కరోనా వైరస్ నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. లాక్ డౌన్‌ను పకడ్బందీగా అమలుచేస్తూ.. ముందు జాగ్రత్తగా మరిన్ని క్వారెంటైన్ కేంద్రాలను,ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. అదే సమయంలో కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా ఉండేందుకు నిత్యావసరాలను సైతం 14 రోజుల పాటు ఇంటి వద్దకే సరఫరా చేయాలని నిర్ణయించింది.

ప్రభుత్వం ప్రకటించిన క్వారెంటైన్ రెడ్ జోన్లలో హైదరాబాద్‌లోని చందానగర్, కోకాపేట, గచ్చిబౌలి, తుర్కయాంజాల్, కొత్త పేట ప్రాంతాలున్నాయి. కరోనా పాజిటివ్ కేసు నమోదైన బాధితుడి ఇంటి నుంచి కి.మీ పరిధిలో ‘కోవిడ్-19 క్వారెంటైన్ జోన్’గా ప్రకటించారు. ఇక్కడి ప్రజలంతా 14 రోజుల పాటు క్వారెంటైన్లో ఉండాల్సిందే.హెల్త్ కేర్ సిబ్బంది వీరి ఇళ్లకే వెళ్లి స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు. తద్వారా ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలుంటే ముందుగానే వారిని ఐసోలేషన్‌కు తరలించే అవకాశం ఉంటుంది.
తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 14కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 59కి పెరిగింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 887 కేసులు నమోదవగా 20 మంది మృతి చెందారు. కేరళ 176 కేసులతో మొదటి స్థానంలో ఉండగా, 156 కేసులతో మహరాష్ట్ర, 63కేసులతో కర్ణాటక,59 కేసులతో తెలంగాణ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 596852 కేసులు నమోదవగా.. 27355 మంది మృతి చెందారు. ఇందులో అత్యధికంగా అమెరికాలో 104,142,ఇటలీలో 86,498,చైనాలో 81,394,స్పెయిన్‌లో 65,719 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో మృతుల సంఖ్య 1696కి చేరగా.. ఇటలీలో 9134,స్పెయిన్‌లో 5138కి చేరింది.