కోవిడ్ -19 వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది. ఇప్పటికే 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు దీని బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వైరస్ కు ఇప్పటి దాకా మందు లేదు. కొన్ని రకాల మందులతో ఈ వైరస్ ను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు వైద్యులు. అందులో పారాసిటమాల్ ఒకటి. కోవిడ్ -19 లక్షణాల్లో జ్వరం కూడా ఒకటి. దాన్ని తగ్గించేందుకు పారాసిటమాల్ పనిచేస్తుంది. అందుకే కోవిడ్ -19 ను తగ్గించేందుకు పారాసిటమాల్ పనిచేస్తుందని తెలుగు రాష్ట్రాల సీఎంలు తెలిపారు. అయితే, కోవిడ్ -19ను దూరం కొట్టేందుకు ఒక మందు కీలకంగా పనిచేస్తుందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది. మలేరియా చికిత్సలో వినియోగించే హైడ్రొక్సిక్లోరొక్విన్ మందుల ద్వారా ఈ మహమ్మారిని తరిమి కొట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రొక్సిక్లోరొక్విన్ ఎగుమతులపై నిషేధాన్ని విధించింది. రాత్రికి రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది.
హైడ్రొక్సిక్లోరొక్విన్ మందుల ఎగుమతులను నిషేధిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ (డీజీఎఫ్టీ) ఆదేశాలను జారీ చేసింది. కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు అందించే వైద్య చికిత్సలో హైడ్రొక్సిక్లోరొక్విన్ మందులను వినియోగించవచ్చని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇదివరకే వెల్లడించింది. కరోనా వైరస్ హైరిస్క్ కేసులకు చికిత్స అందించడంలో ఈ యాంటీ మలేరియా డ్రగ్‌ను వాడటానికి అవకాశం ఉందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ వెల్లడించారు. ఫలితంగా- దేశవ్యాప్తంగా ఈ డ్రగ్ కోసం డిమాండ్ పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ డ్రగ్ ఎగుమతలను నిషేధిస్తూ తక్షణ నిర్ణయాన్ని తీసుకుంది. ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను డీజీఎఫ్టీ జారీ చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. తమ అనుమతి లేనిదే ఎట్టి పరిస్థితుల్లోనూ హైడ్రోక్సిక్లోరొక్విన్ మందులను విదేశాలకు ఎగుమతి చేయొద్దని ఆదేశించింది. ఇతర దేశాల్లో కూడా కరోనా వైరస్ మందులను తయారు చేయడానికి హైడ్రొక్సిక్లోరొక్విన్ డ్రగ్‌ను ఎగుమతి చేయాల్సిన పరిస్థితి ఎదురైతే.. మానవతాదృక్పథంతో ఎగుమతులపై పాక్షికంగా నిషేధాన్ని సడలిస్తామని డీజీఎఫ్టీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను తమకు చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. ఎగుమతులను నిషేధిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను పొందుపరిచింది.

ఈ మందును రిజిష్టర్డ్ మెడికల్ ప్రాక్టీషినర్ సూచనల మేరకే తీసుకోవాలి. కోవిడ్ -19 లక్షణాలతో ఉన్న వ్యక్తులు ఈ మందును వాడుతున్నపుడు ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఇక వైద్య సిబ్బంది తొలి రోజు రెండుసార్లు 400 ఎంజీ మోతాదులో ఈ మందును తీసుకోవాలి. తర్వాత ఏడు వారాల పాటు వారానికి ఒకసారి 400 ఎంజీ మోతాదులో భోజనంతో కలిపి తీసుకోవాలి. కరోనా రోగులతో కలిసి ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యులు తొలి రోజు రెండు సార్లు 400 ఎంజీ మోతాదులో తీసుకోవాలి. తర్వాత మూడు వారాల పాటు వారానికి 400 ఎంజీ చొప్పున తీసుకోవాలి. అయితే.. 15 ఏళ్ల లోపు పిల్లలకు ముందస్తు నివారణ కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వాడరాదు. కరోనా బాధితులు, వారి కుటుంబసభ్యులకు, అనుమానితులు, వైద్య సేవలు అందించే సిబ్బంది కోవిడ్-19 లక్షణాలు లేకపోయినా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, దీనిపై అపోహలు వద్దని సూచించింది. అయితే, ఎప్పటి మాదిరిగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకుకోవాలని తెలిపింది. శ్వాస సంబంధిత జాగ్రత్తలు, వ్యక్తిగత భద్రతా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.