మారుతీరావు చనిపోయిన రోజును ఫాదర్స్ డే గా ప్రకటించాలి – డైరెక్టర్ డిమాండ్..

మారుతీరావు ఆత్మహత్యతో ఒక్కసారిగా అమృత, ప్రణయ్‌ ప్రేమకథ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. మిర్యాల గూడ ప్రాంతానికి చెందిన అమృత.. ప్రణయ్‌ని ప్రేమించి పెళ్లిచేసుకోవడంతో తన కులం వాడు కాదన్న కారణంతో పాటు ఆస్తి, అంతస్తులు సరితూగకపోవడంతో ప్రణయ్‌ని హత్య చేయించారు మారుతీరావు. నిండు గర్భిణిగా ఉన్న కూతురు అమృత కళ్ల ముందే అత్యంత దారుణంగా కిరాయి హంతకులు ప్రణయ్‌ని నరికిచంపారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న మారుతీరావు జైలుకి వెళ్లి ఇటీవలే బెయిల్‌పై తిరిగి వచ్చారు. అమృత మగబిడ్డకు జన్మనిచ్చి అత్తింట్లోనే ఉంటుంది. మరికొద్ది రోజుల్లో ఈ కేసుపై తీర్పువెలువడే అవకాశం ఉంటుండగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై పలువురు సెలెబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. శ్రీరెడ్డి, పలాస డైరెక్టర్ కరుణ కుమార్ లాంటి వాళ్ళు ఇప్పటికే స్పందించారు.

తాజాగా టాలీవుడ్ యువ దర్శకుడు సాయి రాజేష్.. మారుతీ రావు చనిపోయిన రోజుని ఫాదర్స్ డే గా ప్రకటించాలి అంటూ వ్యంగ్యంగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన పెట్టిన మరొక పోస్ట్ విషయానికి వస్తే.. ‘‘18 ఏళ్ళు నిన్ను గారాబంగా పెంచాను.. పెన్సిలు, రబ్బరు, బొట్టుబిళ్ళ, పప్పరమిట్టు..ఏది అడిగితే అది ఇచ్చాను. ఇదంతా ఎందుకోసం ?? నేను ఏ మలపత్రాష్టుడిని తెచ్చినా, తలదించుకొని తాళి కట్టించికొని ఆదర్శ నారిగా నిలుస్తావని అనుకున్నా.. ఏమన్నా అంటే…నీ భర్తని చంపించావు అంటావు ? 20 లక్షలు ఒక కిరాయి హాంతకుడికి ఇచ్చినప్పుడు, అందులో ప్రతి నోటు నాన్న ప్రేమతో తపించిపోయాయి. అల్లుడిని చంపానే కానీ… నిన్ను కాదుగా…అక్కడైన నీకు నా ప్రేమ అర్థం కాలేదా ?

Image result for మారుతీరావు చనిపోయిన రోజును ఫాదర్స్ డే గా ప్రకటించాలి

గర్భవతిగా ఉన్న కూతురు కోసం ఒక మర్డర్ చేయిస్తే, అది తండ్రి ప్రేమ…చనిపోయిన కుర్రాడి తండ్రిది మాత్రం కుట్ర అనుకునే గొర్రెగాళ్ళు నా అభిమానులు… వాళ్ళకే నా ప్రేమ అర్థం అయింది… నీకెందుకు కాలేదు… పర్లేదు… నన్ను అభిమానిస్తున్న ప్రతి ఇంట్లో కూతురికి నేను తండ్రిగా వస్తా. ప్రతి కొడుక్కి మామగా వస్తా.. అంటూ పోస్ట్ చేశాడు. ఈ డైరెక్టర్ పెట్టిన పోస్ట్ కు ఓ వ్యక్తి.. ‘నీకో కూతురు ఉంది…15 ఏళ్లకే ప్రేమించి వెళ్ళిపోతే తెలుస్తుంది ఆ తండ్రి బాధ.. తండ్రిలా ఆలోచించు’.. అని రిప్లై ఇవ్వగా.. ‘నీకో పెళ్ళాం ఉంది.. ఆమె నిండు గర్భంతో ఉన్నప్పుడు నిన్ను ఆమె ముందే నరికేస్తే అప్పుడు తెలుస్తుంది ఆమె బాధ.. మనిషిలా ఆలోచించు’.. అంటూ ఘాటుగా సమాధానమిచ్చాడు సాయి రాజేష్.. ఈ పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.

Content above bottom navigation