మారుతీ రావు : ఒక నాన్న, రెండు తప్పులు.. కూతురు బాధితురాలు !

62

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు .. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో తట్టుకోలేకపోయిన మారుతీ రావు.. తన బిడ్డ గర్భవతి అని తెలిసి కూడా అల్లుడిని కిరాయి హంతకులతో చంపించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. ఆ తర్వాత జరిగిన ఎన్నో పరిణామాలతో కలత చెందిన మారుతీరావు ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్లు భర్తలు లేకుండా అయిపోయారు. ఒక అభాగ్యురాలు అందరి ముందు దోషిగా అయ్యింది. దీని అంతటికి కారణం మారుతీరావు చేసిన రెండు తప్పు.

మారుతీరావు చేసిన మొదటి తప్పు తన కూతురు భర్తను చంపడం. తన భర్తను హత్య చేయించడంతో, చిన్నతనం నుంచి తనెంతో అపూరంగా పెంచుకున్న కూతురే, తండ్రిపై తీవ్ర ద్వేషం పెంచుకుంది. అందుకే మారుతీరావు చనిపోయిన కూడా నాన్న చనిపోయాడు అని అనడం లేదు. దీనిని బట్టి చుస్తే అమృత మారుతీరావు మీద ఎంత కోపంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కగానొక్క కూతురి మీద అమితమైన ప్రేమ పెంచుకోవడం తప్పు కాదు. కానీ ఆమె తన అభీష్టానికి వ్యతిరేకంగా కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో అల్లుడిని హత్య చేయించడం, అందులోనే ఆమె గర్భిణి అని తెలిసి కూడా ఈ దారుణానికి ఒడిగట్టడం మారుతీరావు చేసిన పెద్ద తప్పు. ప్రణయ్ హత్య కేసులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని కూతురికి ఆయన రాయబారం పంపారట. కానీ తను ప్రేమించి పెళ్లాడిన వ్యక్తిని హత్య చేయించడంతో తండ్రిపై తీవ్ర ద్వేషం పెంచుకున్న ఆమె, అందుకు నిరాకరించింది. తండ్రి వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మారుతీ రావు మరోసారి అరెస్టయ్యాడు.

ఒకప్పుడు తండ్రిపై అంతులేని ప్రేమాభిమానాలు చూపిన కూతురే ఆయన్ను ఏవగించుకునే పరిస్థితిని కల్పించింది మారుతీరావే. ప్రణయ్ హత్యకు ముందు ఆయన వేసుకున్న అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. సంపాదించిన కోట్లు ఆయన్ను కాపాడలేకపోయాయి. జైలు నుంచి బయటకు వచ్చిన మారుతీరావు తనలో తానే కృంగిపోయాడు. అటు కూతురి విషయంలో తప్పు చేశాననే భావన, ఇటు సమాజంలో తలెత్తుకోలేకపోవడం మారుతీ రావు పశ్చాత్తాపానికి లోనై ఉంటాడు. ఇదే ఆయన ఆత్మహత్యకు ప్రధాన కారణమై ఉండొచ్చు. ఈ ఎపిసోడ్‌లో తప్పంతా మారుతీ రావుదే అనలేం. అలాగనీ అమృతను తప్పుబట్టలేం. ప్రణయ్‌ హత్య తర్వాత, పెళ్లయిన కొత్తలో అమృత, ప్రణయ్ దంపతులు దిగిన ఫొటోలు, వీడియోలు బయటకొచ్చాయి. ఈ వీడియోలు, ఫొటోలు మారుతీ రావు కుటుంబానికి ముందే చేరి ఉండొచ్చు. తను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురి పక్కన తనకు ఇష్టం లేని మరో వ్యక్తిని చూసి మారుతీ రావు తట్టుకోలేకపోయాడు. కూతురి మీద ప్రేమ కంటే అల్లుడి మీద ద్వేషం పెరిగిపోవడం, పరువు ప్రతిష్టలకు ప్రాధాన్యం ఇవ్వడంతో అతడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దాని ఫలితమే ప్రణయ్ హత్య. ఇప్పుడు కూడా మారుతీ రావు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు తన కూతురి భర్తను హత్య చేయించడం ఎంత తప్పో, ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం కూడా అంతే తప్పు.

ఒక తప్పు చేస్తే, దాని పర్యావసానంగా మరో తప్పు చేయాల్సి వస్తుందని చెప్పడానికి మారుతీ రావు ఘటనే ఉదాహరణ. మన దేశంలో ఎన్నో ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. ఎందరో కూతుళ్లు తమ తండ్రుల అభీష్టాలకు వ్యతిరేకంగా పెళ్లాడుతున్నారు. ముందు కులమతాలనే పట్టింపులకు పోయి, తన కూతురు ఇక నుంచి తన కూతురు కాదనుకునే తండ్రులున్నారు. కానీ కొంత కాలం గడిచిన తర్వాత తమకు తాము సర్ది చెప్పుకొని కలిసిపోయిన వాళ్లెందరో ఉన్నారు. కానీ పరువు ప్రతిష్టలకు ప్రాధాన్యం ఇచ్చి మారుతీరావు తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆయన భార్య, కూతురిపై తీవ్ర ప్రభావం పడింది. ఇద్దరు మహిళలు తమ భర్తలను కోల్పోయారు. అమృతకు తన కొడుకైనా ఉన్నాడు. కానీ మారుతీ రావు భార్య మాత్రం భర్తను కోల్పోయింది. కూతురితో మాటల్లేవు. తండ్రి ఎలాగూ పోయాడు కాబట్టి భవిష్యత్తులో ఆమె తల్లికైనా దగ్గరవుతుందా? లేదంటే తన భర్తను తనకు దూరం చేసిన కుటుంబాన్ని శాశ్వతంగా దూరం పెడుతుందా అనేది ఆమె చేతుల్లోనే ఉంది. మీ అమ్మ దగ్గరకెళ్లు అన్న మారుతీరావు ఆఖరి కోరికను ఆమె నెరవేరుస్తుందో లేదో చూడాలి.

Image result for maruthirao

మారుతీరావులాగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎంతటి తీవ్ర పర్యావసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుందనేది సమాజానికి ఓ గుణపాఠం. పరువు ప్రతిష్టలు, చుట్టాలు, స్నేహితుల ముందు తలెత్తుకోలేకపోవడం.. వీటన్నింటికి ప్రాధాన్యం ఇస్తే, మనం కూడా మారుతీరావులా మిగిలిపోవాల్సి వస్తుంది. పిల్లలు కూడా తాము ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం పెద్దలను ఒప్పించడానికి చివరి వరకూ ప్రయత్నించాలి. ఇక తప్పదు, వారు అంగీకరించే పరిస్థితి లేదని భావిస్తే తమ ఇష్టం మేరకు నిర్ణయం తీసుకోవచ్చు. అప్పటికే తాము చేసిన పనితో తమ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తాము చేయబోయే పనులు వారిని మరింత ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి.

Content above bottom navigation