరిగారో ఆరా తీస్తోన్న అధికార యంత్రాంగం..

కొత్తగా 14 మందిలో కరోనా వైరస్ ఉన్నట్లు తేలడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వారంతా ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవర్ని కలిశారనే విషయంపై ఆరా తీస్తున్నారు. పాజిటివ్ లక్షణాలు కనిపించిన 14 మందిని క్వారంటైన్‌కు తరలించారు. వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రక్త నమూనాలను సేకరించి, కాకినాడలోని రంగారాయ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ ల్యాబొరేటరీకి పంపించారు.

Content above bottom navigation