విరిగినా అతుక్కునే శివలింగం.. పిడుగుల పరమేశ్వరుడి ఆలయంలో అద్భుతాలు ఎన్నో

146

మీరు ఇప్పటివరకు ఎన్నో ఆలయాల గురించి, వాటి విశిష్ఠతల గురించి విని ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయం గురించి విని ఉండరు. ఆ ఆలయంపై ఏడాదిలో ఒక్కసారైనా పిడుగు పడుతుంది. ఆ పిడుగు నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగంపైనే పడుతుంది. పిడుగు వల్ల శివలింగం విరిగిపోతుంది. కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ శివలింగం మళ్లీ అతుక్కుని ఉంటుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఎత్తైన హిమాలయ పర్వతాలలో, ప్రకృతి అందాల మధ్య కొలువైన ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక్కసారి అడుగుపెడితే చాలు మనసు ఎంతో తేలిగ్గా ఉంటుంది. మరి అంతటి విశిష్ఠత గల ఆలయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

హిమాచల్ ప్రదేశ్‌ లో ‘బిజిలీ మహాదేవ్’ అనే ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని దర్శిస్తే తప్పకుండా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు. ఈ ఆలయంలో ఏడాదికి ఒకసారైన పిడుగు పడుతుంది. ఆ పిడుగు నేరుగా శివలింగం పైనే పడుతుంది. దాంతో శివలింగం ముక్కలవుతుంది. దీంతో ఆలయ పూజారులు ఆ ముక్కలను ఒకచోటకు చేర్చి, తృణధాన్యాలు, పిండి, వెన్నతో లింగంగా మార్చుతున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆ శివలింగం మళ్లీ పూర్వ రూపంలోకి మారిపోతుంది. పగుళ్లు కూడా కనిపించకుండా పూర్తిస్థాయి శివలింగంలా దర్శనమిస్తుంది. ఈ శివలింగం నిత్యం పిడుగుపాటుకు గురికావడం వల్ల ఈ ఆలయానికి ‘బిజిలీ మహాదేవ్’ అని పేరు వచ్చింది. ఈ ఆలయం పరిసరాల్లో జీవించే ప్రజలను, జంతువులను రక్షించేందుకే ఆ పరమశివుడు ఆ పిడుగుపాటుకు గురవుతాడని స్థానికుల నమ్మకం. అయితే ఈ ఆలయం ఏర్పడిన ప్రాంతం గురించి పురాణాల్లో ఓ ఆసక్తికరమైన కథ ఉంది.

కులు ప్రాంతంలో కులాంతా అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు ఓ విషపూరితమైన పాముగా లాహౌల్ – స్పితీలోని మాథాన్ గ్రామానికి చేరుకుంటాడు. అప్పుడు అతడు బియాస్ నదికి గండిపెట్టి ఆ గ్రామాన్ని వరదతో ముంచి నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు. బియాస్ నదిలో ఈదుతూ, ఆ ప్రవాహాన్ని ఆ గ్రామం వైపు మళ్లించేందుకు కుట్ర పన్నుతాడు. ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు పాము రూపంలో ఉన్న కులంతాను అంతం చేస్తాడు. మరణం తర్వాత కులంత శరీరం పెద్ద పర్వతంగా రూపాంతరం చెందిందని, అందుకే ఆ ప్రాంతానికి కుల్లు అని పేరు వచ్చిందని చెబుతారు. ఇక విరిగిన శివలింగం మళ్లీ పూర్వ స్థితికి మారడానికి గల కారణం తెలుసుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం దక్కలేదు. సాధారణంగా పిడుగు పడితే రాయి చెల్లా చెదురవుతుంది. జిగురుతో అతికించినా అది పూర్తిస్థాయిలో అంటుకోదు. అలాంటిది పూజర్లు పిండి, తృణధాన్యాలతో అతికిస్తే ఆ శివలింగం ఎలా అతుక్కుంటుందనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే ఉండిపోయింది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే దేవదారు వృక్షాల మధ్య సుమారు 1000 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. శివరాత్రి రోజున ఈ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోతుంది. డిసెంబరు, జనవరి నెలల్లో మాత్రం ఈ ప్రాంతం మంచుతో కప్పి ఉంటుంది. దాంతో ఆలయం కూడా మూసి ఉంటుంది.

Content above bottom navigation