మళ్ళీ లాక్ డౌన్..? జూన్ 16న కేసీఆర్ సంచలన నిర్ణయం

215

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 16వ తేదీన ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించే ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా పరిస్థితులు, నియంత్రిత సాగు అమలు, ప్రధాని మోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌ ఇతర ముఖ్య అంశాలపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లతో, స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా పరిషత్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా అటవీ అధికారులు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హాజరు కావాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం ఆదేశాలు జారీచేశారు.

ఈ సమావేశంలో కలెక్టర్లతో వివిధ అంశాలపై చర్చించి జిల్లాల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకోనున్నారు. వర్షాలు, వ్యవసాయం, రైతు వేదికల నిర్మాణం అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. లాక్‌ డౌన్‌ సడలించిన తరువాత జిల్లాల్లో ఎలాంటి పరిణామాలు, ఎదురవుతున్న విషయాలను సీఎం కలెక్టర్లను అడగనున్నారు. ఇక మరో వైపు ఈ నెల 20 నుంచి రాష్ట్రంలో హరితహారం ప్రారంభం కానున్న వేళ దానిపైనా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

ఇక ఈ నెల 17వ తేదీన ప్రధాని నరేంద్రమోడి సీఎంలతో నిర్వహించే వీడియోకాన్ఫరెన్స్ లో తెలంగాణలో తాజా పరిస్థితులను సీఎం వివరిస్తారు. అంతే కాకుండా రాష్ట్రానికి జరగాల్సిన వివిధ పెండింగ్ అంశాలు, వ్యవసాయంతో ఉపాధి హామీ అనుసంధానం వంటి వాటిని కేసీఆర్ ప్రధానికి వివరించే అవకాశం ఉంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానితో ఇంకా ఏ అంశాలను ప్రస్తావించాలనే విషయంపై నివేదిక ఇవ్వాలని కేసీఆర్‌ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను శనివారం ఆదేశించారు.

Content above bottom navigation