breakingnews : అమీర్‌పేట్ , SR నగర్ లో హాస్టళ్లు, కోచింగ్‌ సెంటర్ల మూసివేత

64

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు భారత్ దేశాన్ని గడగడలాడిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే తెలంగాణాలో 6 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోనే ఈ కేసులన్నీ నమోదవ్వడం ఆందోళనగా మారింది. దాంతో హైదరాబాద్ లో ఆర్థిక వ్యవస్థ పూర్తీగా దెబ్బతింటుంది. అది సరిపోనట్టు ఇప్పుడు విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్స్ కు కూడా ఇబ్బంది కలిగిస్తుంది. దాంతో హైదరాబాద్ లోని అమీర్ పెట్, SR నగర్ ఏరియాలను విద్యార్థులు ఖాళీ చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌, మైత్రీవనంపై కరోనావైరస్ పంజా విసిరింది. కరోనా వ్యాప్తిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమీర్‌పేట్‌లో ఉన్న దాదాపు 850 హాస్టళ్లు, ఐటీ కోచింగ్‌ సెంటర్లను ఈ నెల 31వ తేదీ వరకు మూసివేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ ఉప కమిషనర్ గీతా రాధిక ఆదేశించింది. ఈ మేరకు ఆయా హాస్టళ్లు, శిక్షణా సంస్థల నిర్వాహకులకు ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం నుంచి హాస్టళ్లను మూసివేసి విద్యార్థులను స్వస్థలాలకు పంపించాల్సిందిగా నిర్వాహకులను అధికారులు ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ఉత్తర్వులను కాదని ఎవరైనా నిర్వాహకులు కోచింగ్‌ సెంటర్లు, వసతి గృహాలను నిర్వహించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

GHMC ఆదేశాలతో 2020, మార్చి 17వ తేదీ మంగళవారం రాత్రికి రాత్రే పలు హాస్టల్స్‌ను మూసివేశారు. మరికొన్నింటిని అధికారులు దగ్గరుండి మూయించివేశారు. 2020, మార్చి 18వ తేదీ బుధవారం కూడా మిగిలిన హాస్టల్స్‌ను మూయించనున్నారు. హాస్టల్‌ లోని విద్యార్థులు, కోచింగ్‌ తీసుకుంటున్న వారిని స్వస్థలాలకు పంపించాల్సిందిగా అధికారులు నిర్వాహకులకు సూచించారు. ఉన్నపళంగా హాస్టల్స్‌ మూసేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్టుండి హాస్టల్స్‌ మూసేస్తే ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కోచింగ్‌ సెంటర్లు, హాస్టల్స్‌ మూసేయడంతో తాము ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Image result for అమీర్‌పేట్ లో హాస్టళ్లు మూసివేత

హైదరాబాద్ మహానగరంలో అమీర్‌పేట.. మైత్రివనం.. ఈ పేర్లు వినగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చేవి కోచింగ్‌ సెంటర్లు, హాస్టళ్లు. ఎక్కడెక్కడి నుంచో వేల సంఖ్యలో అక్కడికి వచ్చి కోచింగ్‌ సెంటర్లలో వివిధ కోర్సులు నేర్చుకుంటుంటారు. నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యోగ అన్వేషణలో ఉన్న నిరుద్యోగులతో అమీర్‌పేట్‌ ప్రాంతం కిలకిటలాడుతూ రద్దీగా ఉంటుంది. వీరిపై ఆధారపడి ఎన్నో హస్టళ్లు కూడా పుట్టగొడుల్లా అక్కడ వెలిశాయి. అయితే కరోనా ప్రభావంతో కొన్ని వారాల పాటు అమీర్‌పేట్, మైత్రీవనం, ఎస్ఆర్ నగర్ ప్రాంతాలు బోసిపోనున్నాయి. అలాగే హైదరాబాద్ యూనివర్శిటీ, ఉస్మానియా హాస్టల్స్ ఖాళీ చేయాలని అధికారులు విద్యార్థులకు ఆదేశాలు జారీచేశారు. ఏ ఒక్కరు కూడా హాస్టల్‌లో ఉండటానికి వీలు లేదని, వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇక ఉద్యోగులు అయితే అవకాశం ఉన్న ప్రతి ఐటీ ఉద్యోగిని ఇళ్ల నుంచే పని చేయించుకోవాలని ఐటీ సంస్థలకు సూచిస్తుంది ప్రభుత్వం.

Content above bottom navigation