మిర్యాలగూడ మారుతీరావు రియల్ స్టోరీ..

79

తిరునగరి మారుతీరావు… ఇప్పుడు రెండు తెలుగు రాష్టాల్లో అందరి నోట్లో నానుతున్న పేరు. సంవత్సనర కిందట తన కూతురు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ ని అత్యంత పాశవికంగా హత్య చేయించిన వ్యక్తి. ఆ ఘటన తర్వాత కూతురు కోసం పరితపించిన వ్యక్తి. ఏ కూతురి కోసం అయితే తానూ ఇంతలా చేశాడో, ఆ కూతురే తనను అసహ్యించుకోవడం మారుతీరావు తట్టుకోలేకపోయాడు. కూతురి కోసం కోట్లు కూడబెట్టాడు. కానీ ఆ డబ్బు తన కూతురిని తన దగ్గరకు తీసుకురాలేదు. ఒకవైపు కూతురు రావడం లేదనే బాధ, మరోపక్క వెంటాడుతున్న కేసులు.. ఇలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్న మారుతీరావు చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దాంతో ఆయన ఇష్యు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే అసలు ఎవరు ఈ మారుతీరావు. ఈయన కేసు ఎందుకింతలా హాట్ టాపిక్ అయ్యింది.. వందల కోట్లకు ఎలా పరుగెత్తాడు..అసలేం జరిగింది.. ఆ విషయాలన్నిటి గురించి ఇప్పుడు చూద్దాం..

మిర్యాలగూడ పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా బిల్డర్ గా పేరున్న మారుతీరావు జీవితమంతా అక్రమాలమయమే. ఓ సాధారణ కిరోసిన్ డీలర్ గా 30 ఏళ్ల కింద కోదాడ ప్రాంతం నుంచి మిర్యాలగూడకు వలస వచ్చారు. పట్టణ రాజకీయాలను, అధికార యంత్రాగాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. పూట గడవడమే కష్టంగా జీవితాన్ని ప్రారంభించాడు. 100 కోట్లకు పైగా ఆస్తులను పోగేశాడు. మారుతీరావు బంధువు కాంగ్రెస్ పార్టీలో లీడర్ గా ఉండటంతో తొలినాళ్లలో పెళ్లాం మొగుళ్ళ పంచాయతీలు చెప్పేవాడు. ఆ తరువాత పైరవీలు, దందాలను రెట్టింపు చేశాడు. గతంలో తహసీల్దార్ గా పని చేసిన ఓ వ్యక్తికి సన్నిహితుడయ్యాడు. ఆయన బలహీనతను ఆసరాగా చేసుకొని మహిళలను ఎరగా వేసి చివరకు ఆయన కుటుంబాన్ని వంచించాడు. ఆ ఎమ్మార్వో తాను చెప్తే వినేటట్టు చేసుకొని ప్రభుత్వ భూములను దళితుల మీదకు మార్చేవాడు. ఆ తరువాత వాటికి చట్టబద్దత వచ్చేలా చేసి వాటిని మరొకరికి అమ్మి డబ్బులు తీసుకునేవాడు. మధ్యలో ఉన్న దళితులకు పావులో పరకో ఇచ్చేవాడు. ఎక్కడ వివాదాస్పద భూములున్నా అధికారుల అండదండతో వాటిని పరిష్కరించి భారీగా పైసలు తీసుకునేవాడు.

ఆర్డీవో, డీఎస్పీ, సీఐ , ఎమ్మార్వో, అధికారులకు చేరువై వారి బలహీనతలను తీరుస్తూ వందలాది మంది మహిళలతో మారుతీరావు ఆటలాడుకున్నాడనే ఆరోపణలున్నాయి. ఆ తరువాత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సంబంధాలు ఏర్పరుచుకొని చక్రం తిప్పేవాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలతో పనులు చేయించుకునే సత్తా మారుతీరావుకు ఉందని పలువురు చెబుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఓ సీనియర్ మంత్రితో మారుతీరావు సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నాడని, మంత్రి వియ్యంకుడితో కలిసి మిర్యాలగూడలో బిల్డర్ అవతారమెత్తాడని తెలుస్తోంది. 2000 సంవత్సరానికి ముందు వివిద రూపాల్లో సంపాదించిన మారుతీరావు శరణ్య గ్రీన్ హోమ్ పేరుతో పూర్తిగా నిర్మాణ రంగంలోకి వచ్చాడు. ఐదేళ్ల కింద నయీం గ్యాంగ్ మిర్యాలగూడలో 5 ఫ్లాట్లను కబ్జా చేసింది. అందులో మారుతీరావు ప్లాట్ కూడా ఉంది. మారుతీరావు నయీం మనుషులను బెదిరించడంతో వారు కిడ్నాప్ చేశారు. పట్టణంలో విలువైన స్థలాన్ని వారికి వదిలేసి వారితో మారుతీరావు సత్సంబంధాలు కొనసాగించాడు. ఎవరైనా వినకపోతే నయీం గ్యాంగ్ తో బెదిరించి ఫోన్ చేయించేవాడు. మారుతీరావు జీవితమంతా నేరాలమయమే అని పలువురు తెలిపారు.

అయితే ఇవేమి అప్పట్లో వెలుగులోకి రాలేదు. కానీ తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని, అల్లుడిని సుపారీ ఇచ్చి చంపించినా తర్వాత అయన అక్రమ క్రీడలు వెలుగులోకి వచ్చాయి. కూతురు అమృత వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది. దానిని తట్టుకోలేని మారుతీరావు బీహార్ గ్యాంగ్ కు కోటి రూపాయల సుపారీ ఇచ్చి చంపించాడు. ఆ కేసులో జైలుకు వెళ్లి 7 నెలల జైలు శిక్ష అనుభవించాడు. 7 నెలల తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి, కూతురి కోసం పరితపించాడు. మధ్యవర్తలతో కూతురికి రాయబారాలు పంపాడు. తానా వద్దకు వస్తే ఆస్థి మొత్తం నీ పేరు మీద రాస్తా అని కూతురిని ఆశ చూపాడు. కానీ వీటన్నిటికీ కూతురు అమృత తలొగ్గలేదు. దాంతో మారుతీరావు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇంకొన్ని రోజుల్లో కేసును కోర్ట్ పరిశీలించి తనకు శిక్ష వేస్తుందని భయపడ్డాడు. ఒక పక్కన కేసులు, మరొక పక్కన కూతురు తన వద్దకు రావడం లేదనే బాధ.. ఇలా ఎన్నో ఆలోచనలతో మారుతీరావు సతమతమయ్యాడు. ఇక తనకు చావే శరణ్యం అనుకున్నాడేమో, ఎవరికీ చెప్పకుండా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మార్చి 7, 2020 న పని మీద హైదరాబాద్ వెళ్తున్న అని చెప్పి, ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ కు వెళ్లి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా మారుతీరావు జీవితం ముగిసింది. కూతురి మీద ఉన్న పిచ్చి ప్రేమ ఒకరిని చంపేలా చేసింది, తానూ చనిపోయేలా చేసింది.

Content above bottom navigation