మేం బతుకుతామో లేదో తెలియదు…డైమండ్ ప్రిన్సెస్‌ విహార నౌక నుంచి భారతీయుడి ఆవేదన

116

చైనాలో కోవిడ్-19 వైరస్ మరింత ఉద్ధృతమవుతోంది. బుధవారం ఒక్క రోజే కరోనా వైరస్ కారణంగా 242 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15,000 కొత్త కేసులు నమోదయినట్టు చైనా అధికారులు తెలిపారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 1,355కి చేరింది. కరోనా బాధితుల సంఖ్య 60,000 దాటినట్టు హుబే హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఈ ప్రావిన్సుల్లో కొత్తగా 14,840 మంది బాధితులను గుర్తించనట్టు తెలిపారు. ఇప్పటి వరకు పదుల్లోనే ఉన్న మృతుల సంఖ్య ఒక్క రోజులోనే రెట్టింపు కావడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. కోవిడ్ వైరస్ రూటు మార్చినట్టు స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. ఇక జపాన్ లోని యోకోహమా తీరానికి డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలో మొత్తం 3711 మంది ఉండగా, వారిలో తాజాగా 41 మందికి ఈ వైరస్ సోకింది. ఇప్పటికే ఈ నౌకలో 20 మందికి సోకగా మొత్తం వైరస్ సోకిన వారి సంఖ్య 61కి చేరింది. కాగా వైరస్ భయంతో నౌకను విడిగా ఉంచి వైద్య పరీక్షలు జరుపుతున్నారు. అయితే ఆ నౌకలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే ఆ నౌకలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న భారతీయుడొకరు తాజాగా పంపిన వీడియోలో తన ఆందోళన వ్యక్తం చేశారు.

 ప్రయాణికులపై విధించిన ఆంక్షలు

‘‘డైమండ్ ప్రిన్సెస్‌ విహార నౌకలో కరోనా వైరస్ రోగుల మధ్య మేం బతకుతామో లేదో తెలియదు. మాకు కూడా కరోనా వైరస్ సంక్రమించే ప్రమాదం ఉంది. క్రూయిజ్ షిప్ నుంచి మమ్మల్ని రక్షించండి అంటూ తమిళనాడు రాష్ట్రంలోని మధురైకి చెందిన అన్బలగన్ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. విహార నౌకలో ప్రయాణికులను ఆరు అడుగుల దూరంలో నడవమని కోరుతున్నామని, షిప్‌‌ లోని గదుల్లో తాము ఉన్నామని వీడియోలో అన్బలగన్ చూపించారు. తాము నౌకలోని టాప్ డెక్స్‌ లో ఉన్నామని, కరోనా వైరస్ సోకిన రోగులకు ఆహారాన్ని వారి గదులకు పంపుతున్నారని ఆయన పేర్కొన్నారు. జపాన్ తీరంలోని సముద్రంలో నిర్బంధించిన ఓడలో ప్రయాణికుల కదలికలపై ఆంక్షలు విధించారని, నౌకలో పనిచేస్తున్న తాము ప్రమాదంలో ఉన్నామని, భారత ప్రభుత్వం తమను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. మేం నౌకలోని ప్లేట్లను షేర్ చేసుకొని మెస్ లో భోజనం చేస్తున్నాం. అందువల్ల ఈ కరోనా వైరస్ మాకు సులభంగా సోకే ప్రమాదముంది. అందుకే మమ్మల్ని ఈ నౌక నిర్బంధం నుంచి బయటకు తీసుకురావాలని కోరుతున్నాం అని ఆయన పేర్కొన్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

మోదీజీ ఐఏఎఫ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ను పాకిస్థాన్ నుంచి ఎలా కాపాడారో అలా మమ్మల్ని కూడా రక్షిస్తారని మేం ఆశిస్తున్నాం అంటూ అన్బలగన్ కోరారు. తమిళ భాషలో మాట్లాడిన అన్బలగన్, తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్, సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమల్‌హాసన్, నటులు విజయ్, అజిత్ కుమార్‌లకు విజ్ఞప్తి చేశారు. నౌకలో కొన్ని ప్రోటోకాల్స్‌ను పాటించాల్సి ఉందని, ఒకవేళ ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘిస్తే తమకు ఇక్కడే కాదు మరెక్కడా ఉద్యోగం రాదనే భయం తమలో నెలకొందని బినయ్ సర్కార్ అనే మరో భారతీయ సిబ్బంది తన ఆవేదన వ్యక్తం చేశాడు. అస్సలు బతుకుతామన్న గ్యారెంటీ లేనప్పుడు ఈ ప్రోటోకాల్స్‌ ను పాటించడం వల్ల వచ్చేదేముంది అని సర్కార్ చెప్పారు. డైమండ్ ప్రిన్సెస్ అనే ఈ క్రూయిజర్ 2500 మంది ప్రయాణికులు 1000 మంది సిబ్బందితో జపాన్‌లోని యొకొహామా పోర్టులో ఫిబ్రవరి 4 నుంచి లంగరేసి ఉంది. రోజూ ప్రయాణికులకు కరోనావైరస్ టెస్టులు నిర్వహిస్తున్నారు. పరీక్షలు పూర్తయ్యేవరకు ఎవరూ నౌక వీడి వెళ్లరాదని నౌకాసిబ్బంది ఆదేశాలు జారీచేసింది. సోమవారం రోజున 135 మంది ప్రయాణికులకు పాజిటివ్‌గా వచ్చింది. ఇలా రోజురోజుకు నౌకలో కరోనా వైరస్ రోగుల సంఖ్య పెరుగుతుండటంతో నౌకలోని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation