కర్ఫ్యూ కొత్త రూల్స్ ఉ.6 నుండి 1 వరకు మాత్రమే పర్మిషన్

191

సరుకుల కొనుగోళ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని సమయంలో కొంత వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాల విక్రయ కేంద్రాలు, రైతు బజార్లు తెరచి ఉంటాయని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు. మెడికల్‌ షాపులు రోజంతా అందుబాటులో ఉంటాయని చెప్పారు. సీఎం జగన్మోహన్‌‌రెడ్డి సమక్షంలో ఈ మేరకు నిర్ణయించినట్టు తెలిపారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు జన సంచారం పూర్తిగా నిషేధిస్తున్నామన్నారు. రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌తో కలిసి కలెకర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ బుధవారం నిర్వహించారు.

ఈ సందర్బంగా సీఎస్‌ మాట్లాడారు. ‘ప్రజలు నిత్యావసరాలు, కూరగాయలు, ఇతర అవసరాల కోసం ఎద్దఎత్తున గుంపులుగా రాకుండా చర్యలు చేపట్టాలి. ఇంటికి అవసరమైన సరుకులను తమ ఇంటికి రెండు కిలో మీటర్ల దూరంలోని ప్రాంతం నుంచే తీసుకువెళ్లాలి. కుటుంబానికి అవసరమైన సరుకులన్నీ ఒకే వ్యక్తి తీసుకువెళ్లాలి. నిత్యావసర సరుకుల కొరత, లాక్‌డౌన్‌ అమలు విషయంలో సమస్యలపై 1902 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. విదేశీయుల కదలికల సమాచారం, వైద్య చికిత్సలకు సంబంధించిన అంశాలపై 104 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలి’ అని సీఎస్‌ తెలిపారు.

నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలతో పాటు సరుకు రవాణా వాహనాలను ఆపవద్దని డీజీపీ సవాంగ్‌ కోరారు. ‘విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారనే సమాచారం సేకరించడం ముఖ్యం. వారి కదలికలపై పోలీసులు, రెవెన్యూ, వైద్యశాఖలు కలిసి పనిచేయాలి’ అని డీజీపీ సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారి కదలికలు గుర్తించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని కూడా పరీక్షించాలనీ, ఉందని వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి సూచించారు. రేపిడ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా 15 నిమిషాల్లో పరీక్షించి వారిలో వ్యాధి లక్షణాలు ఉన్నదీ లేనిదీ గుర్తించవచ్చన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్‌లో ఉంచాలన్నారు.

Image result for new curfew

కరోనాకు పాజిటివ్‌గా నిర్థారణ జరిగిన వారిలో 80 శాతం మంది ఆసుపత్రిలో చికిత్స అవసరమే ఉండదన్నారు. కేవలం 15 శాతం మందికి మాత్రమే ఆసుపత్రిలో చికిత్స అవసరమన్నారు. వీరిని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కరోనా వార్డుల్లో చికిత్స అందించవచ్చన్నారు. మరో 5 శాతం మందికి క్రిటికల్‌ కేర్‌ అవసరమని, వీరికి చికిత్స అందించేందుకు విశాఖలోని నిమ్స్‌తో పాటు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో చికిత్స అందించే ఏర్పాట్లు చేశామన్నారు. రోడ్లు, భవనాలశాఖ ముఖ్య కార్యిదర్శి ఎం.టి.కృష్ణ మాట్లాడుతూ కూరగాయలను గ్రామాల నుంచి పట్టణాలకు తరలించేందుకు, నిత్యావసరాలను తరలించేందుకు ఆర్టీసీ బస్సుల సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

కూరగాయల ధరల పట్టికను ప్రజలకు తెలియజేయడంతో పాటు వాటిని కూరగాయలు విక్రయించే ప్రదేశాల్లో ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌, నగర సీపీ ద్వారకా తిరుమల రావు, జేసీ మాధవీలత, విజయవాడ సబ్‌కలెక్టర్‌ హెచ్‌యం. ధ్యానచంద్ర, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ అనుపమ తదితరులు పాల్గొన్నారు. 

Content above bottom navigation