దేశంలో 142 కి చేరిన కరోనా కేసులు.. హైదరాబాద్‌లో చనిపోయిన వ్యక్తికి చికిత్స చేసిన డాక్టర్‌కు వైరస్

ప్రపంచవ్యాప్తంగా 163 దేశాల్లో విస్తరించిన కరోనా వైరస్ ప్రమాద ఘంటికలను మోగిస్తున్న వేళ, ఇండియాలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 142 ఉన్నాయని అధికారిక ప్రకటన విడుదలైంది. మహారాష్ట్రపై వైరస్ ప్రభావం అత్యధికంగా ఉండగా, ఈ రాష్ట్రంలో ఇప్పటివరకూ 39 కేసులు నమోదయ్యాయి. ఆపై రెండో స్థానంలో తొలి కేసు వెలుగుచూసిన కేరళ నిలిచింది. కేరళలో 26 కేసులు నమోదయ్యాయి.

ఆ తరువాత ఉత్తరప్రదేశ్ లో 15, హర్యానాలో 15, కర్ణాటకలో 11, ఢిల్లీలో 8, లడఖ్ లో 6, తెలంగాణలో 5, రాజస్థాన్ లో 4, జమ్ము కశ్మీర్ లో 3 కేసులున్నాయని, ఉత్తరాఖండ్, పంజాబ్, ఒడిశా, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.

తాజాగా మరో ఇద్దరికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఆ ఇద్దరూ అమెరికా నుంచి ఇటీవలే భారత్‌కు వచ్చినట్టు అధికారులు తెలిపారు. దేశంలో మంగళవారం మూడో కరోనా మరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

ముంబైకి చెందిన ఆయన కొద్దిరోజుల కిందట దుబాయ్‌ నుంచి రాగా.. కోవిడ్ 19 ఉన్నట్టు తేలింది. బాధితుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. అయితే, ఆయన కేవలం కరోనా వైరస్‌తోచే చనిపోలేదని, బీపీ, న్యూమోనియా కూడా ఉన్నట్టు బృహన్ ముంబై కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ పర్దేశి వెల్లడించారు. ఆయన భార్యకు కూడా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

మహారాష్ట్రకు చెందిన మూడేళ్ల చిన్నారి సైతం వైరస్ బారినపడింది. ముందు ఆ పాప తండ్రికి వైరస్‌ నిర్ధారణ కాగా.. తర్వాత అతడి నుంచి భార్యకు, చిన్నారికి వైరస్‌ సోకింది. దేశంలో ఇప్పటివరకూ ఈ వైరస్‌ బారినపడిన 137 మందిలో 24 మంది విదేశీయులు ఉన్నారు. హర్యానాలో 15 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా.. వారిలో 14 మంది విదేశీయులే… తొలిసారి ఆ రాష్ట్రానికి చెందిన ఓ మహిళకు వైరస్‌ సోకినట్టు మంగళవారం నిర్ధారణ అయ్యింది. ఆమె కూడా ఇటీవలే ఇండోనేషియా, మలేషియా వెళ్లొచ్చినట్టు అధికారులు వివరించారు.

Image result for corona viryus

కరోనా బాధితుల్లో ఇప్పటి వరకు 14 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. తాజాగా, పశ్చిమ్ బెంగాల్, పుదుచ్చేరిలోనూ తొలి కేసులు నమోదయ్యాయి. పుదుచ్చేరి మహిళ మార్చి 13న సౌదీ నుంచి భారత్‌కు వచ్చారని అధికారులు తెలిపారు. అలాగే, హైదరాబాద్‌లో మృతిచెందిన వ్యక్తికి తొలుత చికిత్స చేసిన కర్ణాటక వైద్యుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. బ్రిటన్ నుంచి 20 ఏళ్ల మహిళ, అమెరికా నుంచి వచ్చిన 67 ఏళ్ల వృద్ధురాలికీ వైరస్‌ సోకడంతో కర్ణాటకలో బాధితుల సంఖ్య 11కు చేరింది. ఇటలీ నుంచి స్వదేశానికి చేరుకున్న వీరు ప్రస్తుతం ఢిల్లీ సమీపంలోని ఐటీబీపీ క్వారంటైన్‌ శిబిరంలో ఉన్నారు.

Content above bottom navigation