ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19 ఇండియాలో మరింత తీవ్రరూపం దాల్చింది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండగా, మరణాలు అంతేస్థాయిలో ఉన్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో మరో 600పైగా కోవిడ్ 19 పాజిటివ్ కేసులు పెరిగాయి. దీంతో ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4,200 దాటింది. గత వారం రోజుల్లో దేశంలో దాదాపు 3000పైగా కేసులు నమోదయ్యాయి. ఆదివారం అత్యధికంగా మహారాష్ట్రలో 130కిపైగా కేసులు నిర్ధారణ కాగా, తమిళనాడులోనూ 85 కేసులు గుర్తించారు. ఈ రెండు రాష్ట్రాల్లోనే కోవిడ్ 19 కేసుల సంఖ్య 1,300 దాటింది. అలాగే, దేశవ్యాప్తంగా కోవిడ్ 19 బారినపడి మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో కోవిడ్ 19 వైరస్ వెలుగుచూసిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో బాధితులు మృతిచెందడం ఇదే తొలిసారి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ 19 వైరస్ కేసులు భారీగానే నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు తెలంగాణలో 62, ఆంధ్రప్రదేశ్‌లో 69 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో తెలంగాణలో కోవిడ్ 19 కేసుల సంఖ్య 334కి చేరుకోగా, ఏపీలో ఇది 258గా ఉంది.

ఈ విషయాలన్నీ ఇలా ఉంటే ఏపీని కోవిడ్ 19 పరేషాన్ చేస్తుంది. కర్నూలులో ఏకంగా 53 పాజిటివ్ కేసులు నమోదుకావడం సంచలనం రేపుతోంది.. ఉన్నట్టుండి కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బాధితుల్లో ఓ రైల్వే ట్రాక్‌మెన్ కూడా ఉండటం కలకలం రేపుతోంది. అతడు ఎవరెవర్ని కలిశాడు.. ఎక్కడెక్కడ తిరిగాడు అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. అతడు గత నెలలో ఢిల్లీ నుంచి కర్నూలు వచ్చినట్లు గుర్తించారు . ట్రాక్‌మెన్ గత నెల 17న రాత్రి 8 గంటలకు ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ లో బయలుదేరి 18న రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ వచ్చాడు. తర్వాత 7.10 గంటలకు ఫలక్‌నుమా ఎంఎంటీఎస్ రైలు ఎక్కి 7.30 గంటలకు కాచిగూడ వెళ్లాడు. తర్వాత రాత్రి 8.05 గంటలకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లో కర్నూలు చేరుకున్నాడు. అక్కడ తన విధులకు హాజరైనట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కాచిగూడ స్టేషన్లో ఉన్న అతడు 35 నిమిషాలు ఎక్కడెక్కడ తిరిగాడనే విషయమై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ప్లాట్‌ఫాంపై టిఫిన్ సెంటర్లు, స్టాళ్లు, అక్కడ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎవరిలోనైనా కోవిడ్ 19 లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలని అధికారులు సూచించారు. ట్రాక్‌మెన్ టిక్కెట్ రిజర్వేషన్ లేకుండానే కర్నూల్ కు వెళ్లినట్లుగా తేలిందట. ఎస్2, ఎస్5 బోగీల్లో ప్రయాణించినట్లు గుర్తించారట.. ఎస్5 బోగీలో ప్రయాణించిన 77 మంది జాబితా సేకరించి వివరాలు ఆరా తీస్తున్నారు. వారిలో ఎవరిలోనూ వ్యాధి లక్షణాలు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ట్రాక్‌మెన్ రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి పాజిటివ్ రాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.