ఈ ఇద్దరి పెళ్లికి ఎన్ని ‘వైరస్’ కష్టాలురా నాయనా..

113

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్ళికి కుటుంబ సభ్యులు కూడా పెళ్ళికి ఒప్పుకున్నారు. దాంతో సంవత్సర కిందట పెళ్ళికి ముహూర్తం పెట్టుకున్నారు. కానీ ప్రకృతి వాళ్ళ పెళ్లిని ఆపేసింది. ఆ తరవాత మరొక ముహూర్తం పెట్టుకుంటే ఆ ముహుర్తాన్ని కూడా ప్రకృతి ఆపేసింది. కొన్ని పెళ్లిళ్లు జాతకాలు బాగాలేకనో, కట్న కానుకల విషయంలోనో వాయిదాలు పడుతుంటాయి. కానీ ఈ జంట పెళ్లిని మాత్రం వైరస్, విషాదం, ఉప్పెనలు అడ్డుకున్నాయి. దీంతో వారి పెళ్లి ముచ్చటగా మూడుసార్లు వాయిదా పడింది. ఈ పెళ్లి ముచ్చటకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

Image result for lovers

కేరళాలోని ఎరనిపాలన్‌కు చెందిన ప్రేమచంద్రన్ , శాండ్రా సంతోష్ గత కొంతకాలంగా చిలకా గోరింకల్లా, లైలా మజ్నూల్లా ఘాటుగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో తమ ప్రేమ గురించి చెప్తే వాళ్ళు కూడా పెళ్ళికి పచ్చజెండా ఊపారు. ఇక పెళ్లితో వారి ప్రేమకు ఫుల్‌స్టాప్ పెడదామని భావించారు. అయితే వారి పెళ్లికి ఎక్కడలేని గండాలు ముంచుకు రావడంతో, వారు తమకు ఈ జన్మకి ఇక పెళ్లి యోగం లేనట్టుంది అనే ఫీలింగ్ తో బాధపడుతున్నారు.. పెళ్లి సమయానికి తగుదునమ్మా అని ఏదో ఒక ఉపద్రవం వచ్చి పడుతోంది. దీంతో పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు. వీరి పెళ్ళికి మొదటి ముహూర్తం 20 మే 2018న ఫిక్స్ చేసుకున్నారు. అప్పుడే నిపా వైరస్ విజృంభించింది. దీంతో కేరళలోని కొజికోడ్, మలపురం జిల్లాలు ప్రభావితం అయ్యాయి. 17 మంది ప్రాణాలు కోల్పోగా.. ప్రజలు సమూహంగా ఉండరాదని నిషేదం విధించారు. దీంతో వీరి పెళ్లికి మొదటి అడ్డంకి విజయవంతంగా పడింది.

నిపా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టగానే వారి పెళ్లి చేయాలని వధూవరుల బంధువులు భావించారు. అప్పుడే వధువు సమీప బంధువు ఒకరు చనిపోయారు. దీంతో సాంప్రదాయం ప్రకారం సంవత్సరంపాటు పెళ్లి చేసుకోవడం కుదరలేదు. ఆ తర్వాత 2019లో ఓణం పండుగ రోజుల్లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అప్పుడూ మరో గండం వరదల రూపంలో వచ్చింది. గత ఏడాది ఆగస్టులో విధ్వంసకర వరదలు సంభవించి వీరి పెళ్లి ఆగిపోయింది. సరేలే అన్నీ మన పెళ్లినే అంటి పెట్టుకున్నట్టున్నాయని సర్దుకుని తమ పెళ్లికి మూడో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈనెల 20 పెళ్లి డేట్ ఉండగా.. కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో కేరళ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు గట్టి చర్యలు చేపట్టింది. గుంపులుగా అస్సలు చేరవద్దని ఆదేశించింది. దీంతో మూడో ముహూర్తం కూడా క్యాన్సిల్ అయ్యింది. విసుగుచెందిన ఈ ప్రేమికులు ఈ ఏడాది సెప్టెంబరులో పెళ్లి చేసుకోవాలని మరొక ముహూర్తం పెట్టుకున్నారు.. ఈ సెప్టెంబరులో అయినా కచ్చితంగా వీళ్ళ పెళ్లి జరగాలని, ఏ ఉపద్రవం ముంచుకురాకుండా పెళ్లి జరిగాలని, వీరితోపాటు వీరి బంధువులు కూడా కోరుకుంటున్నారు. చూడాలి మరి ఈసారైనా వారి పెళ్లి గండం గట్టెక్కుతుందేమో.

Content above bottom navigation