నిర్భయ దోషుల చావు గడియ దగ్గరపడింది. వారి ఉరికి రోజులు దగ్గరపడ్డాయి. మార్చి 20న నలుగురు నిర్భయ దోషులను ఉరితీయడానికి కోర్టు నిర్ణయించింది. దీంతో చావు కళ వారిలో భయాందోళనకు కారణమవుతోందట. నిర్భయ నలుగురు నిందితులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నలుగురు నిర్భయ దోషుల్లో ముకేశ్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మ ఇప్పటికే న్యాయపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకున్నారు. నిందితుల వరుస పిటీషన్లతో నిర్భయ దోషులకు ఇప్పటికే మూడుసార్లు శిక్ష వాయిదాపడింది.
మొదట జనవరి 22 న ఉరి తీయవలసి ఉండగా, ఆ తరువాత ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. ఆ తర్వాత మార్చి 3 న ఉరి తీయాలనుకున్నా, అది కూడా వాయిదా పడింది. తాజా ఆదేశాల ప్రకారం మార్చి 20 న ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులనూ ఉరి తీయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో కొత్త పిటీషన్లు క్షమాభిక్ష అభ్యర్థనలు చేసుకుంటూ ఆపే ప్రయత్నాలకు మళ్లీ తెరలేపారు.
ఈ నేపథ్యంలోనే నిర్భయ నిందితుల్లో ఒకరైన వినయ్ శర్మ తాజాగా తనకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు అభ్యర్థన పెట్టుకున్నాడు. తనలో మార్పు వచ్చిందని, తన కుటుంబ సామాజిక ఆర్థిక స్థితి ప్రకారం శిక్ష తగ్గించాలని విన్నవించాడు. న్యాయమూర్తులు ఎన్వీ రమణ, అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారిమన్. ఆర్ బానుమతి, అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. నిర్భయ ఉదంతం జరిగేనాటికి తాను మైనర్ని అనీ, దీన్ని పరిగణనలోకి తీసుకుని తనకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరుతూ పవన్ గుప్తా తన పిటిషన్లో పేర్కొన్నాడు.

పవన్ గుప్తా తాజా క్యురేటివ్ పిటిషన్ తిరస్కరణ గురైన తర్వాత కూడా అతను రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణకు గురైనా కూడా, దాన్ని సవాల్ చేస్తూ మళ్లీ సుప్రీంను ఆశ్రయించవచ్చు. దీంతో పాటు దోషులను విడిగా ఉరితీయాలని ఆదేశించాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మార్చి 15 న విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల ఉరితీత మరోసారి వాయిదా పడవచ్చునన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దోషులకు ఉరిశిక్ష అమలు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిర్భయ తల్లి, తన కుమార్తెకు న్యాయం జరగడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎలాగైనా సరే మార్చి 20న ఉరిపడుతుందనుకుంటే మరోసారి నిందితుడు గవర్నర్ కు అర్జీ పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నిర్భయ దోషులకు చాలాసార్లు ఉరి ఆగిపోయింది. ఏడేళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. తాజాగా అన్ని అవకాశాలు ముగియడంతో నలుగురిని మార్చి 20న ఉరితీయడం ఖాయమా? లేదా అనేది తేలనుంది.