ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల మందికిపైగా కరోనా వైరస్ బారిన పడగా.. 13 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మొదట చైనాను అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాలను వణికిస్తోంది. కోవిడ్ దెబ్బకు ఇటలీ చిగురుటాకులా వణికిపోతోంది. ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 5 వేలకు చేరువలో ఉందంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. ఇటీవలే అమెరికా మనుషులపై తొలిసారిగా కరోనా వైరస్ వ్యాక్సిన్ పరీక్షలను ప్రారంభించింది.
కాగా ఫ్రెంచ్ పరిశోధకుడు కోవిడ్-19కు సరికొత్త చికిత్సా విధానాన్ని కనిపెట్టారు. ఈ ప్రయోగం ప్రాథమిక దశలో ఉండగా.. ఆరు రోజుల్లోనే ఈ ఔషధం వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుందని తేలింది. ఇన్స్టిట్యూట్ హాస్పిటలో యూనివర్సిటైర్కు చెందిన ప్రొఫెసర్ డిడిర్ రావౌల్ట్ ఈ ప్రయోగాన్ని చేపట్టారు. కరోనా వైరస్ చికిత్సకు సంబంధించిన పరిశోధన బాధ్యతలను అంటువ్యాధుల నిపుణుడైన రావౌల్ట్కు ఫ్రెంచ్ ప్రభుత్వం అప్పగించింది. క్లోరోక్విన్‌తో కోవిడ్ పేషెంట్‌కు చికిత్స చేయగా.. వేగంగా కోలుకున్నాడని.. ఇతరులకు సోకే ముప్పు తగ్గిందని తెలిపారు.

ఇటలీలో శనివారం ఒక్కరోజే 793 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా జరిగిన మరణాల్లో 36 శాతం ఇటలీలోనే సంభవించాయి. దీంతో ఆ దేశం మరిన్ని ఆంక్షలను అమలు చేస్తోంది. ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా వైరస్ ధాటికి స్పెయిన్ కూడా విలవిల్లాడుతోంది. ఇప్పటివరకూ 25 వేల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. 14 వందల మందికి పైగా చనిపోయారు. ఇరాన్లో మరణాల సంఖ్య 16 వందలకు చేరువైంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు జైళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఇందులో భాగంగా మరో 10 వేల మంది ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేస్తున్నారు

.