పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానాన్ని రాసిన గుహ ఎక్కడ ఉందో తెలుసా ?

108

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఉహించి కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానం లోని విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. అయితే పూర్వం బ్రహ్మం గారు నివసించిన ప్రదేశం, ఆయన తపస్సు చేసిన ప్రదేశం ఇక్కడే అని చెబుతుంటారు. అంతేకాకుండా బ్రహ్మం గారు జీవసమాధి అయినా ఈ ప్రదేశంలో ఆ స్వామికి ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజలు చేస్తున్నారు. మరి ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? బ్రహ్మం గారు దర్శనం ఇచ్చే ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా, మైదుకూరుకు సుమారు 24 కి.మీ. దూరంలో కందిమల్లయ్య పల్లి అనే గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయం ఉంది. ఇది చాలా పేరుగాంచిన పురాతనమైన మఠము. ఇక్కడ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారిని విష్ణువు అవతారంగా కొందరు భక్తులు కొలుస్తారు. అయితే క్రీ.శ. 1608 లో వీరబ్రహ్మం గారు అవతరించి భవిష్యత్తులో జరుగబోయే విపత్తులను ఆయన ముందుగానే దర్శించి, దానినే కాలజ్ఞానం అనే పేరుతో ఎన్నో తత్వాల రూపంలో బోధించారు. వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు. ఈయన మూఢనమ్మకాలు, మూఢ భావాలను ఖండించారు. ఇంకా చెడుని విమర్శించి మంచిని బోధించారు. వారి బోధనలు విశ్వ కల్యాణానికి, విశ్వశాంతికి దోహదం చేసాయి.

Image result for వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞా గుహ

బ్రహ్మం గారి కాలజ్ఞాన రచన విషయానికి వస్తే… బ్రహ్మం గారు బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఆశ్రయాన్ని పొంది, ముందు ఆవుల కాపరిగా జీవనాన్ని మొదలుపెట్టారు. ఆ సమయంలోనే రవ్వలకొండ వద్ద ఉన్న ఒక గుహలో కూర్చొని కాలజ్ఞానాన్ని వ్రాయడం మొదలుపెట్టి, అక్కడే పూర్తి చేసి, శ్రీ అచ్చమ్మ కి కాలజ్ఞానాన్ని బోధించారు. అప్పుడు బ్రహ్మం గారు, అచ్చమ్మ గారు మాట్లాడుకున్న ప్రదేశాన్ని ప్రస్తుతం ముచ్చట్ల కొండ అని పిలుస్తున్నారు. ఈ ముచ్చట్ల కొండ ప్రదేశం దగ్గర మనకి శ్రీ అచ్చమ్మ వారి విగ్రహం దర్శనం ఇస్తుంది. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన తాళపత్రాలన్నీ కూడా అచ్చమ్మ గారి ఇంటి దగ్గరలో ఉన్న పాతరలో వేసి, దానిపైన బండ వేసి మూసివేశారంటా. అక్కడ ఆ తరువాత ఒక చింత చెట్టు మొలిచింది. దీంతో భక్తులు ఇది మహిమగలదని నేటికీ అక్కడ పూజలు చేస్తుంటారు.

ఇలా బ్రహ్మంగారు ముచ్చట్ల కొండలో తన కాలజ్ఞానాన్ని రాశారు. ఇంకా ఇక్కడ ఉన్న పోలేరమ్మ ఆలయానికి, రచ్చబండ కి కూడా ఒక విశేషం ఉందని చెబుతారు. ఊరికి కాపలాగా ఉండే పోలేరమ్మ బ్రహ్మంగారికి నిప్పు ఇచ్చిందని కూడా చెబుతారు. దాని వెనుక ఉన్న కథ విషయానికి వస్తే…

పూర్వం బ్రహ్మం గారు కందిమల్లయ్య ప్రాంతానికి చేరుకొని వండ్రంగి వృత్తి చేసుకుంటూ ఉండేవాడు. ఈ గ్రామానికి పోలేరమ్మ గ్రామ దేవత. ఈ గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా పోలేరమ్మ జాతర చేయడానికి చెందాలు వేసుకుంటుండగా, అందరిలానే బ్రహ్మం గారి దగ్గరికి కూడా వెళ్లి జాతర చేస్తున్నాం కనుక ఎంతో కొంత చెందా ఇవ్వాలని గ్రామస్థులు కోరగా, నేను చాలా బీదవాడిని నేను ఇవ్వలేను అని చెప్పాడట. అయినా గ్రామస్థులు చెందా ఇవ్వాల్సిందే అని ఒత్తిడి చేయగా, సరే నేను పోలేరమ్మను దర్శనం చేసుకొని అక్కడే ఉన్న రచ్చ బండ దగ్గర ఇస్తానని చెప్పి, అందరితో కలసి రచ్చబండ దగ్గరికి వచ్చి, చుట్ట కాల్చుకోవడానికి నిప్పు ఉందా అని చుట్టూ పక్కల అందరిని అడుగగా ఎవరి దగ్గర లేదనడంతో, బ్రహ్మం గారు పోలేరమ్మ చుట్ట కాల్చాలని ఉంది అని గట్టిగా అరవడంతో ఒక నిప్పు కణిక వచ్చి చుట్ట వెలిగించగా, ఇక చాలు పోలేరమ్మ తల్లి అని అనగానే మళ్ళి ఆ నిప్పు కణిక గుడిలోకి వెళ్లిపోయిందట. ఇది నిజంగా జరిగిందనడానికి సాక్ష్యంగా కందిమల్లయ్య గ్రామంలో బ్రహ్మం గారి ఇంటి పక్కన ఒక రచ్చ బండ, ఆ పక్కనే పోలేరమ్మ ఆలయం ఉంది. ఇక్కడ మనకి శ్రీ బ్రహ్మం గారు పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ అనే బోర్డుని మనం చూడవచ్చు. ఇలా బ్రహ్మంగారు తన మహిమలను చూపించడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పెద్ద కొర్లపాడు అనే గ్రామానికి చెందిన శ్రీ శివకోటయ్య కుమార్తె అయినా గోవింద మాంబాను వివాహం చేసుకొని స్వామివారు రాజయోగిగా మారారు. కందిమల్లయ్య గ్రామంలోని ప్రజలందరూ కూడా ఇక్కడ ఆయన కోసం ఒక మఠాన్ని నిర్మించి ఆయనకి ఇచ్చారు. ఈ స్వామికి ఆరుగురు సంతానం, ఇంకా సిద్దయ్య అనే ఒక ప్రియ శిష్యుడు ఉన్నాడు. వీరబ్రహ్మం గారు తన తదనంతరం చేతిబెత్తము, శిఖాముద్రిక, సింహపాదుకలు, యోగదండము తన ప్రియ శిష్యుడైన సిద్దయ్యకు కానుకగా ఇచ్చాడు.

ఇక క్రీ.శ. 1694 వ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు భక్తుల సమక్షంలో జీవసమాధి యందు ప్రవేశించారు. ఇక్కడ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి జీవసమాధితో పాటు, శ్రీ వీరబ్రహ్మం గారి మనువరాలు శ్రీ ఈశ్వరమ్మ గారి ఆలయం, ఆమె తపస్సు చేసిన గృహం, బ్రహ్మం గారు నివసించిన గృహం, కక్కయ్య గారి సమాధి, పోలేరమ్మ నివసించిన వేప చెట్టు, సిద్దయ్య గారి మఠం, కాలజ్ఞానం పాతర మొదలగునవి దర్శించవచ్చును. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు దీక్ష వహించి బ్రహ్మం గారి మఠమునకు వచ్చి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి జీవసమాధిని భక్తి శ్రద్దలతో దర్శిస్తారు

Content above bottom navigation