మారుతీరావు చేసిన చివరి తప్పు ఇదే.. అంతిమ బాధితుడు అతనే..

మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఘటన తెలుగు రాష్టాల్లో ఎంత సంచలన స్పృష్టించిందో మనకు తెలుసు. కూతురు తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందని, 2018 సెప్టెంబ‌ర్ 14న అల్లుడు ప్రణయ్‌ ని అత్యంత దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించాడు. ఆ తర్వా మారుతీరావు 7 నెలలుగా వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అనంతరం గత ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌పై విడుదల బయట తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే..? ఇది మారుతీరావు తన జీవితంలో చేసిన చివరి తప్పు గురించి. పాత తప్పులకు ఇక ఎవరూ శిక్షించాల్సిన పనిలేదు. చట్టం, సమాజం విధించాల్సిన శిక్షను కూడా తానే విధించుకుని అనుభవించేశాడు. ఒక కథ సమాప్తం అయ్యింది. కానీ తను కులవివక్ష, బిడ్డలపై ప్రేమ, ఆ ప్రేమ కక్షగా మారడం, నేరానికి దారితీయడం, భావోద్వేగాలు, సామాజిక అంశాలు, వివక్షలు, నేరం వంటి చాలా చాలా పార్శ్వాలు ఉన్న కథ ఇది. అందుకే మారుతీరావు చాలారోజులు గుర్తుంటాడు. ఈ కథలో నేరస్థుడు తనే, అంతిమంగా బాధితుడూ తనే. చంపడమూ తప్పే.. చావడమూ తప్పే..

కోట్ల ఆస్తి, సమాజంలో పలుకుబడి, కులంలో గౌరవం అన్నీ ఉన్నాయి. ఒక సామాజిక, ఆర్థిక హోదాను అనుభవిస్తున్న మారుతీరావు మొదటిసారి షాక్ తిన్నది తన బిడ్డ తక్కువ కులం అబ్బాయిని ప్రేమించడం. ఈ విషయం తెలియగానే బెదిరించాడు, కట్టేశాడు, కట్టుబాట్లలో పెట్టాలని ప్రయత్నించాడు. కానీ ఇవేమి పట్టించుకోకుండా కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. దాంతో బిడ్డపై ఉన్న ప్రేమ కాస్తా కోపంగా, ఆ కోపం కక్షగా మారింది. చివరికి నేరం చేసే వరకు తీసుకొచ్చింది. అక్కడ మారుతీరావు సంయమనం కోల్పోయాడు. ఏదో ఓ దశలో ఆ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తే సరిపోయేది. ఈరోజుల్లోనూ కులాంతర వివాహాలు సహజం. కానీ అది సహించలేకపోయారు. తన అహం, తత్వం వల్ల బిడ్డ చేసిన పనిని అంగీకరించలేకపోయాడు. ఆ తర్వాత వాళ్ల మానాన వాళ్లను వదిలేసి ఉంటె సరిపోయేది. కానీ ఏకంగా అల్లుడు ప్రణయ్‌ ను హత్య చేయించాడు. ఇదే మారుతీరావు చేసిన సరిదిద్దుకోలేని తప్పు. ఎవరికీ సమాధానం చెప్పుకోలేని తప్పు. దీనితో అమృత దృష్టిలో, సమాజం దృష్టిలో విలన్‌ గా మారిపోయాడు.

పోలీసులకు దొరికాడు, కొన్ని రోజులు జైలుకు వెళ్లాడు, మళ్ళీ బెయిల్‌ పై బయటికొచ్చాడు. అల్లుడు చనిపోయినా సరే, తన బిడ్డ భర్త కుటుంబాన్నే అంటిపెట్టుకుని ఉన్నది తప్ప ఇతనికి భయపడలేదు, లొంగిపోలేదు, తండ్రి ఎంత బ్రతిమలాడిన ఇంటికి రాలేదు. ఇది మారుతీరావు అహంపై పడ్డ పెద్ద దెబ్బ. దీనికితోడు సమాజం నుంచి సూటిపోటి మాటలు, ఎత్తిపొడుపులు, వెనుక నుంచి దెప్పిపొడుపులు ఉండనే ఉన్నాయి. తనకు సంబంధించిన షెడ్‌ లో ఓ పాత కుళ్లిపోయిన శవం బయటపడిందనేది వార్త ఈ మధ్యనే వచ్చింది. నేను దిద్దుకోలేని తప్పు చేశాను అని ఈమధ్య మారుతీరావు కొందరి దగ్గర అంటున్నాడట. దానిని బట్టి చూస్తే తను చేసింది తప్పే అని బహిరంగంగా అంగీకరించి, చట్టపరమైన విచారణకు అలాగే నిలబడి ఉండి ఉంటే బాగుండేదేమో. ప్రాయశ్చితం అనుకున్నాడో, ఎవరో తనను శిక్షించేదేముంది, నేనే విధించుకుంటాను అనుకున్నాడో తెలీదు కానీ తానె ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కథకు ఓ ముగింపు పలికాడు. ఈ మొత్తం కథలో బిడ్డ బాధితురాలే, తాను బాధితుడే. నిజానికి ఈ కథల్లో విజేతలు ఎవరూ ఉండరు. అంతిమంగా ఈ కథలో నీతి ఏమిటి..? ఉద్వేగం ఉన్మాదంగా మారితే చివరకు అందరూ బాధితులే అవుతారు అని. మారుతీరావుది ఒక అతి పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ…

Content above bottom navigation