మహాశివరాత్రి స్పెషల్ : ప్రతి ఏటా పెరిగే స్పటిక శివలింగం… ఎక్కడ ఉందో తెలుసా?

మన భారత దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కొన్ని చోట్ల మొక్కుకుంటే కోరికలు వెంటనే తీరుతాయని చెబుతారు. కొన్ని చోట్లకు వెళ్తే మనకు ఉన్న దోషాలు పోతాయని చెబుతారు. ఇలా ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలా కొంత ప్రత్యేకత ఉన్న ఆలయాలలో దక్షిణ కాశీ విశ్వేశ్వర ఆలయం ఒకటి. ఇది ఆంద్రప్రదేశ్ రాష్టంలోని విశాఖ జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రామంలో ఉంది. ఈ దేవాలయంలో శివలింగం తెల్లని స్పటిక రూపంలో ఉంటుంది. అంతేకాదు స్వయంభువుగా వెలసిన ఈ లింగం ప్రతి ఏటా పెరుగుతుంది.

వాడ్రాపల్లిలో దక్షిణ కాశీ విశ్వేశ్వర ఆలయంగా వెలుగొందుతున్న ఈ దేవాలయం వెనుక ఓ ఆసక్తికరమైన కధ ఉంది. దాదాపు 250 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి చివరన ఉన్న పంట పొలాల్లో రైతులు కాలువ గట్లు వేసేందుకు అక్కడ ఉన్న పుట్టలను తవ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ పుట్టను తవ్వుతుండగా తెల్లని రూపంలో ఈ శివలింగం బయటపడింది. దీంతో గ్రామస్తులు ఆ శివలింగాన్ని ఆ పంట పొలాల నుంచి తరలించి గ్రామంలో ప్రతిష్టించాలని అనుకున్నారు. దానికోసం శివ లింగాన్ని బయటకు తీసేందుకు భూమిలో దాదాపు 25 అడుగుల మేర తవ్వారు. ఎంత తవ్వినా అంతస్తుల అడుగుల కొద్దీ శివలింగం కనిపిస్తుంది కానీ లింగం చివరి భాగం మాత్రం బయటపడలేదు. పైగా భూమిలో నుంచి సర్పాలు కూడా రావడంతో భయపడిన గ్రామస్తులు శివలింగాన్ని అక్కడి నుంచి కదపాలనే ఆలోచనను విరమించుకుని, ఆ ప్రదేశంలోనే దేవాలయాన్ని నిర్మించారు. సాధారణంగా అన్ని శివాలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. కొన్ని చోట్ల పశ్చిమ ముఖంగా కూడా ఉంటాయి. కానీ ఈ ఆలయంలో శివలింగం మాత్రం దక్షిణ ముఖంగా దర్శనమివ్వడం విశేషం. ఆలయ ధర్మకర్త సూరిశెట్టి పరమేశ్వర రావు తన పూర్వీకుల నుంచి ఈ ఆలయ నిర్వాహణ బాధ్యతలు స్వీకరించి అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఇక్కడ గ్రామస్తులు శివలింగాన్ని స్వయంగా తాకి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. దీనిని వాళ్ళు తమ అదృష్టంగా భావిస్తారు.

Image result for maha shivaratri

ప్రధమ పూజలందుకునే వినాయకుడు, మహాశివుని సతీమణి పార్వతీదేవిల విగ్రహాలు ఈ ఆలయంలో లేకపోవడంతో ఇప్పటి వరకూ కేవలం శివలింగ ఆరాధన మాత్రమే జరుగుతుంది. కానీ ఈ ఏడాది మాత్రం మహాశివుడు సతీసమేతంగా ఇక్కడ భక్తులకు దర్శనమివ్వబోతున్నాడు. ఆలయ ధర్మకర్త సూరిశెట్టి పరమేశ్వరరావు కృషి, దాతల సహాయ సహకారాలతో దేవాలయంలో వినాయక, దాక్షాయణి దేవిల విగ్రహాలను ప్రతిష్టించారు. దీంతో ఆలయానికి పరిపూర్ణత్వం చేకూరినట్లు భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజున జిల్లా నలుమూలల నుంచి భక్తులు ఈ శివాలయానికి వచ్చి జాగరణ, విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఏడాది శివరాత్రికి ఆలయం సంపూర్ణంగా ముస్తాబు కావడంతో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. వాడ్రాపల్లి గ్రామంలో దక్షిణేశ్వర దేవాలయంతో పాటు మరో పర్యాటక ఆకర్షణ కూడా ఉంది. అదే వాడ్రాపల్లి ఆవ. ఇది వేల ఎకరాల్లో విస్తరించిన ఒక జీవ సరస్సు. ఇందులో టూరిస్టులు బోటు పైన షికారుకు వెళ్లవచ్చు. వాడ్రాపల్లి ఆవలో బోటు షికారుకు వెళ్లే వారు గొప్ప ఆధ్యాత్మిక అనుభవానికి గురవుతారు. ఈ నీటి అడుగున ఒక శివ లింగం ఉంటుంది. నీటిపై నుంచి శివలింగాన్ని ముట్టుకుని దర్శించుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. వేసవి కాలంలో ఇక్కడ నీటి మట్టం కాస్త తగ్గడంతో శివలింగం పూర్తిగా బయటపడుతుంది. అప్పుడు భక్తులు నడుచుకుంటూ వెళ్లి ఈ లింగాన్ని దర్శించుకుంటారు.

Content above bottom navigation