మారుతీరావు ఆత్మహత్యకు తమ్ముడితో ఆస్తి వివాదాలే కారణమా? బయటపడ్డ సంచలన నిజాలు

132

తెలుగు రాష్ట్రాల్లో మిర్యాలగూడ ప్రణయ్ హత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు, సెప్టెంబ‌ర్ 14న ప్రణయ్‌ని అత్యంత దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించాడు,అంతే కాకుండా తానే చంపించినట్లు మీడియా, పోలీసుల ముందు ప్రకటించాడు. మారుతీరావు 7 నెలలుగా వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అనంతరం గత ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌పై విడుదల బయట తిరుగుతున్నారు.అయితే ఇప్పుడు ఈ కేసులో మరొక ట్విస్ట్ జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతీరావు ఆత్మహత్య సంచలనంగా మారింది.

బెయిల్ పై విడుదల అయినా ఆయన ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు సమాచారం. పని ఉంటే కానీ మిర్యాలగూడ వెళ్లడం లేదని తెలుస్తోంది. అకస్మాత్తుగా ఆయన విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆస్తి పంపకాల విషయంలో వివాదాలు జరుగుతుండడంతో ఆయన మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అలాగే ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావుతో పాటు ఆయన సోదరుడు కూడా జైలు పాలయ్యడు. బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత సోదరుల మధ్య ఆస్తికి సంబంధించి వివాదాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల ఆస్తిని తన కుమారుల పేరు మీద రాయాలని సోదరుడు అన్న మారుతీరావును ఒత్తిడి చేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూతరు వెళ్లిపోయిన నేపథ్యంలో ఆస్తిని తన కొడుకుల పేరిట రాయాలని తమ్ముడు అన్నతో గొడవపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. సోదరుడితో వివాదాలు, పోలీసు కేసుల నేపథ్యంలో మారుతీరావు ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. బెయిల్‌ బయటకు వచ్చిన తరువాత కూతురు అమృతతో మారుతీరావు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

ప్రణయ్ హత్య కేసులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి తన పేరిట రాస్తానని మారుతీరావు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అందులో భాగంగా ఆమెతో మాట్లాడేందుకు మధ్యవర్తులను కూడా పంపించగా ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. తనకు ఆస్తి అవసరం లేదని, తన భర్తను చంపిన వారికి శిక్ష పడాల్సిందేని అమృత స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో బెయిల్‌పై బయటికొచ్చినప్పటి నుంచి తండ్రి నుంచి బెదిరింపులు వస్తున్నాయని అమృత పోలీసులకు ఫిర్యాదు చేయడం మరో సంచలనంగా మారింది. వరుస పోలీస్ కేసులు, సోదరుడితో ఆస్తి వివాదాలు, కుమార్తె దూరమవడంతో మారుతీరావు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Content above bottom navigation