మహాభారతంలో చాలామందికి దుర్యోధనుడి గురించి బాగా తెలుసు. అయితే దుర్యోధనుడి భార్య భానుమతి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. భానుమతి తండ్రిపెట్టిన స్వయంవరానికి కర్ణుడు వెళ్తాడు. భానుమతి కర్ణుడిని చూసి అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అయితే ఆమె ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. మరి దుర్యోధనుడితో పెళ్లయిన తర్వాత కర్ణుడితో చాలా చనువుగా ఉంటుంది భానుమతి. ఇద్దరి మధ్య సంబంధం ఉందని కూడా అంటారు. అందులో నిజమెంత.. ఆ విషయాలకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే…..
మహాభారతంలో భానుమతి దుర్యోధనుని భార్య. ఈమె కాంభోజ రాజ్యానికి చెందిన రాజపుత్రిక. ఈమె తండ్రి ద్రోణాచార్యుని మిత్రుడు అయినా కాశీ రాజు చిత్రాంగదుని కుమార్తె. ద్రౌపది స్వయంవరంలో ఓడిపోయిన దుర్యోధనుడు చాలా రోజులు నిద్రలేకుండా అసూయతో రగిలిపోతాడు. అప్పుడు మామ శకుని, కాశీరాజు చిత్రాంగదుడు తన కూతురు భానుమతికి స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాడని సమాచారం ఇచ్చి దుర్యోధనున్ని ప్రోత్సహిస్తాడు. దాంతో తన ప్రియనేస్తం కర్ణునితో కలిసి ఆ స్వయంవరానికి చేరుకుంటాడు. స్వయంవరంలో పాల్గొనేందుకు శశిపాలుడు, జరాసంధుడు, రుక్మి వంటి మహామహులెందరో వచ్చి ఉంటారు. స్వయంవరం ఆరంభమవుతుంది. తన చెలికత్తెలతో కలిసి సభలోకి ప్రవేశిస్తుంది భానుమతి. ఆమె పక్కనున్న చెలికత్తెలు ఒకొక్క రాజకుమారుడి గురించీ వర్ణిస్తూ ఉండగా, వారిని పరికిస్తూ ముందుకు సాగుతుంటుంది. దుర్యోధనుడి వంతు వచ్చేసరికి అతణ్ని కూడా చూసీ చూడనట్లుగా ముందుకు సాగిపోతుంది. ఆ చర్యతో దుర్యోధనుడి అహంకారం దెబ్బతింటుంది. ఆ తిరస్కారాన్ని భరించలేకపోతాడు. వెంటనే భానుమతిని అమాంతంగా ఎత్తుకుని హస్తిన వైపు బయల్దేరతాడు. దుర్యోధనుడిని అడ్డుకునేందుకు వచ్చిన రాజకుమారులని ఓడించే బాధ్యత కర్ణుడు తీసుకుంటాడు. అలా భానుమతిని బలవంతంగా హస్తినకు తీసుకువచ్చి, అక్కడ ఆమెను వివాహం చేసుకుంటాడు దుర్యోధనుడు. ఇదేమిటంటూ ప్రశ్నించినవారిని ఒకప్పుడు తాత భీష్ముడు కూడా కాశిరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను ఇలాగే ఎత్తుకువచ్చాడు కదా అని నోరుమూయిస్తాడు.
అయితే స్వయం వరంలో భానుమతి సభలోకి పూలమాలతో అడుగుబెట్టినప్పుడు, శిశుపాలుడు, జరాసంధుడు మొదలైన బలమైన రాజులను చూస్తుంది. తర్వాత ఆమె కళ్ళు కర్ణునిపై పడతాయి. దర్బారులోకి ప్రవేశించిన భానుమతి కర్ణుడిని చూసీచూడగానే అతని మీద మనసు పారేసుకుంటుంది. కర్ణుడినే పెళ్లి చేసుకోవాలని భానుమతి అనుకుంటుంది. కానీ ఆమె దుర్యోధనుడికి నచ్చడంతో ఆమె కోరిక నెరవేరకుండా పోతుంది. మరి దుర్యోధనుడితో ఆమె పెళ్లాయ్యాక కూడా కర్ణుడిని అలాగే ప్రేమించేదా? దుర్యోధనుడికి ఈ విషయం తెలిసిందా అనే విషయానికి వస్తే…. దుర్యోధనుడికి భార్య భానుమతి అంటే చాలా ఇష్టం. ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఒకసారి కర్ణుడు, దుర్యోధనుడి భార్య భానుమతి ఆమె మందిరంలో పాచికలు ఆడుతూ ఉంటారు. చాలాసేపటి నుంచి ఆట సాగుతూ ఉంటుంది. అయితే ఆట ముగింపు దశకు వస్తుంది. మరికొద్దిసేపు ఆడితే భానుమతి కర్ణుడి చేతిలో ఓడిపోతుంది. కర్ణుడి చేతిలో ఆటలో ఓడిపోతానని భానుమతి అనుకునే సందర్భంలో ఆ మందిరంలోకి భానుమతి భర్త దుర్యోధనుడు ఎంటర్ అవుతాడు. భర్త దుర్యోధనుడి రాకను భానుమతి గమనిస్తుంది. ఆమె ద్వారానికి ఎదురుగానే కూర్చొని ఉంటుంది. దీంతో దుర్యోధనుడు రాగానే ఆమెకు కనపడతాడు. ఇక కర్ణుడి వీపు ద్వారం వైపునకు ఉంటుంది. దుర్యోధనుడు వచ్చే ప్రతి సారి భానుమతికి లేచి నిలబడడం అలవాటు. భర్తకు ఆమె ఇచ్చే మర్యాద ఇదే. అప్పుడు కూడా భానుమతి మర్యాదగా పైకి లేవడానికి ప్రయత్నిస్తుంది.

అది గమనించిన కర్ణుడు ఆమె ఓడిపోతుంది కాబట్టే పారిపోయేందు ప్రయత్నిస్తుందని అనుకుంటాడు. భానుమతి ఓడిపోబోతున్నావని పారిపోతున్నావు కదా.. అలాంటి పప్పులేమి కుదరవు.. కూర్చొని నాతో ఆట ఆడాల్సిందేనని ఆమె మణికట్టును పట్టుకుని లాగుతాడు. ఆ క్రమంలో ఆమె నడుముకున్న వడ్డాణానికి కర్ణుడి చేయి తగులుతుంది. దానికి అలంకారమై ఉన్న ముత్యాలు తెగి కింద పడుతాయి. దీంతో భానుమతి భయానికి లోనవుతుంది. ఆమె ముఖం మొత్తం ఆందోళనతో నిండిపోతుంది. ఇది గమనించిన కర్ణుడు వెనక్కి తిరిగి చూస్తే దుర్యోధనుడు కనిపిస్తాడు. కర్ణుడికి, భానుమతికి ఏం చేయాలో అర్థం కాదు. అసలు విషయం చెప్పేంత వరకు కూడా దుర్యోధనుడు వింటాడో లేదోనని కర్ణుడు అనుకుంటాడు. కానీ కర్ణుడిపై దుర్యోధనుడికి అపార నమ్మకం ఉంటుంది. అందువల్ల దుర్యోధనుడు తాపీగా కిందపడ్డ ముత్యాలను ఏరుతూ కూర్చొంటాడు. ఏంటీ.. ముత్యాలు మొత్తం నేనే ఏరాలా..? మీరిద్దరూ అలాగే చూస్తూ ఉంటారా అని కర్ణుడిని, భానుమతిని దుర్యోధనుడు అడుగుతాడు. అంత మంచి స్నేహం కర్ణుడికి, దుర్యోధనుడికి మధ్య ఉండేది. అంతేకానీ కొంతమంది చెప్పేటట్టు కర్ణుడికి, దుర్యోధనుడి భార్య భానుమతికి ఎలాంటి సంబంధం లేదు.