ఆరు కేసులు మాత్రమే నిన్నటి వరకూ ఉంటే ఒకేసారి తెలంగాణలో 13 కేసులు పెరిగాయి
దీంతో ఉలిక్కిపడింది తెలంగాణ.. ఏపీలో రెండో పాజిటివ్ కేసు కూడా నమోదు అయింది.
ఏకంగా ఇండోనేషియా నుంచి వచ్చిన బృందంలో ఏడుగురికి కరోనా సోకింది
స్కాట్లాండ్ నుంచి వచ్చిన మరో యువకుడికి కూడా కొవిడ్-19 వచ్చింది.
ఇండోనేషియా బృందం తిరిగిన కరీంనగర్లో అప్రమత్తం అయ్యారు
కలెక్టరేట్‌కు 3 కిలోమీటర్ల పరిధిలో అందరికీ పరీక్షలు చేస్తున్నారు
అసలు ఈ వైరస్ వ్యాప్తితో తెలంగాణలో ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ రాష్ట్రం ఉలిక్కి పడింది. బుధవారం ఒక్క రోజే ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండోనేషియానుంచి వచ్చిన ఓ బృందంలోని ఏడుగురితోపాటు స్కాట్లాండ్ నుంచి వచ్చిన 21 సంవత్సరాల యువకుడికి కూడా కరోనా ఉందని తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 13కి చేరింది. ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇండోనేషియా నుంచి 10మంది సభ్యులతో కూడిన ఓ బృందం ఇటీవల కరీంనగర్‌కు వచ్చింది. మార్చి 14న ఢిల్లీ నుంచి ఏపీ సంపర్క క్రాంతి రైలులో రామగుండం చేరుకుంది. ఈ బృందంలోని 58 సంవత్సరాల వ్యక్తికి కరోనా ఉన్నట్లు మంగళవారం బయటపడింది. దీంతో ఆ బృందంలోని మిగిలినవారి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు.
ఇప్పుడు దీంట్లో ఏడుగురికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో కరీంనగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, మంత్రి గంగుల కమలాకర్ రంగంలోకి దిగారు. ఆ బృందం ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరెవర్ని కలిసింది అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఆ బృందం బస చేసిన మసీదును పూర్తి స్థాయిలో శుభ్రం చేయించారు. ఆ వీధి మొత్తాన్ని దిగ్బంధం చేసి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న బజార్‌ను పూర్తిగా మూసివేశారు. దుకాణాలు, హోటళ్లు, మూసివేయించి అటువైపు ఎవరిని అనుమతించడం లేదు.
ఇండోనేషియా బృందం కలెక్టరేట్ ప్రాంతంలో 48 గంటలు సంచరించడంతో కలెక్టరేట్‌కు మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు చేస్తామని కలెక్టర్ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. దీనికోసం 100 వైద్య బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్లో నిత్యావసర దుకాణాలు మినహా మిగిలిన షాపులు, వ్యాపార సంస్థలు మూసివేస్తేనే మంచిదని కలెక్టరు, మంత్రి గంగుల సూచించారు.

ఇంటి దగ్గర ఉండడం సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. కరీంనగర్ పట్టణంలో తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఎవరూ ఇళ్లనుంచి బయటకు రావొద్దని సూచించారు. ఇండోనేసియా బృందంప్రయాణించిన రైలు బోగీలో ఉన్న ప్రయాణికుల వివరాలను సేకరించే పనిలో అధికారులు పడ్డారు. మరోవైపు.. స్కాట్లాండ్ నుంచి వచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఇండోనేషియా నుంచి వచ్చిన ఐదో కేసు తాజాగా నమోదైన స్కాట్లాండ్ నుంచి వచ్చిన యువకుడి కాంటాక్టులను కూడా పరీక్షించాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి..రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతుండటంతో ఐసోలేషన్ బెడ్ల సంఖ్యను కూడా వైద్య ఆరోగ్యశాఖ పెంచింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసరంగా 335 ఐసోలేషన్ పడకలను సిద్ధం చేసింది. ప్రస్తుతం కరోనా రాష్ట్రంలో రెండో దిశలోకి అడుగుపెట్టే అవకాశం ఉందన్న ఆందోళనలో సర్కారు ఉంది. అందుకే అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది.
గాంధీ- 40,ఉస్మానియా- 10, ఫీవర్ ఆస్పత్రి 40, ఛాతీ ఆస్పత్రి- 20, వరంగల్ ఎంజీఎం-25,ఖమ్మం జిల్లా ఆస్పత్రి-25,కరీంనగర్ జిల్లా ఆస్పత్రి -25, జీజీహెచ్, నిజామాబాద్-25, జీజీహెచ్, మహబూబ్‌నగర్-25, జీజీహెచ్, నల్గొండ- 25,జీజీహెచ్, సిద్దిపేట- 25, జీజీహెచ్ సూర్యాపేట- 25. రిమ్స్, ఆదిలాబాద్- 25. బెడ్స్ రెడీ చేశారు.