మహాశివరాత్రి ఎలా మొదలైంది..? శివుడు లింగారూపంలోకి ఎందుకు మారాడు..?

ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజునే శివుడు లింగరూపంలో ఉద్భవించాడని, శివపార్వతుల కళ్యాణమని అంటారు. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే మహశివరాత్రి రోజున శివుడికి పూజలు, అభిషేకాలు చేస్తాము. విశ్వమంతటా నిండి ఉన్నది శివుడే, ఆయన లయకారుడు, జగదేశ్వరుడు. అంటే భూమ్మీద ప్రతీ జీవి ఆయన ఆదీనంలోనే ఉంటాయి, అంతెందుకు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అయితే ఈ భోలాశంకరుడు అయిన పరమశివుడు శివలింగ రూపంలోకి ఎలా మారాడు.. దీని వెనుక ఉన్న కథ ఏమిటంటే…

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులు అంటారు. ఒకరు సృష్టించేవారు, ఒకరు పాలించేవారు, ఇంకొకరు తనలో ఐక్యం చేసుకునే వారు. అయితే పురాణ కథల ప్రకారం… ఒక రోజు ప్రళయ కాల సమయంలో బ్రహ్మకు, విష్ణువుకు, ఎవరు గొప్ప అని వాదన మొదలయింది. సృష్టించేవాడను నేను గనుక నేనే గొప్ప అని బ్రహ్మ, నాభి నుండి నువ్వు జన్మించావు గనుక నీకన్న నేనే గొప్ప అని ఇద్దరు ఘర్షణ పడుతున్నారు. ఎంతకీ గొడవ తగ్గుముఖం పట్టడంలేదు. పైగా ఇంకా హెచ్చుగా వెళుతోంది. ఈ క్రమంలోనే, వీరి గొడవని చూసి దేవతులందరు భయపడి, పరమశివుని దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. దేవతల మోర ఆలకించిన శివుడు ఒక అగ్ని స్థంబ రూపంలో వారిద్దరి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతిని చూసి ఆశ్చర్యంతో, గొడవ ఆపేసి దాని గురించి ఆలోచించడం మొదలుపెడతారు. అసలు ఈ జ్యోతి ఎక్కడి నుంచి వచ్చింది, దీని ఆధ్య, అంతం తెలుసుకోవాలని బ్రహ్మ విష్ణువులు ఇద్దరు నిర్ణయించుకున్నారు. విష్ణుమూర్తి వరాహ అవతారంలో ఆదిని తెలుసుకోవడానికి నేలను తవ్వుకుంటూ వెళ్లారు, ఇక బ్రహ్మ దేవుడు హంస రూపంలో అంతం తెలుసుకోవడానికి పైకి వెళ్లారు..

Image result for mahashivratri

అయితే ఎంత దూరం వెళ్లినా కూడా ఇద్దరు తెలుసుకోలేకపోయారు సరి కదా, బ్రహ్మ మొగలి పువ్వుతో అబద్దపు సాక్ష్యం చెప్పించి, నేను అంతం చూశానని చెప్తాడు. అందుకే పరమశివుడి శాపానికి మొగలిపువ్వు గురవుతుంది. ఇక నిజాయితీగా తెలుసుకోలేకపోయనని ఒప్పుకున్నా విష్ణుమూర్తి, పరమశివునితో సమానంగా పూజింప తగిన వాడిగా విరాజిల్లుతాడు. కాని బ్రహ్మ దేవునికి మాత్రం భూలోకమున పూజలు జరగవు అనే శాపాన్ని పొందుతాడు. ఆ తర్వాత ఆ అగ్ని స్థంబము మెల్లగా కంటికి కనపడే లింగాకారంలోకి వస్తుంది. ఆ స్థంబము, అగ్ని జ్వాలాగా ఏర్పడిన ప్రదేశమే అరుచాలప్రదేశ్. అందుకే అక్కడ పరమశివుడి లింగాన్ని అగ్ని లింగంగా పిలుస్తారు. ఇలా లింగా రూపంలోకి వచ్చిన మొదలు పూజలు మొదలుపెట్టిన రోజుని మహాశివరాత్రిగా పిలుస్తారు. లింగోద్భావం రాత్రి సమయంలో జరిగినందున శివరాత్రి అంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయానే లేచి తలస్నానం చేసి పూలూ ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు.

Content above bottom navigation