కేంద్రం గుడ్ న్యూస్ : 400 రైళ్లకు గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా నేడో, రేపో పరిమితంగా రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రైళ్లు అందుబాటులోకి రాబోతుండటానికి ప్రత్యేక కారణం ఉంది.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి:

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటం వల్ల పరిమిత సంఖ్యలో వాటిని నడిపించబోతోంది రైల్వే మంత్రిత్వ శాఖ. ఒక్కో రైలుకు వెయ్యి మంది కంటే ఎక్కువ ప్రయాణించడానికి వీల్లేని నిబంధనను తెరమీదికి తీసుకుని వచ్చింది.

దేశవ్యాప్తంగా రోజూ 400 రైళ్లను నడిపించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేపట్టింది. దీనికోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా నివారించడానికి సోషల్ డిస్టెన్సింగ్‌ను తప్పకుండా పాటించాల్సి ఉంటుందంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసినందున.. దానికి అనుగుణంగా ఈ యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తోంది. ఒక్కో రైలుకు వెయ్యి మంది మాత్రమే ప్రయాణించేలా ముందు జాగ్రత్తలను తీసుకుంటోంది.

జీవనోపాధి కోసం వలస బాట పట్టిన కార్మికుల కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక రైళ్లను నడిపించబోతోంది. వలస కార్మికులు వారి స్వస్థలాలకు తరలి వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులను మంజూరు చేసిన నేపథ్యంలో రైల్వే శాఖ ముందుకొచ్చింది. వారిని తరలించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. మరి కాస్సేపట్లో రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు అధికారులు దేశంలోని అన్ని జోన్ల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దేశంలో 19 రోజుల రెండోదశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ లాక్‌డౌన్ గడువు 3వ తేదీ నాటికి ముగియబోతోంది. ఈ లోగానే రైల్వేలు తమ కార్యాచరణ ప్రణాళికను అమలులోకి తీసుకుని రావాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన తరలింపు కార్యాక్రమాలను చేపట్టబోతున్నారు. వలస కార్మికులను తరలించడానికి కేంద్రం అనుమతి ఇచ్చిన వెంటనే రాజస్థాన్, జార్ఖండ్ ప్రభుత్వాలు స్పందించాయి.

తమ రాష్ట్రం నుంచి ఆరు లక్షల మందికి పైగా వలస కార్మికులు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో నివసిస్తున్నారని, వారిని స్వరాష్ట్రానికి తరలించాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విజ్ఙప్తి చేశారు. అదే సమయంలో- జార్ఖండ్‌కు ప్రత్యేక రైళ్లను నడిపించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేంద్రాన్ని కోరారు. ముఖ్యమంత్రులు ఉద్ధవ్ థాకరే (మహారాష్ట్ర), పినరయి విజయన్ (కేరళ) ఇదివరకే దీనిపై కేంద్ర ప్రభుత్వానికి వినతులను పంపించారు. ప్రత్యేక రైళ్లను నడిపించాలని, తమ రాష్ట్ర కార్మికులను ఇంటికి చేర్చాలని వారంతా కోరుతున్నారు.దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి కూడా రైల్వే మంత్రిత్వ శాఖకు విజ్ఙప్తులు వెల్లువెత్తాయి.

Content above bottom navigation