సముద్రంలోనూ కరోనా.. ఓడలో బంధీలుగా 3,500 మంది ప్రయాణికులు

చైనా నగరాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. అక్కడి ప్రజలు క్షణక్షణం భయంతో బతుకుతున్నారు. ఇప్పటికే ఈ మహమ్మారీ బారిన పడి 425 మంది మృతి చెందారు. కరోనా వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయిన వారి సంఖ్య 20438కి చేరుకుంది. మరోవైపు ఇతర దేశాల్లో 151 కేసులు నమోదైనట్లు సమాచారం. అంతకుముందు రోజు కంటే సోమవారం నాటికి 65 మంది మృతి చెందినట్లు చైనా ప్రభుత్వం పేర్కొంది. మరణించిన వారంతా సెంట్రల్ హూబే ప్రావిన్స్‌కు చెందిన వారు కావడం విశేషం. ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఈ కరోనా వైరస్, సముద్రంలో ప్రయాణిస్తున్న వారినీ వదలట్లేదు. తాజాగా జపాన్‌కు చెందిన డైమండ్ ప్రిన్సెస్ అనే క్రూయిజ్ ప్రయాణికుల ఓడలోని వ్యక్తికి వైరస్ సంక్రమించింది. ఇదే సమయంలో ఓడలో 3,500 మందికి పైగా ప్రయాణికులు ఉండడం గమనార్హం. వీరిలో వెయ్యి మంది ఓడ సిబ్బందే ఉన్నారు. ఓడలోని వ్యక్తి హాంకాంగ్‌ లో దిగిపోగా, ఆ 80 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ సంక్రమించినట్లు నిర్దారణ అయింది. దీంతో షిప్‌లోని వారికీ వైరస్ వ్యాపించిందేమోననే అనుమానాలు తలెత్తాయి. సోమవారం డైమండ్ ప్రిన్సెస్ ఓడ యోకోహమా పోర్టులో ఆగి ఉన్నప్పుడు వైద్య నిపుణులు పరీక్షల కోసం అందులోకి ప్రవేశించారు. దీన్ని అక్కడే ఉన్న కొందరు స్థానిక జర్నలిస్టులు చిత్రీకరించారు.

Image result for coronavirus"

ఓడ 24 గంటలుగా ఆ తీరంలోనే ఉండిపోగా, అందులో నుంచి ప్రయాణికులను బయటకు అనుమతించడం లేదని బ్యాంకాక్ పోస్ట్ వార్తా సంస్థ వెల్లడించింది. దీనిపై జపాన్ ప్రభుత్వ ముఖ్య అధికార ప్రతినిధి దీనిపై స్పందిస్తూ.. ఆ షిప్‌లో కరోనా వైరస్ పరీక్షలు జరుగుతున్నట్లు ధ్రువీకరించారు. ప్రయాణికులంతా వైద్య పరీక్షల కోసం తమ గదుల్లోనే ఉండాలని, వైద్య నిపుణులు అక్కడికే వచ్చి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తారని షిప్‌ లోని ఓ యువతి స్థానిక వార్తా సంస్థకు ఫోన్‌లో వెల్లడించింది. అయితే, కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా జపాన్ పటిష్ఠ చర్యలు చేపట్టింది. చైనాతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధించింది. వుహాన్ లో ఉన్న తమ దేశీయులు దాదాపు 500 మందిని తీసుకెళ్లింది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక కరోనా వైరస్‌ను ఎదుర్కొని దేశం నుంచి పారద్రోలేందుకు చైనా ప్రభుత్వం అన్ని రకాల మార్గాలను వెతుకుతోంది. ఇందులో భాగంగా మొన్నటి వరకు అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య యుద్ధం చేసిన చైనా, ఈ కష్ట సమయంలో ఆదేశ సహకారాన్ని కోరింది. కరోనావైరస్ పోరుకు తమ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించడంతో అగ్రరాజ్యం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చైనా కోరింది. ఇప్పటికే కరోనా వైరస్‌ ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇదిలా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా జరుగుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ పై అమెరికా చేసిన ఆందోళనకరమైన ప్రకటన వల్లే చైనా స్టాక్ మార్కెట్లు 8శాతం మేరా పతనమయ్యాయని చైనా ఆరోపణలు చేసింది. గత రెండువారాలుగా చైనాకు వెళ్లిన వారిని తమదేశంలోకి రాకుండా నియంత్రిస్తున్నామన్న అమెరికా ప్రకటనను చైనా తప్పుపట్టింది. ఇలాంటి కష్ట సమయంలో అమెరికా కక్షపూరితంగా కాకుండా మంచిగా ప్రవర్తించాలని లేనిపోని ఆందోళనలు సృష్టించడం మంచిది కాదన్నారు చైనా విదేశాంగశాఖ మంత్రి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation