కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసింధే. ఈ లాక్ డౌన్ వలన యావత్తు ప్రపంచం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. కరోనా వ్యాధి గ్రస్తులకు సేవలందిచేందుకు ప్రయివేటు ఆస్పత్రులను కూడా ప్రభుత్వాలు ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. మరో వైపు రోగులు, గర్భిణిలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కొన్ని చోట్ల నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడుతోంది. లాక్ డౌన్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని పరిస్ధితి నెలకొంది. ఈ పరిస్ధితుల్లో ఓ గర్భిణీ, ఆమె భర్త కలిసి 52 గంటల పాటు 3 వేల కిలోమీటర్లు, అంబులెన్స్ లో ప్రయాణించి సొంతూరుకు క్షేమంగా చేరుకున్నారు. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…

కేరళ అలప్పుజా జిల్లాలోని పల్లనాకు చెందిన విష్ణు, విరింద దంపతులు ఢిల్లీలోని ఓ కాల్ సెంటర్లో పని చేస్తున్నారు. విరింద ప్రస్తుతం నెల రోజుల గర్భిణి. మార్చి 24 నుంచి లాక్డౌన్ అమలులోకి రావటంతో…. విరిందకు ఆహారం, మెడిసిన్స్ తీసుకు రావడం ఇబ్బంది అయింది. విష్ణు బయటకు వెళ్లిన ప్రతీసారి పోలీసులు అడ్డుకోవడం జరుగుతోంది. సరైన ఆహారం, మెడిసిన్స్ లేకపోవడంతో గర్భిణి ఆరోగ్యం క్షీణిస్తోంది. దీంతో ఆమెకు పూర్తిగా బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్లు సూచించారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఢిల్లీలో ఉండటం కన్నాసొంతూరులో ఉండటం మంచిదని నిర్ణయించుకుని విష్ణు ఆమెను తీసుకుని అంబులెన్స్ లో సొంతూరుకు వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం 1లక్ష 20 వేల రూపాయలవుతుందని ఆస్పత్రి యాజమాన్యం చెప్పింది. అంబులెన్స్ తో పాటు మందులు, మెడికల్ సిబ్బందిని ఆస్పత్రి ఏర్పాటు చేసింది. దీంతో విష్ణు తన తల్లి తండ్రులకు ఫోన్ చేసి ఖర్చు విషయం చెప్పాడు.
అతని తండ్రి జాలరి, తల్లి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలి గా పని చేస్తోంది. వారి వద్దఅంత డడబ్బులేదు. వెంటనే వారికి తెలిసిన వారివద్ద కొంత డబ్బు తీసుకుని విష్ణుకు పంపించారు. ఈ క్రమంలో స్ధానిక నాయకులు కూడా కొంత సాయం అందించారు. ఆడబ్బు ఆస్పత్రిలో కట్టి భార్య విరిందను తీసుకుని విష్ణు సొంతూరుకు బయలు దేరాడు. ఢిల్లీ నుంచి బయలు దేరిన వారు తమిళనాడు వరకు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాగలిగినా…. కేరళ సరిహద్దుల్లోని వలయార్ చెక్ పోస్టు వద్ద పోలీసులు అంబులెన్స్ ను ఆపి ముందుకు వెళ్లనివ్వలేదు. వెనక్కి వెళ్లిపోమ్మని హెచ్చరించారు. వెంటనే విష్ణు అక్కడి స్ధానిక నాయకులను సంప్రదించి వారి సహాయంతో చెక్ పోస్టు దాటి గర్భిణి అయిన భార్యతో క్షేమంగా సొంతూరుకు చేరుకున్నాడు.