కొడుక్కి తండ్రి పెట్టిన పరీక్ష… 6వేల కోట్లు రావాలంటే?

385

మీరు రజినీకాంత్ నటించిన అరుణాచలం సినిమా చుశారా? చూసే ఉంటారులెండి. ఆ సినిమాలో తండ్రి పాత్రలోని రజినీ, తన కొడుక్కి ఒక్కసారిగా కోట్ల రూపాయల డబ్బు అంది, డబ్బుపై వ్యామోహం పెరగకుండా ఉండటానికి ఓ పరీక్ష పెడతాడు. 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు చేస్తే నీకు 30 వేల కోట్లు వస్తాయని చెబుతాడు. తన కొడుక్కి కూడా డబ్బుపై విరక్తి వచ్చేయాలనేది రజినీ ఉద్దేశం. చివరకు యువ రజినీకాంత్ ఆ పరీక్షలో గెలుస్తాడు. అయితే నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తుందా అంటే అస్సలు రాదనే చెప్తారు. కానీ నిజ జీవితంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ నిజ జీవిత కథలో, తండ్రి కూడా తన కొడుక్కి డబ్బు విలువ, పేదల కష్టాలు తెలియాలనుకున్నాడు. కాకపోతే అరుణాచలం సినిమాకు రివర్సులో ఛాలెంజ్ ఇచ్చాడు. వేల కోట్లకు వారసుడయిన తన కొడుకుని ఇంట్లోంచి పంపేసి 30 రోజుల పాటూ బతికి చూపించమని ఛాలెంజ్ చేశాడు. మరి ఆ కొడుకు సాధించాడా? పూర్తీగా ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for గుజరాత్‌ లోని సూరత్‌కి చెందిన సావ్‌జీ పెద్ద వజ్రాల వ్యాపారి

గుజరాత్‌ లోని సూరత్‌కి చెందిన సావ్‌జీ పెద్ద వజ్రాల వ్యాపారి. హరే కృష్ణ డైమండ్ ఎక్స్‌ పోర్ట్స్ యజమాని. ఆయన కంపెనీ 71 దేశాల్లో వ్యాపారం చేస్తుంది. దాదాపు 6 వేల కోట్ల రూపాయల ఆస్తులున్న కంపెనీ అది. ఏడాది టర్నోవర్ వెయ్యి కోట్ల రూపాయల పైనే ఉంటుంది. అటువంటి వ్యాపారి కొడుకు ఎలా ఉంటాడు? అంటే సకల భోగాలు అనుభవిస్తూ ఉంటాడు అని ఎవరైనా చెబుతారు. కానీ ఈ సావ్ జీ కొడుకు అలా లేడు. 21 ఏళ్ల సావ్‌జీ కొడుకు ద్రవ్య అమెరికాలో ఎంబిఎ చదువుతున్నాడు. ఈ మధ్యనే సెలవులకు ఇండియా వచ్చాడు. అమెరికా నుంచి వచ్చిన తన కొడుకుని పిలిచి విషయం చెప్పాడు తండ్రి. కేవలం 3 జతల బట్టలు, చాలా ఎమెర్జెన్సీ అయితే తప్ప వాడవద్దని చెప్పి ఓ 7 వేల రూపాయలు ఇచ్చాడు. సెల్‌ఫోన్ కూడా లేదు. తనకు భాష రాని, తనెవరో తెలియని కేరళలోని కొచ్చి నగరానికి పంపాడు. అక్కడ నెల రోజుల పాటూ బతకాలి. తన ఖర్చులన్నీ తానే సంపాయించుకోవాలి.

Image result for గుజరాత్‌ లోని సూరత్‌కి చెందిన సావ్‌జీ పెద్ద వజ్రాల వ్యాపారి

తిండి ఉండటానికి చోటు, అన్నీ తానే సంపాయించాలి అని షరతు పెట్టి ఇంటినుంచి పంపించేశాడు. సావ్‌జీ పెట్టిన షరతులకు ద్రవ్య ఒప్పుకున్నాడు. తండ్రి మాట ప్రకారం కొచ్చిలో అడుగుపెట్టాడు ద్రవ్య. మొదటి 5 రోజులూ ద్రవ్యకి ఎక్కడా పని దొరకలేదు. చాలా ఫ్రస్టేట్ అయ్యాడు. మొత్తం 60 చోట్ల ఉద్యోగానికి వెళితే ఎవరూ పని ఇవ్వలేదు. పనికి ఉండే విలువ అప్పుడే తెలిసింది ద్రవ్యకు. బహుశా అతను జీవితంలో ఊహించి ఉండడు.. వేలకోట్ల అధిపతి కాస్తా, రోడ్డుపై ఉద్యోగానికి తిరిగితే 60 మంది అవతలికి పొమ్మంటారని. తిరగ్గా తిరగ్గా చేరనెల్లూరులోని ఓ బేకరీలో ద్రవ్యకి ఉద్యోగం వచ్చింది. తరువాత ఓ కాల్ సెంటర్‌లో పనిచేశాడు. తరువాత ఓ చెప్పుల షాపులో పనిచేశాడు. మెక్ డొనాల్డ్ ఔట్లెట్‌ లో కూడా పని చేశాడు. తనకు ఉద్యోగం ఇచ్చిన వాళ్లకు గుజరాత్ కి చెందిన పేద రైతు కుటుంబం నుంచి వచ్చాననీ, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నానీ చెప్పాడు. మొత్తంగా మనోడు నెల రోజులు కష్టపడి, తన ఖర్చులు పోనూ 4 వేల రూపాయలు సంపాదించాడు.

30 రోజులు గడిచాయి. తిరిగి సొంతూరు సూరత్‌ లో అడుగుపెట్టాడు ద్రవ్య. నెల రోజుల్లో జీవితానికి సరిపడా పాఠాలు నేర్చుకున్నాడు. డబ్బుల విలువ, పేదల శ్రమ విలువ తెలుసుకున్నాడు. ఆయన తండ్రి కోరుకున్నది కూడా అదే. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ద్రవ్య తండ్రి సావ్‌జీ ధోలాకియాది చాలా పెద్ద మనసు. రెండేళ్ల క్రితం ఓ వజ్రాల వ్యాపారి గురించి ప్రపంచవ్యాప్తంగా వార్తలు మార్మోగాయి. తన ఉద్యోగులకు ఫ్లాట్లు, కార్లు బహుమతిగా ఇచ్చిన వజ్రాల వ్యాపారి అంటూ సంచలన వార్తలు వచ్చాయి. అతనే ఈ సావ్‌జీ. తన ఉద్యోగులను ఎంతో బాగా చూసుకునే సావ్‌జీ టార్గెట్లు రీచ్ అయిన ఉద్యోగులకు మొత్తం 424 కార్లు, కొందరికి అపార్టుమెంట్లలోని ఫ్లాట్లు బహుమతిగా ఇచ్చేశాడు. సావ్‌జీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ వ్యాపారం చేస్తున్న వాళ్లు కూడా ఇంత ధైర్యం చేయలేదు. ద్రవ్య స్టోరీలో మరో ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే.. చిన్న ఉద్యోగంలో ఉన్న ద్రవ్యను ఒక వ్యక్తి బాగా గమనించాడు. శ్రీజిత్ అనే ఫైనాన్స్ ప్రొఫెషనల్ ఒకతను ద్రవ్యను బేకరీలో చూశాడు. మనోడులో ఏదో విషయం ఉందని, అతను చాలా ప్రత్యేకం అనీ అనుకున్నాడు. వెంటనే తన నంబర్ ఇచ్చి కలవమన్నాడు. అయితే ద్రవ్యకి ఉద్యోగం ఇవ్వొద్దని అతని కొలీగ్స్ ఒత్తిడి చేయడంతో వెనక్కు తగ్గాడు శ్రీజిత్. ద్రవ్య తిరిగి సూరత్‌లోని సొంతింటికి చేరుకున్నాక, ద్రవ్య సొంత కంపెనీ CEO, శ్రీజిత్‌కి ఫోన్ చేసి ద్రవ్య తరపున థాంక్స్ చెప్పి అసలు కథంతా చెప్పాడట. దీంతో శ్రీజిత్ షాక్ అయ్యాడంట. ఎంత డబ్బున్న కుటుంబంలో పుట్టినా, వారసత్వంగా ఎంత ఆస్తి వచ్చినా మనుషుల విలువ, డబ్బు విలువ, శ్రమ విలువ తెలియకపోతే, జీవితంలో విలువలు లేకపోతే ఏవి ఉన్నా లేనట్టే.. అదే సూత్రం అద్భుతంగా, ప్రాక్టికల్‌గా చెప్పిన ఆ తండ్రికీ, తండ్రి మాటను జవదాటకుండా, జీవితంలో ఎన్నో నేర్చుకున్న ఆ కొడుక్కీ.. ఇద్దరికీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation