దేశంలో తొలి కరోనా మరణం.. హైదరాబాద్‌లో చికిత్స పొందిన ఆ వృద్ధుడికి కరోనా

95

ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా వైరస్ ఇప్పుడు భారత్‌లోకి ప్రవేశించింది. గురువారం రోజు మొత్తంగా కరోనా బారిన పడినవారి సంఖ్య 73కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇక ఇటలీలో కరోనా వైరస్ మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండంటంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను తిరిగి మనదేశానికి రప్పించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ లోక్‌సభలో చెప్పారు. ఇదిలా ఉంటే భారత్‌లో తొలి కరోనా మరణం జరిగింది. అది కాస్త హైదరాబాద్‌కు లింక్ ఉంది.. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటక కలబుర్గిలో 76 ఏళ్ల వృద్ధుడు కరోనావైరస్‌ సోకడం వల్ల చనిపోయాడు. ఈ విషయాన్ని కర్ణాటక వైద్యఆరోగ్య శాఖ నిర్ధారించింది. జనవరి 29న సౌదీ అరేబియాకు వెళ్లిన ఆయన ఫిబ్రవరి 29న హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ నిర్వహించగా.. అతడిలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని అధికారులు తెలిపారు. దీంతో అదే రోజు స్వస్థలమైన కలబుర్గీకి వెళ్లారు. ఈ నెల 6న దగ్గు, జ్వరంతో ఇబ్బంది పడుతుండటంతో ఓ ప్రైవేట్‌ డాక్టర్‌ ఇంటి వద్దకే వెళ్లి అతన్ని చూశాడు. జ్వరం తీవ్రం కావడంతో ఈ నెల 9న కలబుర్గిలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ సమయంలో ఆయన శాంపిల్స్‌ సేకరించి.. మార్చి 9న కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు వైద్యులు. అయితే శాంపిల్స్ ఫలితాలు రాకముందే, డాక్టర్ల సూచనల్ని పాటించకుండా.. రోగిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయించేందుకు సిద్ధమయ్యారు బంధువులు. దీంతో ఉన్నతాధికారులు సూచన మేరకు రోగి బంధువుల్ని కలిసిన జిల్లా వైద్యాధికారి… రోగిని గులబర్గా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌-GIMSలో గల ఐసోలేషన్‌ వార్డులో చేర్పించాల్సిందిగా కోరారు. దీనికి నిరాకరించిన బంధువులు… అతనికి ఏమాత్రం సమాచారమివ్వకుండా రోగిని హైదరాబాద్‌కు తరలించి… ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

Image result for తొలి కరోనా మరణం

అయితే, హైదరాబాద్‌లో ఆయన ఏ మాత్రం కోలుకోకపోవడంతో తిరిగి కర్ణాటకలోని స్వస్థలమైన కలబుర్గీకి తీసుకెళ్తుండగా చనిపోయాడు. చనిపోయే సమయానికి రిపోర్టులు అందకపోవడంతో ఆయనకు కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కాలేదు. రిపోర్టులు వచ్చాక ఆయన కరోనాతో చనిపోయినట్టు నిర్ధారించారు కర్ణాటక వైద్యాధికారులు. హాస్పిటల్ వర్గాలు కరోనా లక్షణాలున్న పేషెంట్‌ను బయటకు వెళ్లడానికి ఎలా అనుమతించాయనేది తెలియాల్సి ఉంది. ఈ విషయమై విచారణ కోసం కర్ణాటకకు చెందిన ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకుంది. కరోనా పేషెంట్ ఎక్కడ అడ్మిట్ అయ్యారు. అతడితో ఎవరు కాంటాక్ట్‌‌లో ఉన్నారు. అతణ్ని ఎలా బయటకు పంపారు అనే విషయాలను ఆరా తీయనుంది. కరోనా మరణానికి హైదరాబాద్ నగరంతో సంబంధం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని హాస్పిటళ్లను అప్రమత్తం చేసింది. మరణించిన వృద్ధుడితో 43 మంది కాంటాక్ట్‌లో ఉన్నారని గుర్తించారు. వారందర్నీ ఇళ్లలో ఐసోలేషన్‌లో ఉంచుతామని కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Content above bottom navigation