ఏపీలో మే 4 నుంచి మద్యం విక్రయాలు, కొత్త నిబంధనలు ఇవే

లాక్ డౌన్ కారణంగా మందు దొరక్క నరకం చూసిన మందుబాబులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ వినిపించింది. మందు బాబుల మందు కష్టాలు, మద్యం దాహం తీరనున్నాయి. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో గ్రీన్ జోన్లలో మద్యం, పాన్, పొగాకు విక్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా మద్యం దుకాణాల దగ్గర కొత్త నిబంధనలు విధించారు. మద్యం కొనేందుకు వచ్చే వారు, మద్యం షాపుల నిర్వాహాకులు తప్పనిసరిగా ఆ నిబంధనలు పాటించాలి.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి:

* మద్యం షాపుల దగ్గర కనీసం 6 అడుగుల దూరం పాటించాలి.
* ప్రతి మనిషికి మధ్య కనీసం 2 గజాలు దూరం ఉండాలి.
* వైన్ షాపుల దగ్గర ఒకసారి ఐదుగురికి మాత్రమే అనుమతి.
* మాస్క్ తప్పనిసరి.

మద్యం షాపుల దగ్గర ఈ నిబంధనలు మస్ట్. కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో మద్యం, పాన్, గుట్కా, పొగాకు బహిరంగ ప్రదేశాల్లో వినియోగించరాదు.

మే 4 నుంచి ఏపీలో తెరుచుకోనున్న మద్యం షాపులు:
లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో మే 4 నుంచి రాష్ట్రంలోని గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. దీనిపై నేడు(మే 2,2020) అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయని సమాచారం. అయితే మద్యం షాపులు మాత్రమే తెరవనున్నారు. భౌతిక దూరం పాటిస్తూ అమ్మకాలు జరిపేలా ఏర్పాట్లు చేయనున్నారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకూ బార్లకు మాత్రం అనుమతి లేదు. కాగా జోన్ల విషయంలో దేన్ని ప్రాతిపదికగా తీసుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లాలను యూనిట్‌గా తీసుకుంటే ఐదు జిల్లాలు రెడ్‌ జోన్‌లో ఉన్నందున అక్కడ అమ్మకాలు జరగవు. మండలాలను యూనిట్‌గా తీసుకుంటే అన్ని జిల్లాల్లోనూ రెడ్‌ జోన్‌ మండలాలను మినహాయించి మిగిలిన మండలాల్లో మద్యం విక్రయించే అవకాశముంది.

మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావం:
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విధివిధానాలు రూపొందించి మద్యం అమ్మకాలకు అనుమతిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో గత 40 రోజులుగా మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావం పడింది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే రూ.2 వేల కోట్ల వరకు నష్టపోయినట్లు ప్రభుత్వ అధికారుల సమాచారం. రాష్ట్రంలోని 3వేల 500 మద్యం షాపులు, 818 బార్‌ అండ్‌ రెస్టారెంట్ల ద్వారా రోజుకు సగటున రూ.62 కోట్ల నుంచి రూ.65 కోట్ల మధ్య మద్యం అమ్మకాలు సాగుతుంటాయి. వీటి ద్వారా నెలకు రూ.17 వందల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. 

ప్రభుత్వానికి సవాల్ గా మారిన అక్రమ మద్యం, నాటుసారా కట్టడి:
కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించడంతో మార్చి 22 నుంచి మద్యం అమ్మకాలు ఆగిపోయాయి. రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలు వేగవంతమైన నేపధ్యంలో ఆర్థిక వెసులుబాటు ఉన్న మద్యం అమ్మకాలు నిలిచిపోవడం ప్రభుత్వంపై భారం పడింది. పైగా అక్రమ మద్యం, నాటుసారా పెద్ద ఎత్తున మార్కెట్లోకి వస్తుండటంతో కట్టడి ప్రభుత్వాలకు కష్టతరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్యం అక్రమ అమ్మకాలు జరిగినట్లు స్వయంగా ప్రభుత్వమే అంగీకరించి తనిఖీలకు ఆదేశాలు జారీ చేసింది. ఓ వైపు ప్రభుత్వానికి నష్టం..మరో వైపు అక్రమ మద్యం రంగ ప్రవేశంతో అమ్మకాలు నిర్వహించడమే మంచిదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమైంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం అమ్మకాలకు అనుమతులు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. 

గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు అనుమతి:
అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి నేపధ్యంలో మద్యం అమ్మకాలకు కేంద్రం అంగీకరించలేదు. ఈ క్రమంలోనే మూడో విడత రెండు వారాల పాటు (మే 17 వరకు) లాక్‌ డౌన్‌ పొడిగించేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం..ఆయా ప్రాంతాలను రెడ్‌, ఆరంజ్‌, గ్రీన్‌ జోన్లుగా విభజించింది. గ్రీన్‌ జోన్లలో ఆంక్షలతో కూడిన మద్యం అమ్మకాలకు అనుమతిస్తూ శుక్రవారం(మే 1,2020) కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపధ్యంలో మద్యం అమ్మకాలు జరిపేందుకు అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వపరంగా విధివిధానాలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వపరమైన విధివిధానాలు అందిన వెంటనే అమ్మకాలు జరిపేందుకు అధికారులు నిర్ణయించారు. సడలించిన ఆంక్షలు సోమవారం(మే 4,2020) నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Content above bottom navigation