హత్య కేసు నిందితుడు 22 ఏళ్ల తర్వాత అరెస్టు

6015

మన దేశంలో తప్పు చేసినవాడికి శిక్ష పడడంలో కొంత ఆలస్యం అవ్వొచ్చు కానీ శిక్ష పడటం మాత్రం పక్కా. చేసిన తప్పుకు ఈరోజు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత తప్పకుండ శిక్ష పడుతుంది. అలాంటి ఒక ఘటన గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. హత్య జరిగిన 22 ఏళ్ల తర్వాత నిందితుడ్ని పట్టుకున్నారు పోలీసులు. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

కొత్తగూడెం టూ-టౌన్ పోలీస్ స్టేషన్ పరిథిలో 1994లో ఓ హత్య జరిగింది. ఇందులో ప్రధాన నిందితుడు ప్రహ్లాద్ మౌర్య. హత్య జరిగిన వెంటనే అతడ్ని అరెస్ట్ చేశారు. బెయిల్ పై బయటకు కూడా వచ్చాడు. ఆ కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. ఇక అంతా ఓ కొలిక్కి వచ్చిందనుకున్న టైమ్ లో ప్రహ్లాద్ పరారయ్యాడు. అలా 1998 నుంచి కనిపించకుండా పోయాడు ప్రహ్లాద్. పోలీసులు కూడా ఈ కేసును పక్కనపెట్టారు. అలా తెలంగాణ వదిలి వెళ్లిన ప్రహ్లాద్, దాదాపు 20 ఏళ్ల పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లోని వివిధ పట్టణాల్లో తలదాచుకున్నాడు. కేసును పోలీసులు మరిచిపోయి ఉంటారని భావించి, ఈమధ్యే మణుగూరు వచ్చి సెటిల్ అయ్యాడు. ప్రహ్లాద్ మణుగూరు వచ్చి కూడా రెండేళ్లు అవుతోంది. దీంతో తనకిక ఎదురులేదని భావించాడు. కానీ పోలీసులు మాత్రం 22 ఏళ్ల కిందటి ఆ కేసును వదల్లేదు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించారు. పెండింగ్ కేసుల్ని మరోసారి తిరగేసే క్రమంలో ఈ కేసు తెరపైకొచ్చింది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఈ కేసును అప్పట్లో విచారించిన పోలీసులు ఇప్పుడు లేరు. అయినప్పటికీ ఫైల్ లో ఉన్న ఆధారాలు ఆధారంగా విచారించగా, చుట్టూ తిరిగి మణుగూరులో నిందితుడు ఉన్నట్టు తెలుసుకున్నారు. ప్రహ్లాద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఖమ్మం సెషన్స్ కోర్ట్ ఆదేశాలతో అతడ్ని రిమాండ్ లోకి తీసుకున్నారు. అలా హత్య జరిగిన 22 ఏళ్ల తర్వాత ప్రహ్లాద్ మరోసారి పోలీసులకు చిక్కాడు. ఈసారి అతడు బయటకు రావడం అసాధ్యం అంటున్నారు పోలీసులు. దీర్ఘకాలంగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచిన టూటౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సిబ్బందిని జిల్లా ఎస్పీ సునీల్ దత్ అభినందించారు. అలాగే, పెండింగ్‌ కేసుల్లో భాగంగా నాన్‌ బెయిలబుల్‌ వారెంటున్న మరికొంతమందిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నామని జిల్లా ఎస్పీ సునీల్ దత్ మీడియాకు తెలిపారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation