మా అమ్మ, తమ్ముడంటే చచ్చేంత ఇష్టం.. అందుకే చంపేశా.. బెంగళూరు టెక్కీ మాటలకు పోలీసులు షాక్

నవమాసాలు కని పెంచి తల్లిని దారుణంగా చంపేసి పరారైన యువతిని కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు. ప్రేమకు అడ్డు చెప్పిందన్న కారణంతోనే ఆమె కన్నతల్లిని హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తల్లిని చంపిన తర్వాత ప్రియుడితో పాటు పారిపోయిన ఆమె అండమాన్ దీవుల్లో తిరుగుతూ పోలీసులకు పట్టుబడింది.

బెంగళూరుకు చెందిన నిర్మల అనే మహిళకు కూతురు అమృత, కొడుకు ఉన్నారు. బీటెక్ చదివిన అమృత జల్సాల బాట పట్టి అబ్బాయిలతో తిరుగుతుండేది. కూతురు దారి తప్పుతోందని భావించిన నిర్మల.. బుద్ధిగా ఉండాలంటూ అనేకసార్లు హెచ్చరించింది. ఈ క్రమంలోనే అమృత ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్లు తెలుసుకుని చీవాట్లు పెట్టింది. ప్రేమకు స్వస్తి చెప్పి తాను చూపించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో తన ప్రేమకు అడ్డు పడుతున్న తల్లిని చంపేయాలని అమృత ప్లాన్ వేసింది.

ఇదే విషయంపై తల్లీకూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపటి తర్వాత నిర్మల తన గదిలోకి వెళ్లి నిద్రపోయింది. అర్ధరాత్రి వేళ తల్లి గదిలోకి వెళ్లిన అమృత కత్తితో ఆమెను పొడిచి చంపేసింది. మరో గదిలో ఉన్న తమ్ముడిపైనా హత్యాయత్నం చేసింది. గాయాలతో ఆ యువకుడు బయటకు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. కన్నతల్లిని చంపేశానన్న పశ్చాత్తాపం కూడా లేకుండా అమృత ప్రియుడితో కలిసి అండమాన్ దీవులకు విహారానికి వెళ్లింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమృత సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేయగా అండమాన్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో కేఆర్ పురం పోలీసులు బుధవారం అక్కడికి వెళ్లి అమృతతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తీసుకొచ్చారు.

బెంగళూరు మహిళా టెక్కీ అమృత వ‌య‌సు 33 ఏళ్లు.. పోర్ట్‌బ్లెయిర్ నుంచి ఆమెను బెంగళూరు తీసుకొచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే విచారణలో టెక్కీ అమృత మాటలకు పోలీసులు షాక్‌కు గురయ్యారు.
తల్లిని చంపానన్న బాధ ఏమాత్రం లేని నిందితురాలు.. బాధల నుంచి విముక్తి కల్పించేందుకే హత్య చేసినట్లు చెప్పడంతో విస్తుపోయారు. అమ్మ.. తమ్ముడు అంటే తనకు చాలా ఇష్టమని.. అందుకే వారిని చంపేయాలనుకున్నట్లు అమృత చెప్పినట్లు తెలుస్తోంది. బ్యాంకుల నుంచి భారీగా లోన్లు తీసుకున్నామని.. ఆ అప్పుల భాధ నుంచి అమ్మను తప్పించేందుకు హత్య చేసినట్లు చెప్పింద‌ట‌.

తల్లిని దారుణంగా చంపేసి.. తమ్ముడిని పొడిచేసిన అమృత.. తాను కూడా చనిపోయేందుకు నిద్రమాత్రలు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో ఆమె ద‌గ్గ‌ర నుంచి నిద్రమాత్రలు స్వాధీనం చేసుకున్నారు.
అయితే పోలీస్ స్టేషన్‌లో ఆమె వింతగా ప్రవర్తించింది. పోలీస్ స్టేషన్ గోడలకి తల బాదుకున్న అమృత.. ఆమెను బాధల నుంచి తప్పించేందుకే చంపేశానని గ‌ట్టిగా అరిచింది.అమృత ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను సైకాలజిస్టులకు చూపించారు. డిప్రెషన్ కారణంగానే ఆమె అలా ప్రవర్తించిందని.. ఆమె ఇన్‌సోమ్నియా అనే డిజార్డర్‌తో బాధపడుతోందని సైకాలజిస్టులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.

    డిప్రెషన్, కుటుంబ సమస్యలతోనే టెక్కీ అమృత.. తల్లిని హత్య చేసిందని ఓ పోలీస్ అధికారి అభిప్రాయపడ్డారు. హత్య చేసేందుకు వేరే ఉద్దేశాలేవీ కనిపించడం లేదని ఆయన అన్నారు. హత్య కేసులో అమృత, అతని బాయ్‌ఫ్రెండ్‌ శ్రీధర్ రావును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో  శ్రీధర్‌కి  ఎలాంటి సంబంధం లేదని  వారి తరఫు లాయర్ వాదించారు. అయితే నిందితురాలు అమృత తరఫున ఎవరూ కోర్టుకు హాజరుకాలేదు. ఇటీవ‌లే ఇలా త‌ల్లిని పొట్ట‌న పెట్టుకున్న ఘ‌ట‌న తెలంగాణ‌లో చూశాం.. ఇప్పుడు బెంగ‌ళూరులో ఇలాంటి ఘ‌ట‌న చోటుచేసుకుంది. 

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation